- గ్యాస్, ఎరువులకు నిధులు తగ్గింపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో సబ్సిడీలపై కోతలు కనిపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం కన్నా తాజా బడ్జెట్‌లో కోతల పర్వం స్పష్టంగా కనిపించింది. ఒక్క ఆహార సబ్సిడీకి గతంలో చేసిన వ్యయం కన్నా ఈసారి స్వల్పంగా పెంపుదల కనిపించింది. ఇది మినహాయిస్తే మిగిలిన రంగాల్లో నిధులు తగ్గించి ప్రతిపాదించారు. ప్రధానంగా గ్యాస్ సబ్సిడీ నిధులపైనా కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఆహార సబ్సిడీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.20.52 లక్షల కోట్లు కేటాయించగా, చివరికి రూ.19.74 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈసారి బడ్జెట్‌లో రూ.20.34 లక్షల కోట్లు కేటాయించారు. అరటే గత కేటాయింపుల కన్నా ఈసారి తగ్గుదలే కనిపించింది. ఇక ఎల్‌పిజి సబ్సిడీకి కోతలు పడ్డాయి. గతేడాది రూ.14,700 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి కేవలం రూ.12,100 కోట్లు కేటాయింపులు చేశారు. అలాగే పౌష్టికాహారం, ఎరువుల సబ్సిడీలపైనా తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఈ రెండు రంగాలకు కలిపి గతేడాది రూ.1,71,298 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి బడ్జెట్‌లో రూ.1,67887 కోట్లే కేటాయించారు. అలాగే పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఇచ్చే వడ్డీ రాయితీలు కూడా ఈసారి బడ్జెట్‌లో కుదించారు. అలాగే మార్కెట్ ఇరటర్వెన్షన్ స్కీమ్, నార్త్, ఈస్ట్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలపైనా వేటు పడింది.
ధరల నియంత్రణలో వెనుకంజ
దేశ వ్యాప్తంగా ధరలను నియంత్రించేందుకు కావాల్సిన నిధులపైనా భారీగా కోతలు విధించింది. గతేడాది ఏడు వేల కోట్లు ఖర్చు చేయగా, ఈసారి కేవలం రూ.4,019 కోట్లు కేేటాయించడం గమనార్హం. ఇప్పటికే ధరల పెరుగుదలపై పేద వర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిధులు పెంచడంపోయి తగ్గించడం చర్చనీయాంశమైంది.