విద్యుత్‌ భారాలు తప్పవా?

Jul 10,2024 02:43 #electrical, #loads, #wrong?
  • రికవరి జాబితాలో ‘ ట్రూ అప్‌’

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజలపై భారాలు మాత్రం తప్పేలా లేవు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపమని, స్మార్ట్‌ మీటర్ల బిగింపు ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు హామీనిచ్చారు. అయితే మంగళవారం సచివాలయంలో జరిగిన విద్యుత్‌ శ్వేతపత్రం కార్యక్రమంలో భారాలు మోపే దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఉన్నట్లు పలువురు విద్యుత్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి)కి 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన రూ.17,137 కోట్లు ట్రూఅప్‌ను ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. శ్వేతపత్రంలో ఈ మొత్తాన్ని కూడా రీకవరి కావాల్సిఉందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ భారం ప్రజలపై పడనుందనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు చార్జీలు ప్రజలకు భారంగా మారిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న రూ.17,137 కోట్లు కూడా మోపితే ఈ భారం మరింత తీవ్రం కానుంది. టారీఫ్‌ పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తానని తాను చెప్పలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం కూడా గమనార్హం. ట్రూఅప్‌ భారాన్ని మాఫీ చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కూడా ఆయన చెప్పారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నానని, వాటిని ఏ విధంగా సవరించాలో ఒక ప్రణాళిక రూపొందించి మరలా చెబుతామని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లను బిగింపు కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో వ్యతిరేకించారు. ఇప్పుడు మాత్రం స్మార్ట్‌మీటర్లు ధర ఎంత ఉంది? ఒప్పందంలో ఏమి ఉందో చూడాలని అంటున్నారు. ఏర్పాటు చేసిన మీటర్లను వేస్ట్‌ చేయకుండా ప్రభుత్వ ఖర్చుతో సోలార్‌ ప్యానెల్స్‌ బిగిస్తామని చెప్పారు. సెకీ ఒప్పందంపై కూడా ఆవేశంతో నోటికొచ్చిన్నట్లు మాట్లాడలేనని, ప్రణాళికబద్దంగా వెళ్తానని అంటున్నారు.

➡️