డిఎస్సీ ప్రత్యేకం-ఎస్‌ఎ/ఎస్‌జిటి

May 13,2025 05:19
  • విద్యాదృక్పథాలు-విద్యాహక్కుచట్టం-2009

2010 ఏప్రియల్‌ 1వ తేదీ విజ్ఞాన సముపార్జనా ప్రక్రియలో ఒక చిరస్మరణీయమైన దినంగా పరిగణించబడే రోజు. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలందరూ పాఠశాలకు దూరంగా ఉండటానికి వీల్లేకుండా నాణ్యమైన విద్యను పొందటానికి వీలుగా ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం-2009 భారత పార్లమెంట్‌ ద్వారా రూపొందించబడి ఆగస్టు 26, 2009న రాష్ట్రపతి ద్వారా ఆమోదించబడి 2010 ఏప్రియల్‌ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.
చట్టం పేరు : ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009
ఏ ప్రాంతాల వారికి వర్తిస్తుందంటే : జమ్మూ కాశ్మీర్‌ మినహా భారతదేశమంతటికి
అమలు తేదీ : 01-04-2010 (అధ్యాయం 1, సెక్షన్‌ 1)
ఏ వయస్సువారంటే : 6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలు
చట్టంలోని అధ్యాయాలు : 07
సెక్షన్లు : 38
షెడ్యూలు : 01 (బడికి నియమాలు, ప్రామాణికాలు)

చట్టంలోని కొన్ని ముఖ్యాంశాలు
చట్టంలోని కొన్ని ముఖ్యాంశాలు
1. 6 నుంచి 14 సంవత్సరాలున్న బాలబాలికలందరికీ పరిసరప్రాంత పాఠశాల ఎలిమెంటరీ విద్య (1 నుండి 8వ తరగతి వరకూ) పూర్తి చేసే వరకూ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది. (అధ్యాయం -II, సెక్షన్ 3, సబ్ సెక్షన్ -1).
2. పైన పేర్కొన్న విధంగా విద్యను పూర్తిచేయటానికి ఎలాంటి రుసుం, ఛార్జీలు, ఖర్చులను చెల్లించాల్సిన అవసరం బాలలకు లేదు.
(అధ్యాయం- II, సెక్షన్-
3. ລ້໖ ໑໓-2).
3. ఆరేళ్లు నిండిన బాలుడు/ బాలికను బడిలో చేర్చకపోయినా, లేదా చేర్చిన తరువాత ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోయినా వారిని వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. (అధ్యాయం- II, సెక్షన్
4. ప్రత్యేకంగా వయసు మించిన సందర్భంలో ప్రవేశం పొందినవారు 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకూ ఉచితవిద్యను పొందే హక్కు కల్గివుంటారు. అధ్యాయం-II, సెక్షన్ – 4).
5. ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తిచేసే సదుపాయం లేకుంటే కొన్ని ప్రత్యేక బడులకు తప్ప ఏ ఇతర బడికైనా బదిలీ హక్కు ఉంటుంది. ప్రధానోపాధ్యాయుడు బదిలీ సర్టిఫికెట్ను వెంటనే ఇవ్వాలి. (అధ్యాయం – II, సెక్షన్- 5).
6. పరిసర ప్రాంత పరిధిలో బడి లేకుంటే 3 సంవత్సరాలోపు బడిని సంబంధిత ప్రభుత్వాలు స్థాపిస్తాయి. అంతేకాకుండా నిధులను, జాతీయ పాఠ్యప్రణాళికను, ఉపాధ్యాయుల శిక్షణ, ప్రామాణికాలను అందజేస్తాయి. (అధ్యాయం-II, సెక్షన్-6, 7).
7. తమ బిడ్డ లేదా సంరక్షణలోనున్న బాలుడు/ బాలికను పరిసర ప్రాంతంలోని ఎలిమెంటరీ విద్యలో చేర్పించడం ప్రతి తల్లి/తండ్రి లేదా సంరక్షకుని బాధ్యత (అధ్యాయం -II, సెక్షన్- 10).
8. మూడు సంవత్సరాలకు మించిన బాలలను ఎలిమెంటరీ విద్యకు సంసిద్ధులను చేయటానికి ఆరేళ్ళు నిండే వరకు ఉచిత పూర్వపాఠశాల విద్యను అందించే ఏర్పాట్లు చేయబడతాయి. (అధ్యాయం-II, సెక్షన్ – 11).
9. ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అవాసప్రాంత బడి యొక్క బాధ్యత (అధ్యాయం -II, సెక్షన్ – 11). ఎలాంటి ఎంపిక విధానాలు (ఎంట్రన్స్ టెస్ట్) చేయరాదు. చేస్తే రూ.25 వేలు, రూ.50వేలు జరిమానా. (అధ్యాయం- IV, సెక్షన్ 13, 2.2. 2(໖)).
10. వయస్సు నిర్ధారణ చేయలేదన్న కారణంతో ఏ బాలుడికి, బాలికకు బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు. (అధ్యాయం -IV – 14, 2.2. 2).
. 11. బడిలో ప్రవేశం పొందిన బాలలను ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకూ ఏ తరగతి లోనైనా మళ్లీ కొనసాగించడం, బడి నుంచి తీసివేయటం చేయరాదు (అధ్యాయం – IV, సెక్షన్ 16).
12. ఏ బాలుడు, బాలికను కూడా శారీరక శిక్షకు, మానసిక వేధింపులకు గురిచేయ కూడదు. (అధ్యాయం – IV, సెక్షన్ 17).
13. గుర్తింపు లేకుండా బడిని స్థాపించడం, పనిచేయించడం చేయకూడదు. (అధ్యాయం –IV, సెక్షన్ – 18).
14. గుర్తింపు రద్దయిన తర్వాత బడినడిపితే రూ. లక్ష జరిమానా, (అధ్యాయం – 4, సెక్షన్ – 19, స.సె. 5).
15. ఉపాధ్యాయులు బడికి హాజరు కావడంలో సమయాన్ని, క్రమబద్ధతనూ పాటించాలి. పాఠ్యప్రణాళిక ప్రకారం పాఠశాలను చేపట్టి నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి. అవసరమైతే విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా అదనపు బోధనను అందించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. (అధ్యాయం- IV, సెక్షన్-24).
16. జనాభా గణన, వైపరీత్యాలలో సహాయ విధులు, ఎన్నికల విధులు మినహాయించి ఉపాధ్యాయులను ఏ ఇతర విద్యేతర పనులకు వినియోగించరాదు. (అధ్యాయం -IV, సెక్షన్ – 27).
17. పాఠ్యప్రణాళిక రాజ్యాంగ విలువలకు, బాలల సర్వతోముఖాభివద్ధికి తగిన విధంగా ఉండాలి. IV సెక్షన్ 29)
(అధ్యాయం
18. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకూ బాలలు ఎలాంటి బోర్డు పరీక్షకు హాజరుకానవసరం లేదు. పూర్తయ్యాక సూచిన విధానంలో ధృవీకరణ పత్రం జారీచేయబడుతుంది. (అధ్యాయం IV, సెక్షన్ 30) స.సె.1.2.)
19.బడి యాజమాన్యం సంఘం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటుచేయబడి బడి పనితీరును సమీక్షించటం, అభివృద్ధి ప్రణాళికలను తయారుచేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించటం చేస్తుంది. (అధ్యాయంIV, సెక్షన్ 21).
20. ఎయిడెడ్ పాఠశాలలు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ బడిలో చేర్చుకున్న పిల్లల్లో కనీసం 25 శాతానికి తగ్గకుండా 1వ తరగతిలో పేద పిల్లలను చేర్చుకోవాలి. ఎలిమెంటరీ వరకూ ఉచితంగా విద్యను అందించాలి. ఇందుకయ్యే ఖర్చును అన్ని ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుంది. (అధ్యాయం IV, సెక్షన్ 12)
21. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతులు బోధించటానికి 60 మంది పిల్లల వరకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు ముగ్గురు, 91 నుంచి 120 వరకు నలుగురు, 121 నుంచి 200 వరకూ ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి. 150 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండాలి. 200 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుతోపాటు 1:40 మించకుండా ఉపాధ్యాయులను నియమించాలి. బాలల సర్వతోముఖాభివృద్ధికై రూపొందించబడిన బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009ను పటిష్టంగా అమలుపర్చే క్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్య, విద్యేతర ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్చంధ సేవా సంస్థలు, మీడియా ప్రతినిధులు, ప్రజలంతా తమ వంతు సహకారాన్ని అందిస్తూ చట్టం విజయవంతం అయ్యేటట్లు కృషిచేయాల్సిన బాధ్యత ఉంది.

ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల నిబంధనలు
1.పాఠశాల యాజమాన్య కమిటీ, స్థానిక అధారిటీ ప్రత్యేక శిక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారికి శిక్షణను నిర్వహించాలి (నిబంధన 4.1).
2. 1-5 తరగతులు బాలలను వారి పరిసర ప్రాంతానికి 1 కి.మీ. నడవగలిగే దూరపులోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి. 6-8 తరగతుల బాలలను తమ పరిసర ప్రాంతానికి 3 కి.మీ. నడవగలిగే దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి (5.1).
3. వైకల్యంతో అందుబాటులో ఉన్న పాఠశాలలకు హాజరు కాలేని బాలల విషయంలో ప్రభుత్వం, స్థానికప్రభుత్వం సురక్షిత రవాణా ఏర్పాట్లను కల్పించడం లేదా అర్హతగల తల్లిదండ్రుల, సంరక్షకులకు ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా అలాంటి బాలలు పాఠశాలకు హాజరై మాధ్యమిక విద్యను పూర్తిచేయడానికి తగిన కృషి చేయాలి (నిబంధన 5.7).
4. ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న పాఠశాలల్లో చేరిన బాలలు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు, లేఖన సామగ్రి పొందడానికి అర్హులు (నిబంధన 6.1).
5. కులం, వర్గం, మతం లేదా లింగం కారణంగా వివక్షతలకు ఏ బాలుడు, బాలిక కూడా గురికాకుండా, ఏ ఒక్కరికి కులం, వర్గం, మతం, లింగం కారణంగా అడ్మిషను ఏ ప్రభుత్వ లేదా ప్రయివేటు పాఠశాల కూడా తిరస్కరించకుండా ప్రభుత్వం, స్థానికప్రభుత్వం నిర్ధారించాలి (నిబంధన 6.3).
6. ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు బోధించే వ్యత్యంతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి (నిబంధన 6.7). ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు తోడుగా నిలిచే విధంగా వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి (నిబంధన 6.8). ప్రత్యేక అవసరాలుగల పిల్లల గురించి పాఠశాల యాజమాన్య కమిటీలకు, ఇతర పౌరసమాజ సంస్థలకు శిక్షణ ఇవ్వాలి (6.9).
7. పుట్టినప్పటి నుండి 14 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు పిల్లలందరి రికార్డును ఇంటింటి సర్వే ద్వారా స్థానిక అథార్టీ తన పరిధిలో నిర్వహించాలి. పైతరగతికి వెళ్లేవారి వివరాలు, అభ్యసన సాధన, హాజరు, నమోదు, పర్యవేక్షణ కోసం ప్రతిఒక్కరికీ ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించాలి (నిబంధన 7.1).
8.పాఠశాలల్లో కేవలం పిల్లల విద్యా విషయక ప్రగతినే కాకుండా వారి నిలకడ, స్థాయిల వారీగా ఆశించిన మార్పులు సాధించడం, వలసలను అరికట్టడం వంటి అంశాలను పర్యవేక్షించడానికి చైల్డ్‌ ట్రాకింగ్‌ విధానాన్ని అవలంభించాలి (నిబంధన 7.2).
9.పిల్లలను తరగతి గదుల్లో ఇతర పిల్లల నుండి వేరుచేయడం, వేరుగా చూడటం కాని చేయకూడదు. ఇతర పిల్లలకు కేటాయించిన సమయం, స్థలం కాకుండా వేరే సమయం, స్థలం కేటాయించడం చేయకుండా నిర్ధారించాలి (నిబంధన 8.1).
10. పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు, గ్రంథాలయం, ఐసిటి సౌకర్యాలు, పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు వంటి వాటి విషయంలో ఏ విధంగానైనా ఇతర పిల్లలనుండి వేరుగా చూడకూడదు (నిబందన 8.2).
11. బాలుడు, బాలిక సంబంధిత సమీప ప్రాంతానికి చెందినట్లు రుజువుగా రేషన్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, కరెంటు బిల్లు, ఇంటి పన్ను రసీదు, టెలిఫోన్‌ బిల్లులో దేనినైనా స్వీకరించొచ్చు. (నిబంధన 9.1).
12. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్‌ తన పరిథిలోని ప్రత్యేక పాఠశాలలు, ప్రతి ప్రయివేట్‌ పాఠశాల వివరాలతోపాటు సమీప ప్రాంతంలో ఉన్న బలహీనవర్గాలు, అననుకూల బృందాలకు చెందిన పిల్లల జాబితా నిర్వహించాలి (నిబంధన 9.3).
13. రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం ద్వారా నెలకొల్పబడి లేదా నియంత్రణలో ఉన్న అన్ని పాఠశాలల మొత్తం వార్షిక రికరింగ్‌ ఖర్చును అలాంటి పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యతో భాగించగా వచ్చిన ఒక్కొక్క పిల్లవాడి ఖర్చుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం తమ స్వంత నిధులు లేదా కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన నిధుల నుండి ఖర్చు చేయాలి (నిబంధన 10.1).
14. పాఠశాలలో ప్రవేశం కోసం జనన మరణ రిజిస్ట్రేషన్‌ చట్టం 1886 ప్రకారం ధవీకరణ పత్రం పొందలేకపోయినపుడు (1) వైద్యశాల లేదా ఎఎన్‌ఎం రిజిస్టరు రికార్డు. (2) తల్లి,తండ్రి, సంరక్షకుడు ఇచ్చిన స్వీయ ప్రకటనతో పాఠశాలలో ప్రవేశం కల్పించాలి. ప్రవేశం పొందిన ఆరు నెలల్లోపు కంపీటెంట్‌ అథార్టీ నుంచి జనన ధృవీకరణ పత్రం తీసుకొని సమర్పించొచ్చు. (నిబంధన 12).
15. సాధారణ కాలవ్యవధి ముగిసినప్పటి నుంచి 3 నెలల వరకు ప్రవేశ అవకాశాన్ని పొడిగించొచ్చు. (నిబంధన 13).
16. పాఠశాల గుర్తింపుకోసం జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు సమర్పించాలి (14).
17. చట్టం ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి లేకపోయినా చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి ఆరు నెలల వరకు పాఠశాల నడపడానికి జిల్లా విద్యాశాఖాధికారి అనుమతిస్తూ తాత్కాలిక ధృవీకరణ పత్రాన్ని జారీచేయాలి (నిబందన 15.1)
18. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు ధవీకరణ పత్రం పొందకుండా నూతన పాఠశాలను నెలకొల్పకూడదు (నిబంధన 15.3).
19. చట్టంలోని ప్రమాణాలు కొనసాగించడం, నిబంధనలు పాటించడం, గుర్తింపు షరతులను అనుసరించడంలో పాఠశాల విఫలమైనప్పుడు గుర్తింపు పత్రాన్ని జారీచేసే అధికారి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చి, వివరణ పొంది, తర్వాత గుర్తింపు రద్దు ఉత్తర్వులను రాత పూర్వకంగా ఇవ్వాలి (నిబంధన 16.1).
20. అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించాలి. (నిబంధన 19.1).
21. పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసి) ప్రతి సంవత్సరం నవంబర్‌ నెలలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి (నిబంధన 20.1).
22. ప్రయివేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాల ఉపాధ్యాయుల విషయంలో వేతనం, అలవెన్స్‌లు వారి సర్వీస్‌ నిబంధనలు అమలులో ఉన్న శాసన నిర్మితం, నిబంధనల మేరకు పాఠశాల యాజమాన్యం నిర్ధారిస్తుంది (నిబంధన 21).
23. ఉపాధ్యాయుల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం లేదా ఇతర కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రతి విద్యార్థి క్యుములేటివ్‌ రికార్డ్‌ నిర్వహించాలి. ఇది చదువు పూర్తయినట్లు ఇచ్చే ధృవీకరణ పత్రానికి ఆధారమవుతుంది. (నిబంధన 22.1).
24. ఉపాధ్యాయులు రెగ్యులర్‌ బోధనకు ఆటంకం కలగకుండా తనకు కేటాయించిన (అ) శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం, (ఆ) పాఠ్యప్రణాళిక రూపకల్పన, సిలబస్‌, శిక్షణ మాడ్యూల్స్‌, పాఠ్యపుస్తకాలు మెరుగు పరచడంలో పాల్గొనడం (నిబంధన 22.2).
25. పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాలలోని ఉపాధ్యాయుల ఇబ్బందులను తొలగించే ప్రాథమిక వేదిక (నిబంధన 23.1).
26. రెగ్యులర్‌ బేసిస్‌ పై ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి (నిబంధన 24.3)
27. పాఠశాలల్లో వేతనం చెల్లిస్తూ ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌ ద్వారా వారిసేవలను ఇతర కార్యాలయాలు లేదా సంస్థలు వినియోగించుకొంటున్న సందర్భాల్లో అలాంటి డెప్యుటేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి (నిబంధన 24.4).
28. రాష్ట్ర విద్యావిషయక అథార్టీగా రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణా మండలి (ఎస్‌సిఇఆర్‌టి) వ్యవహరించాలి (నిబంధన 25.1).
29. మాధ్యమిక విద్య పూర్తయిన నెలలోపు మాధ్యమిక విద్యను పూర్తిచేసినట్లు ధృవీకరణ పత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇవ్వాలి (నిబంధన 26.1).
30. రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథార్టీని ఏర్పరస్తుంది. ఇది బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్‌ ఏర్పడేంత వరకు అమలులో ఉంటుంది (నిబంధన 27.1).
31. రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయాలి.
32. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యా కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ జారీ చేసి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు, నియమాలు, నిబంధనలు, ఎక్సిక్యూటల్‌ సూచనలు మొదలైనవి ఈ నియమాలతో పొంతన లేనప్పుడు అవి ఆ మేరకు రద్దయినట్లుగా భావించాలి (నిబంధన 29.1)
రేపు : బాలల హక్కులు

-కె.ఎస్‌.లక్ష్మణరావు,
మాజీ శాసనమండలి సభ్యులు,
సెల్‌ : 8309965083

➡️