బెట్టింగ్‌ల బరితెగింపు

May 16,2024 04:20 #2024 elction, #ap election, #bettings
  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పందేలు
  • విలువ రూ.20 వేల కోట్లకుపైమాటే..
  • రంగంలోకి మాఫియా, బ్రోకర్లు, బుకీలు
  • సైకలాజికల్‌ గేమ్‌
  • చేష్టలుడిగిన వ్యవస్థలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి  : మొన్నటి దాకా వేసవి ఉక్కపోతలను తలదన్నే ఎన్నికల హీట్‌తో గడిపిన ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌ ముగిశాక దిశ మార్చుకొని బెట్టింగ్‌ ఫీవర్‌లోకి జారుకుంది. పోలింగ్‌కు ఎంతో ముందు నుంచే పందేల జోరు మొదలుకాగా సోమవారం ఓటింగ్‌ ముగిశాక తారా స్థాయికి చేరాయి. ఓట్ల లెక్కింపు ఇంకా మూడు వారాలుండగా, ఈ సుదర్ఘీ నిరీక్షణ కు బెట్టింగ్‌ల టెన్షన్‌ తోడు కావడంతో ఈ వ్యవహారాలలో భాగస్వాములయ్యే వారి ఉత్కంఠ చెప్పనలవి కాదు. తెలుగు రాష్ట్రాల్లో, మరీ ఎ.పి.లో ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో ఎంఎల్‌ఎ అభ్యర్థి పెడుతున్న ఖర్చు రూ.50 నుంచి 100 కోట్ల వరకు ఉంటోంది. ఇక ఎంపి అభ్యర్ధులైతే రూ.వందల కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ ఒరవడి అభ్యర్ధుల గెలుపోటములపై సాగుతున్న బెట్టింగ్‌ల్లోకీ చొరబడింది. గతంలో బెట్టింగ్‌లంటే రూ.వేలల్లో నగదు రూపంలో ఎక్కడో ఉండేవి. రాను రాను పందేలు కూడా మోడరనైజ్‌ అవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడై కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లు, యాప్‌ల వంటి డిజిటల్‌ వ్యవస్థలతో పాటు పెద్ద ఎత్తున ఆఫ్‌లైన్‌, మాన్యువల్‌ బెట్టింగ్‌లూ సాగుతున్నాయి. ఈ పందేలు కూడా వివిధ కేటగిరీల్లో జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఎ.పి. ఎన్నికల ఫలితాలపై రూ.20 వేల కోట్ల వరకు బెట్టింగ్‌లకు అవకాశం ఉందని ఈ రంగంలో ఆరితేరిన బెట్టింగ్‌ రాయుళ్ల అంచనా. అంతకంటే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. పందేలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎపి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల్లో విరివిగా పాల్గొంటున్నారు.

సవాలక్ష కోణాలు
సాధారణంగా ఎన్నికల పందేలంటే… ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి అనే బెట్టింగ్‌లు గతంలో ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఫలాన పార్టీకి ఇన్ని సీట్లకు తగ్గవు అనే దాంతో మొదలుకొని నియో జకవర్గాలపైనా, మెజార్టీపైనా.. ఇలా అనేక అంశాలపై బెట్టింగ్‌లు తెరమీదికొచ్చాయి. పులివెందులలో జగన్‌ మెజారిటీపైనా, కుప్పంలో చంద్రబాబు మెజారిటీపైన, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు, మెజార్టీపైన, కడప లోక్‌సభలో వైఎస్‌ షర్మిల గెలుపుపైన, రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పైన… ఇలా అనేకానేక రకాల బెట్టింగ్‌లు పురుడు పోసు కుంటున్నాయి. అలాగే టిడిపి కూటమికి ఎంఎల్‌ఎ సీట్లెన్ని, ఎంపి సీట్లెన్ని, టిడిపికి ఎన్ని ఎంఎల్‌ఎ, ఎంపి సీట్లొస్తాయి, కూటమిలోని బిజెపికి, జనసేనకు ఎన్ని ఎంఎల్‌ఎ, ఎంపి సీట్లొస్తాయి, వైసిపికి ఎన్ని సీట్లొస్తాయి, అధికారం నిలబెట్టుకుంటుందా లేదా… ఇలా పందేలు కాస్తున్నారు.

వ్యూహాత్మకంగా కూపీలోకి..
ఐపిఎల్‌, వరల్డ్‌కప్‌, రేస్‌ కోర్స్‌ మాదిరిగా ఎలక్షన్‌ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. జూదాన్ని మించిపోయింది. వీటిలోనూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. బుకీలు, మాఫియాలు, బ్రోకర్లు బయలుదేరారు. వీరిని కొన్ని రాజకీయపార్టీల నేతలు వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐలు, రియల్‌ ఎస్టేట్‌, హవాలా ముఠాలు, కార్పొరేట్‌ సంస్థలు పందేల వైపు యువతను, షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించాలనుకునే బలహీనత ఉన్న వారిని, పరి పరి విధాలుగా బట్టలో వేసుకుంటున్నాయి. పందేల కూపీలోకి లాగుతున్నాయి. కొన్ని పార్టీల అభ్యర్ధులు, నాయకులు తమ పార్టీ వైపు కాకుండా ప్రత్యర్థి పార్టీల వారు గెలుస్తారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎక్కడ ఖర్చు చేశామో అక్కడే రాబట్టుకోవాలనే సిద్ధాంతం కొందరు అభ్యర్ధుల్లో బయలుదేరింది. పందేల వైపు ఆకర్షించడమనేది సైకలాజి కల్‌ గేమ్‌ అని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షేర్‌ మార్కెట్‌ వైపు లాగినట్లే ఎన్నికల పందేల వైపు కూడా లాగుతున్నారు.

ఆస్తులూ పెడుతున్నారు…
బెట్టింగ్‌ల్లో నగదుతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌నూ ఉపయోగిస్తున్నారు. బెట్టింగ్‌ రూ.వెయ్యి నుంచి కోట్లల్లో ఉంటోంది. డబ్బు అందుబాటులో లేని వాళ్లు తమ ఆస్తులను, దస్తావేజులను పందెంలో పెడుతున్నారు. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లపై ఆస్తులకు సంబంధించి అగ్రిమెంట్‌లు సైతం రాసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లనేవి నయా-ఉదారవాద విధానాలు దేశంలో ప్రవేశించాకనే తారా స్థాయికి చేరడంతోపాటు వ్యవస్థీకృతం అయ్యాయని, వెర్రి తలు వేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదొక సామాజిక రుగ్మతగా రూపాంతరం చెందిందని సామాజిక విశ్లేషకులు పేర్కొంటు న్నారు. పందేల్లో ఓడిన సందర్భాల్లో ఆస్తులు, డబ్బు పోగొట్టుకొని పలువురు బికారులైన ఉదంతాలున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలూ ఉన్నాయని పోలీస్‌ అధికారులు గుర్తు చేస్తున్నారు. బహిరంగంగా వేల కోట్లు చేతులు మారుతున్నా బెట్టింగ్‌లను నిరోధించేందుకు చట్టాలు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల కమిషన్‌, ఐటి, ఇడి వంటి వ్యవస్థలు, సైబర్‌ క్రైం విభాగాలు, చోద్యం చూస్తున్నాయి. కోడి పందేలు, చీట్ల పేక, కేసినో వంటి వాటితో పోల్చితే ఎన్నికల బెట్టింగ్‌లు చాలా చాలా తీవ్రమైన నేరం. సమాజంపై ప్రభావం చూపుతాయి. పాలకుల, ప్రభుత్వాల అండదండలు పుష్కలంగా ఉంటేనే బెట్టింగ్‌ల బరితెగింపు సాధ్యమవుతుందన్నది తిరుగులేని సత్యం.

➡️