ఉద్యానవనానికి ఊతమిదేనా.?

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

         అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలకం ఊద్యానవన పంటలని ప్రభుత్వం పెద్దఎత్తున చెబుతోంది. అందుకే ఈ జిల్లా ఉద్యానవన హబ్‌గానే కాకుండా ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారుస్తామని నేతలు ప్రకటిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఈ ఏడాది ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు చూస్తే ‘మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడపదాటం లేదన్న’ నానుడి ఆచరణలో అద్దం పడుతోంది.

అనంతపురం జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు రూ.13.03 కోట్లు. ప్రధానంగా మూడు పథకాల కింద ఉద్యానవన శాఖకు నిధులు కేటాయిస్తారు. ఇందులో సమగ్ర ఉద్యానవన అభివృద్ధి పథకం (ఎఐడిహెచ్‌) కింద రూ.10.41 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.1.51 కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కెవివై) కింద కేటాయించింది. రూ.1.58 కోట్లు అయితే ఖర్చు చేసింది సున్నా కావడం గమనార్హం. రాష్ల్రీయ కృషి వికాస్‌ యోజన ఆయిల్‌ఫామ్‌, బాంబూ మిషన్‌కు రూ.1.03 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది రూ.37.81 లక్షలు. ఈ మూడు పథకాలకు కలిపి అనంతపురం జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు రూ.13.03 కోట్లు, ఇందులో ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు చూస్తే రూ.1.89 కోట్లు మాత్రమే. కేటాయించిన దాంట్లో ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు కేవలం 5.5 శాతం నిధులు మాత్రమే కావడం గమనార్హం. మరో మాసంతో ఈ ఆర్థిక సంవత్సరమే ముగియనుంది. ఒక్క నెలలోపు తక్కిన నిధులు కేటాయించడం, వినియోగించడం ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉంది.

డ్రిప్‌దీ అదే పరిస్థితి

            ఉద్యానవన పంటల అభివృద్ధిలో డ్రిప్‌ కీలకమైంది. ఇదైనా లక్ష్యానికి అనుగుణంగా నడుస్తోందా అంటే అదీ లేకుండా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 37,500 హెక్టార్లకు అనుమతి వచ్చింది. దీని కోసం ఇప్పటి వరకు 39,170 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. దీని విస్తీర్ణంలో చూసినప్పుడు 52,736 హెక్టార్లలో డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆమోదం తెలిపిన వరకే చూస్తే 20,530 రైతులకు సంబంధించి 24,980 హెక్టార్లకు ఇచ్చారు. ఇప్పటి వరకు మంజూరైనవి చూస్తే 9392 హెక్టార్లకే ఉంది. ఇంకా పెద్దఎత్తున జరగాల్సి ఉంది.

25 శాతం వృద్ధి సాధ్యమేనా ?

అనంతపురం జిల్లాలో ఏటా 25 శాతం ఉద్యానవన పరిధిలో అభివృద్ధి సాధిస్తామని ఇటీవల అనంతపురం నగరంలో నిర్వహించిన హార్టికల్చర్‌ కాంక్లేవ్‌లో జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రకటించారు. ఇప్పుడు ఏటా వస్తున్న దిగుబడులు 25 లక్షల టన్నులను 29 లక్షల టన్నుల దిగుబడి తీసుకెళుతామని ప్రకటించారు. రైతుకు ఊతమందకుండా 25 శాతం వృద్ధి ఎలా సాధ్యమని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా మార్కెటింగ్‌ సౌకర్యం లేకుండా విస్తరణ ఎలా సాధ్యమని అడుగుతున్నారు. మార్కెటింగు మౌలిక సదుపాయల కల్పనకు ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన రూ.1.42 కోట్లలో ఒక్క రూపాయి నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇప్పటికే ఉద్యానవన పంటలను పండించిన రైతులు పంటను అమ్ముకోలేని పరిస్థితులున్నాయి. తాజాగా మిరప రైతు ధరలేక గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యావన పంటలను ప్రోత్సహిస్తామన్న దానిలో వాస్తవికత ఎంతన్న ప్రశ్నలు రైతుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.

➡️