పడకేసిన బిందు సేద్యం!

  • రూ.1,107 కోట్ల చెల్లింపులకు కంపెనీలు పట్టు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : రాష్ట్రంలో బిందు సేద్యం పడకేసింది. 2024-25 సంవత్సరానికి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద రాష్ట్రానికి రూ.2,673 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో తొలి విడతగా రూ.950 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉండగా రూ.77 కోట్లు విడుదల చేసింది. ఈ పథకానికి కేంద్రం 33 శాతం, రాష్ట్రం 57 శాతం, రైతులు పది శాతం నిధులు వెచ్చించాలి. ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఎపిఎంఐపి) కింద రాష్ట్రంలో 7.41 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకుంది. పంటల సాగు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఎపిఎంఐపి జూన్‌లో శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,29,864 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా అనంతపురంలో 35,394, సత్యసాయి 34,386, చిత్తూరు 24,701 అతి తక్కువ విశాఖపట్నం 141, కోనసీమ 290, పశ్చిమ గోదావరిలో 382 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కడప జిల్లాలో 77,805 ఎకరాల లక్ష్యానికిగానూ 19,000 మంది, అన్నమయ్య జిల్లాలో 88,920 ఎకరాల లక్ష్యానికి గానూ 24,000 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 336 దరఖాస్తులను స్క్రూటినైజ్‌ చేసి కలెక్టర్లకు ప్రతిపాదనలను అందజేశారు. మిగితా జిల్లాల్లో దరఖాస్తులు స్క్రూటినైజ్‌ దశలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎంఐ కంపెనీలకు గతంలో బకాయి ఉన్న రూ.1,107 కోట్లు చెల్లిస్తేనే క్షేత్రస్థాయిలో డ్రిప్‌ పరికరాలను ఏర్పాటు చేస్తామని పట్టుబట్టడంతో రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయిలో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎపిఎంఐపి రాష్ట్ర ఉన్నతాధికారులు చేతులు ఎత్తేయడంతో ఎంఐ కంపెనీల నాయకులు సిఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు.

➡️