విశాఖ ఉక్కుపై కొనసాగుతున్న పాలకుల దొంగాట
ప్లాంట్ స్థాపనకు రూ.4,890 కోట్లు
డివిడెండ్లు, పన్నుల ద్వారా ప్రభుత్వాలకు సమకూరిన ఆదాయం రూ.52 వేల కోట్లు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి రూ.వేల కోట్లు డివిడెండ్లు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నష్టాల నెపం మోపుతున్నాయి. దీన్ని నిజమే అనుకునే వారూ లేకపోలేదు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంపై చేస్తోన్న కుట్రలు తెలియనవి కాదు. ‘ఒక మంచి కుక్కపై పిచ్చి కుక్క అని ముద్రవేయడం, జనమంతా అది నిజమేనని అనుకునేలా చేయడం’ ప్రస్తుత పాలకుల సిద్ధాంతంగా ఉంది. వైజాగ్ స్టీల్ విషయంలోనూ 1,395 రోజుల క్రితం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే పని చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, దీన్ని భరించలేమని పేర్కొంటూ ఓ రాయి విసిరారు. ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు. తమపై నష్టాల పేరిట వేసిన అపవాదును తొలగించుకునేందుకు, ప్లాంట్‌ను రక్షించుకునేందుకు నాటి నుంచీ ఉక్కు కార్మికులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. తొలి నుంచీ విశాఖ ఉక్కుపై మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ పెద్దలు రోత పుట్టించే పాత వాదనలను ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గతంలో మాట్లాడుతూ మిగతా సంస్థల కంటే ఇక్కడ అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని, నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని, సెయిల్‌లో విలీనానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో భాగస్వామ్య పక్షాలు టిడిపిగానీ, జనసేనగానీ నోరు విప్పలేదు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ పరిరక్షణకు తీసుకున్న చర్యలు శూన్యమేనని చెప్పాలి. పాలనా పగ్గాలు చేపట్టి ఆరు నెలలైనా ‘ప్రైవేటీకరణ జరగదు’ అనే మాటనే వల్లె వేస్తున్నారు తప్ప, కేంద్రం నుంచి ఆ మాటను చెప్పించడం లేదు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపి శ్రీభరత్ కూడా ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రయత్నాలేవీ లేవు.
నష్టాలు నిజమేనా?
విశాఖ ఉక్కుపై ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఎంత? ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో ఎంత వెళ్లింది? పొందిన ఆదాయం ఎంత? లాభాలొచ్చినప్పుడు డివిడెండ్లు తీసుకుని, నష్టాలొచ్చినప్పుడు పెట్టుబడి ఎందుకు పెట్టడం లేదు? సహాయం ఎందుకు అందించడం లేదు? అన్న చర్చ కార్మికుల్లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ జరుగుతోంది. ఉక్కు పరిశ్రమ ప్రారంభ సమయం 1980వ దశకంలో కేవలం రూ.4,890 కోట్లును మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా సమకూర్చింది. 2024 వరకూ కేంద్రానికి డివిడెండ్లు, పన్నుల రూపంలో వైజాగ్ ఉక్కు నుంచి రూ.40 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.12 వేల కోట్లు వెళ్లాయి. తాజాగా జీతాలకు రూ.100 కోట్లు, ప్లాంట్‌లో విద్యుత్ ఛార్జీల ఖర్చు కింద రూ.80 కోట్లను సైతం కేంద్రం ఇవ్వడం లేదు. లాభాలొచ్చినప్పుడు ఆదాయాన్ని ఆర్జించిన కేంద్ర ప్రభుత్వం నష్టాల ప్రచారంతో రూ.లక్షల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమను అదానీ, అంబానీ, మిట్టల్ లేదా టాటా ఇలా ఎవరికో కట్టబెట్టేయాలన్న ఆలోచనతో ఉంది.బిజెపి చేస్తున్న ఈ కుట్రలను కార్మికవర్గం ప్రతిఘటిస్తోంది.
అప్పు ఎంత ? ఆస్తులెలా ఉన్నాయి!
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రూ.20 వేల కోట్లు అప్పు పడిన మాట వాస్తవమే. ప్రారంభం నుంచి ఇప్పటివరకూ సొంత గనులను కేంద్రం ఇవ్వకపోవడంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ గనుల సంస్థల వద్ద ముడిసరుకు కొనాల్సి వస్తోంది. గనులు కేటాయించి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడిపితే అత్యంత సునాయాసంగా ఉత్పత్తి చేసి కార్మికులు ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తారు. 2015 నాటికి 120 శాతం రికార్డు ఉత్పత్తి సాధించి రూ.12,963 కోట్లు లాభాన్ని కార్మికులు తెచ్చి చూపించారు. లక్షల కోట్ల రూపాయలను దేశంలోని కార్పొరేట్లకు రుణ మాఫీ చేసిన మోడీ సర్కారు… ప్రభుత్వ ఉక్కు పరిశ్రమకు రుణ మాఫీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైపెచ్చు రూ.4 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును కేవలం రూ.30 వేల కోట్లకే కట్టబెట్టే కుట్రలకు పాల్పడడం ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం తలపెట్టడమే.
దేశంలో అప్పుల్లేని పరిశ్రమ ఉందా?
దేశంలో పలు పరిశ్రమలు అప్పుల్లో ఉన్నాయి. కానీ, విశాఖ ఉక్కుపైనే కుట్రలు కొనసాగుతున్నాయి. పరిశ్రమల అప్పుల ఈ కింది విధంగా ఉన్నాయి.
విశాఖ ఉక్కు – రూ.20 వేల కోట్లు
జిందాల్ – రూ.45 వేల కోట్లు
జెఎస్‌డబ్ల్యు – రూ.43 వేల కోట్లు
టాటా – రూ.83 వేల కోట్లు
సెయిల్ – రూ.41 వేల కోట్లు