సబ్సిడీ విత్తనాల్లో జాప్యం

  • మొదలే లేని వేరుశనగ సేకరణ
  • తతిమ్మా సీడ్‌ కూడా అంతే
  • ఫైనల్‌ కాని టెండర్లు 
  • తరుముకొస్తున్న ఖరీఫ్‌
  • ముందే వర్షాలొస్తాయన్న సంకేతాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేయ దలిచిన విత్తనాల సేకరణలో తీవ్ర జాప్యం నెలకొంది. మరో రెండు మూడు వారాల్లో సీజన్‌ ప్రారంభమవుతుండగా ఇప్పటి వరకు విత్తనాల సేకరణకు వ్యవసాయ, ఎపి సీడ్స్‌ విభాగాలు ముందస్తు కార్యాచరణ మొదలు పెట్టలేదు. కేవలం ప్లాన్‌, జిల్లాల వారీ కేటాయింపులతో కాలక్షేపం చేస్తున్నాయి. ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే విత్తనాల్లో వేరుశనగ అత్యధికంకాగా నేటికీ ఆ విత్తనాల సేకరణ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. ఎంత మొత్తంలో సేకరించాలి, ఒక్కో రైతుకు ఎంత పరిమాణంలో ఇవ్వాలి, కిలోకు సేకరణ ధర, సబ్సిడీ భాగం, సబ్సిడీ పోను రైతులు చెల్లించాల్సిన నాన్‌ సబ్సిడీ అమౌంట్‌, ఫైనల్‌గా అమ్మకపు ధర.. ఇవేమీ ఖరారు కాలేదు. ధరలు ఖరారు కానందున టెండర్లు సైతం ఫైనల్‌ కాలేదు. దాంతో వేరుశనగ సాగయ్యే రాయలసీమ జిల్లాల్లో రాయితీ విత్తనాల పంపిణీపై సర్వత్రా అయోమయం నెలకొంది. సాధారణ రోజుల్లోనే రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ మే రెండు మూడు వారాల్లో మొదలవుతుంది. అప్పటికి అన్నీ ముగించి రాయితీ విత్తనాలు కావాల్సిన రైతుల పేర్లతో ముందస్తు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు ఇబ్బందులు పడకుండా మరింత ముందుగా విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం మే మూడోవారానికి కూడా సేకరణ ప్రారంభించక పోవడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది.

తొలి సీజన్‌లోనే..

నిరుడు సాధారణ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ ఉన్నప్పటికీ విత్తనాల పంపిణీ మే 24న అనంతపురం, 29న శ్రీసత్యసాయి జిల్లాలో లాంఛనంగానైనా ప్రారంభించారు. అప్పుడు ఎన్నికల కమిషన్‌ అనుమతులు కావాల్సి వచ్చింది. నిరుడు కరువు వలన వేరుశనగ సగమే సాగైంది. వేసిన పంట చేతికి రాలేదు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే తొలి ఖరీఫ్‌. మొదటి సీజన్‌లోనే విత్తనాల సేకరణలో జాప్యం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారంనాటి సమీక్షలో కేవలం ఉద్యాన పంటల సాగుపైనే ఫోకస్‌ పెట్టారు తప్ప తరుముకొస్తున్న ఖరీఫ్‌నకు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించలేదని సమాచారం. దాంతో వ్యవసాయశాఖ, ఎపి సీడ్స్‌ వేరుశనగతో పాటు ఇతర రాయితీ విత్తనాల సేకరణపై నాన్చుడు ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అక్రమాలకు ఆస్కారం

చివరి నిమిషంలో విత్తనాలు సేకరిస్తుండటంతో సేకరణ ధర పెంపు, అమ్మకపు ధర పెంపు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక మేరకే సీలింగ్‌ విధించి సబ్సిడీ ఇస్తుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. మరోవైపు చివరాఖరులో నాణ్యతలేని, నాసిరకం విత్తనాలను హడావుడిగా రైతులకు అంటగట్టడం జరుగుతోంది. అదనపు భారంతో పాటు నాణ్యతలేని విత్తనాలతో దిగుబడులు తగ్గి, మొత్తానికే మొలకెత్తక రైతులు నష్టపోతున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు, ఈ వ్యవహారాన్నంతా పర్యవేక్షించే ఉన్నతస్థాయి వ్యక్తులు అయాచితంగా లాభ పడుతున్నారు. ఇదే అదనుగా అవినీతి కిందికంతా పాకింది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతోంది. వేరుశనగలో మరీ ఎక్కువ.

తగ్గుతున్న సాగు

వర్షాభావం, లేదంటే అకాల, అధిక వర్షాలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేమి, వాణిజ్య పంటల విస్తరణ.. ఇత్యాది కారణాల వలన రాయలసీమలో సంప్రదాయ పంట వేరుశనగ సాగు అంతకంతకూ తగ్గుతోంది. ఒకప్పుడు సాధరణ సాగు 20 లక్షల ఎకరాల వరకు ఉన్నది కాస్తా ఇప్పుడు 14 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఆ మాత్రం సైతం సాగు కావట్లేదు. నిరుడు ఖరీఫ్‌లో 7.2 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ముందటేడు 6.37 లక్షల ఎకరాల్లో వేశారు. కాగా ఈ ఏడాది 2.95 లక్షల క్వింటాళ్ల విత్తనాల సేకరణకు ప్రాథమికంగా ప్లాన్‌ రూపొందించారు. అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాకు 97,500 క్వింటాళ్లు, అనంతపురానికి 76,137 క్వింటాళ్లను కేటాయించారు.

➡️