- ఇంకా వెంటాడుతున్న చేదు అనుభవాలు
- ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం
- వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై కోలుకోలేని దెబ్బ
- ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ కార్మికులు
న్యూఢిల్లీ : 2016 నవంబర్ 8వ తేదీ గుర్తుందా? ఆ రోజే ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే పెద్దది అయిన రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. ఇది మొదటి నుండీ విఫల ప్రాజెక్టేనని నిపుణులు తేల్చారు. పెద్ద నోట్ల రద్దుపై అధికార పార్టీలో కానీ, చివరికి క్యాబినెట్‌లో కానీ చర్చించలేదు. ఈ ప్రణాళికలో తప్పిదాలు ఉన్నాయని రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.పెద్ద నోట్ల రద్దును, దాని పరిణామాలను ఇంకా ప్రజలు మరచిపోలేదు. అవి ఇప్పటికీ వారికి చేదు జ్ఞాపకాలే. పెద్ద నోట్లను జమ చేసేందుకు లేదా మార్చుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. టోకెన్ల వంటి పురాతన కరెన్సీలను ప్రవేశపెట్టారు. కొత్త కరెన్సీ నోట్ల జారీలో అవినీతి చోటుచేసుకుంది. తగిన సన్నాహక చర్యలు తీసుకోకుండానే ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన చర్య సమస్యలను సృష్టించింది. దీంతో ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్న పాడైపోయిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ తిరిగి చెలామణిలోకి తేవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది.
ఆర్థికవేత్తలు ఏమన్నారు?
పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఆర్థిక వృద్ధి కుంటుపడింది. ప్రారంభంలోనే రఘురామ్ రాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తలు ఈ నోట్ల రద్దును గట్టిగా వ్యతిరేకించారు. వివిధ కోణాలలో దానిని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వాంఛనీయం కాదని వారందరూ స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ఈ చర్యను ‘వ్యవస్థీకృత, చట్టబద్ధమైన దోపిడీ’ అని అభివర్ణించారు. అమర్త్యసేన్ ‘నిరంకుశ చర్య’ అన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి
పెద్ద నోట్ల రద్దు కారణంగా అనధికారిక రంగం బాగా దెబ్బతిన్నది. చిన్న, మధ్య తరహా సంస్థలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి. జిడిపి వృద్ధి మందగించింది. ఉపాధి కల్పన జరగలేదు. డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏదేమైనా పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదు.
రద్దయిన నోట్లలో చాలా వరకూ తిరిగి వచ్చాయని ఆర్‌బిఐ చెబుతున్నప్పటికీ నల్లధనం మాత్రం బయటికి రాలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవధి తక్కువగా ఉండడంతో బ్యాంకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. సుమారు రెండు నెలల పాటు ఏ బ్యాంక్ వద్ద చూసిన బారులు తీరిన జనమే కన్పించారు.
డిజిటల్ లావాదేవీలు జరిగినా…
పెద్ద నోట్లు రద్దు చేయాలన్న ఆకస్మిక నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. ఆర్థిక వృద్ధి రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 6.7 శాతానికి చేరింది. పారిశ్రామిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయని ఆర్‌బిఐ చెప్పుకుంది. కానీ ఇది కూడా అర్ధసత్యమే. పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే వినియోగ వస్తువుల అమ్మకాలు ఒక్కసారిగా 40 శాతం మేర పడిపోయాయి. గృహోపకరణాల మార్కెట్‌లో 80 శాతం వరకూ నగదు లావాదేవీలే జరిగాయి.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రకటించిన పథకాలు, ప్రత్యేక రాయితీలు, ప్రమోషన్లు వంటి చర్యలు పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించలేకపోయాయి. రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడం, ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం వంటి చర్యల కారణంగా గృహోపకరణాల మార్కెట్ 30 శాతం వృద్ధి నమోదు చేసుకుంటుందని అందరూ అనుకున్నా అలా జరగలేదు.
అరకొర నగదుతో అవస్థలు
పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా భారీ స్థాయిలో నగలు లావాదేవీలపై ఆధారపడిన సంఘటిత, అసంఘటిత రంగాలు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. నగదు కొరత అటు వినియోగదారులను, ఇటు వ్యాపారులను వేధించింది. నోట్ల రద్దు జరిగిన తర్వాత మొదటి నాలుగు నెలలలో చిన్న చిన్న వ్యాపారుల వ్యాపారాలు 50 శాతం వరకూ పడిపోయాయి. నగదు చెలామణి సాధారణ స్థితికి చేరడానికి, వ్యాపారాలు మామూలుగా జరగడానికి ఆరు నెలలు పట్టింది.
నగదు లభ్యత తగ్గడం వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపింది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది నగదే. అనూహ్యంగా ఏర్పడిన నగదు కొరత ఆ రంగంపై అనేక విధాలుగా ప్రభావం చూపింది. వ్యవసాయ ఆదాయాలు పడిపోవడంతో ఉపాధి అవకాశాలు క్షీణించాయి.