- ప్రమోషన్ ఇచ్చినా జీతాలివ్వని వైనం
- అరియర్స్ బకాయిలు రూ.6.80 కోట్లు
- రాయలసీమ పరిధిలో కాంట్రాక్టు కార్మికుల వ్యథ
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పట్ల సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కం) వివక్ష పాటిస్తోంది. వాచ్ అండ్ వార్డ్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగోన్నతి కల్పించి ఐదేళ్లవుతున్నా ఇంతవరకూ పెంచిన జీతాలివ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. వారికి వేతనం రూ. 28 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.18 వేలు ఇచ్చి, సబ్‌స్టేషన్ల వద్ద 20 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం అక్షరాలా రూ.6.80 కోట్లు. రాయలసీమలోని ఎనిమిది జిల్లాల పరిధిలోని కాంట్రాక్టు కార్మికులు పరిస్థితి ఇది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా తిరుపతి డిస్కం కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
డిస్కం పరిధిలో వాచ్ అండ్ వార్డ్, షిఫ్ట్ ఆపరేటర్లు కలిపి మొత్తం 700 మందికి పైగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జెఎల్‌ఎం గ్రేడ్-2 పోస్టులు సచివాలయం పరిధిలో సబ్ ఆపరేటర్లుగా తీసుకున్నారు. వాచ్ అండ్ వార్డుగా పనిచేస్తున్న 500 మందిని లైన్ ఆపరేటర్లుగా, బిల్లు కలెక్టర్లుగా, మీటర్ రీడింగ్ ఆపరేటర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. వాచ్ అండ్ వార్డు వారికి గతంలో రూ.13 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం బదిలీ చేయడంతో వారి జీతం రూ. 23 వేలయ్యింది. ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్న 200 మందికి షిఫ్ట్ ఆపరేటర్లుగా సబ్‌స్టేషన్‌లో ఉద్యోగోన్నతి కల్పించారు. వీరి జీతం రూ. 28 వేలు ఇవ్వాల్సి ఉంది. వీరికి కేవలం రూ.18,000 చెల్లిస్తున్నారు. డిస్కం ఉన్నతాధికారులు వీరిపై వివక్ష పాటిస్తూ ఉద్యోగోన్నతి కల్పించినా, పాత జీతాలనే ఇస్తుండటం గమనార్హం. తమ పట్ల వివక్ష పాటిస్తున్నారని, ఉద్యోగోన్నతికి తగినట్లుగా జీతాలివ్వాలని డిస్కం సిఎండి నుంచి, సిఎం వరకూ తమ బాధను విన్నవించుకున్నారు. అయినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కారు.
ప్రమోషన్‌కు తగిన జీతాలివ్వాలి : తుమ్మల కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌యూనియన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా
ప్రధాన కార్యదర్శి
మాకు ప్రమోషన్ కల్పించినా జీతం ఇవ్వలేదు. సబ్‌స్టేషన్‌లో 20 గంటల పాటు పనిచేసే మాకు రూ. 28వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.18వేలే ఇస్తున్నారు. దాంతో పాటు మా కార్మికుల అరియర్స్ రూ.6.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రమాదంతో కూడిన విధులు నిర్వహిస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ డిస్కం పరిధిలోనే కాంట్రాక్టు కార్మికులకు ఈ అన్యాయం జరుగుతుంది.