విశ్వసనీయత లోపించిన ఎన్నికల ప్రక్రియ

  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బిజెపి తీరు
  • నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు
  • కాషాయపార్టీ తీరుపై రాజకీయ విశ్లేషకులు, మేధావుల ఆందోళన

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ముగియటానికి మరో రెండు దశలు మిగిలి ఉన్నాయి. ఏడు దశల ఎన్నికల్లో భాగంగా ఐదు ఇప్పటికే ముగిశాయి. అయితే, ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలు, నెలకొన్న పరిస్థితులు మాత్రం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తీరు, ప్రక్రియ విశ్వసనీయతను కోల్పోయిన విధంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇది కనిపిస్తున్నదని కొన్ని ఘటనలను ఉటంకిస్తూ వారు చెప్తున్నారు. ముఖ్యంగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ బిజెపి ప్రచారాలు సాగించిందని అంటున్నారు.
ఎన్నికల సంఘం (ఇసి) కొన్ని విషయాల్లో వ్యవహరించిన విధానం ఆశ్చర్యం కలిగిస్తున్నదనీ, అధికార పార్టీ విషయంలో ఒకలా.. ప్రతిపక్షాల విషయంలో మరొకలా వ్యవహరిస్తున్నదనే ఆందోళనను రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలకు వ్యతిరేకంగా పౌర సమాజం, ఎన్నికల సంఘం విజయవంతంగా ఉద్యమించాయి. అయితే, రాజకీయ పార్టీలు ఎన్నికలను ఊపందుకునే తాజా సానుభూతి గురించి ఆలోచించాయి. ఓటర్లకు నగదు, మద్యం ప్రవాహంతో పాటు.. నియోజకవర్గాలలో భావోద్వేగ ప్రచారాలు సాగించిన సందర్భాలూ కనిపించాయి. కొన్నిసార్లు అల్లర్లు కూడా జరిగాయి. పార్టీలు ప్రత్యర్థి కుల, వర్గ, మత కలయికలను విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నించాయి.పార్టీలు తమ వార్షిక నివేదికలలో వెల్లడించిన మొత్తాల కంటే ప్రచారానికి చాలా ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభించాయి.
మొదటి ఐదు దశల్లో ఇవి స్పష్టంగా కనిపించాయి. ఆధునిక దుష్ప్రవర్తనలు (అధికంగా ఖర్చు చేయటం, తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రసంగాలు వంటివి) కొనసాగాయి. కొన్ని చోట్ల బూత్‌లు స్వాధీనం చేసుకోవటం, ఓటర్లను బెదిరించటం వంటివి చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల ముందు ముఖ్యమంత్రులను అరెస్టు చేయటం, తిరుగుబాటు వర్గాలు పార్టీ చిహ్నాలను కైవసం చేసుకోవటం, ఓటింగ్‌కు ముందే అభ్యర్థులను అప్రతిహతంగా విజేతలుగా ప్రకటించడం వంటి సంఘటనలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ప్రతిపక్షాలపై అణిచివేతలు
మోడీ పాలనలో ప్రతిపక్షాలపై అణచివేతలు ఎక్కువయ్యాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు సీఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రులు, కీలక రాజకీయ నాయకుల అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా నిరోధించవచ్చనే ఆలోచననుబిజెపి చేసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

పార్టీల్లో చీలికలు
ఎఐఎడిఎంకె, ఎన్‌సిపి, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల్లో చీలికలకు బిజెపి కుట్రలు పన్నిందని వారు చెప్తున్నారు. ఆయా పార్టీల్లో తనకు మద్దతుగా నిలిచే ఏదో ఒక వర్గానికి బాసటగా నిలుస్తూ.. తిరుగుబాటు వర్గాలకు ఎన్నికల గుర్తులు లభించేలా తెరవెనక ప్రయత్నాలను కాషాయపార్టీ గట్టిగానే చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ లాంటి పార్టీల ఖాతాను స్తంభింపజేసి ఆర్థికంగా దెబ్బతీయాలని మోడీ సర్కారు భావించి, తన ప్రయత్నాన్ని అమలుపర్చిందని చెప్తున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని కొన్ని సీట్లలో ప్రత్యర్థి అభ్యర్థులు బలవంతంగా తప్పుకున్నారనీ, దీని వెనక కూడా బిజెపితో పాటు దాని అనుకూల హిందూత్వ శక్తుల ప్రయత్నాలు ఉన్నాయని విపక్షాలు బలంగా వాదిస్తున్నాయి.

ఓటరుపై అణచివేత
రాజకీయ పార్టీలనే కాకుండా ఓటరు పైనా తన కుయుక్తులనుబిజెపి అమలు చేసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించటం, ఓటర్లను బెదిరించటం, డబ్బులు విచ్చలవిడిగా పంచటం, మద్యాన్ని ఏరులా పారించటం ఇందులో భాగమని వారు చెప్తున్నారు. కొన్ని ప్రదేశాల్లోబిజెపి నాయకులు ఓటర్లను అడ్డుకున్నట్టు, తమకు ఓటు వేయకపోతే దాడులు చేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయని వారు చెప్తున్నారు.
ఓటు.. తారుమారు
కొందరు పార్టీ కార్యకర్తలు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తున్నారని కొన్ని వార్త కథనాలు కూడా వచ్చాయి. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు పోలింగ్‌ ఏజెంట్లు చెప్పిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయని అంటున్నారు.
ఇక బిజెపి మాత్రం ఒక అడుగు ముందుకేసి..మోడీ ఫోటోలతో ఓటరు స్లిప్పులు పంచిందని చెప్తున్నారు. కొన్నిబిజెపి అనుకూల సర్వే, వార్తా సంస్థలు ఒక ప్రత్యేక అజెండాతో కాషాయపార్టీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ డేటాను విడుదల చేసి ప్రజలను ప్రభావితం చేశాయని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఈవీఎంలు, పోస్టల్‌ ఓట్లలో తప్పులు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా వైఫల్యం వంటి వాటిని కూడా ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత లోపించటానికి కారణాలుగా రాజకీయవేత్తలు, మేధావులు ఉదహరిస్తున్నారు.
మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనలు
ఎన్నికల నియమావళి కోడ్‌ను ఉల్లంఘిస్తూబిజెపి అనేక చర్యలకు దిగిందనీ, ముఖ్యంగా, ద్వేషపూరిత ప్రసంగాలు, అతిగా ఖర్చు చేయటం, పార్టీ ప్రచారానికి ప్రజా నిధుల వినియోగం, ఓటింగ్‌ రోజు కూడా ప్రచారం జరపటం వంటివి చేసిబిజెపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వారు అంటున్నారు.

➡️