ఇంగ్లీష్‌ హింగ్లీష్‌…!

Apr 14,2025 04:50 #English medium books, #hindi, #titles
  • ఆంగ్ల మాధ్యమ పుస్తకాలకు హిందీ టైటిల్స్‌
  • ఎన్‌సిఇఆర్‌టి నిర్వాకం
  • ‘హిందీ వలసవాదా’న్ని ప్రోత్సహిస్తోందంటున్న విద్యావేత్తలు

న్యూఢిల్లీ : కొత్తగా రూపొందించిన అనేక ఆంగ్ల మాధ్యమ పాఠ్య పుస్తకాలకు ఎన్‌సిఇఆర్‌టి హిందీ టైటిల్స్‌ పెట్టింది. ఆంగ్ల పుస్తకాలకూ హిందీ పేర్లే పెట్టడం గమనార్హం. ఎన్‌సిఇఆర్‌టి చర్య ‘హిందీ వలసవాదాన్ని’ ప్రోత్సహిస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలుపై తమిళనాడు పోరాడుతున్న సమయంలో ఎన్‌సిఇఆర్‌టి తాజా వివాదానికి తెరలేపింది. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

సంగీత వాయిద్యాల పేర్లెందుకు?
వివిధ భాషలకు సంబంధించిన ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలకు ఇప్పటివరకూ ఆయా భాషల పేర్లే ఉన్నాయి. ఉదాహరణకు పోయిన ఏడాది వరకూ ఆరవ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి ‘హానీసకిల్‌’ అని, ఏడో తరగతి పుస్తకానికి ‘హానీకూంబ్‌’ అని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు తరగతులకు రూపొందించిన కొత్త ఆంగ్ల పాఠ్య పుస్తకాలకు ‘పూర్వి’ అనే హిందీ పేరు పెట్టారు. పూర్వి అంటే తూర్పు అని అర్థం. హిందుస్థానీ క్లాసికల్‌ సంగీతంలో ఒక రాగానికి కూడా పూర్వి అనే పేరు ఉంది. ఒకటవ, రెండవ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకాలకు ‘మృదంగ్‌’ అనే హిందీ టైటిల్‌ పెట్టారు. మూడు, నాలుగు తరగతుల ఆంగ్ల పుస్తకాలకు ‘సంతూర్‌’ అని నామకరణం చేశారు. ఇది కూడా హిందీ పేరే. మృదంగ్‌, సంతూర్‌ అనేవి సంగీత వాయిద్యాల పేర్లు.

విద్యావేత్తల ఆగ్రహం
గణితం, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, ఆర్ట్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ వంటి సబ్జెక్టుల కోసం ఎన్‌సిఇఆర్‌టి ఆంగ్లం, హిందీ, ఉర్దూ వెర్షన్లలో పుస్తకాలు ప్రచురించింది. లోగడ ఈ పుస్తకాలను ఏ భాషలో ప్రచురించారో దానికి అనుగుణంగానే సంప్రదాయబద్ధంగా పేర్లు పెట్టేవారని ఎన్‌సిఇఆర్‌టి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఒకరు తెలిపారు. ఉదాహరణకు గతంలో ఆరో తరగతి గణిత పుస్తకం ఆంగ్ల వర్షన్‌కు మాథమెటిక్స్‌ అని, హిందీలో గణిత్‌ అని, ఉర్దూ వర్షన్‌కు రియాజీ అని పేర్లు ఉండేవి. గత సంవత్సరం ఎన్‌సిఇఆర్‌టి హిందీ, ఆంగ్ల వర్షన్లకు ‘గణిత ప్రకాష్‌’ అనే పేరు పెట్టింది. ‘సంప్రదాయాన్ని ఎన్‌సిఇఆర్‌టి మార్చేసింది. వారు ఏం సాధించాలని అనుకుంటున్నారో తెలియడం లేదు’ అని ఆ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ చెప్పారు.
ఆంగ్లంలో రాసిన పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడం ఏమిటని 2006లో ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల అభివృద్ధి బృందంలో సభ్యుడుగా పనిచేసిన ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌ ప్రశ్నించారు. ‘ఇది హిందీ వలసవాదం. ఎన్‌సిఇఆర్‌టి అసమంజసంగా వ్యవహరిస్తోంది. అది చేస్తున్న పనులను చూస్తుంటే తమిళనాడులో వ్యక్తమవుతున్న ఆందోళనలు సరైనవే అని స్పష్టమవుతోంది. హిందీయేతర భాషలు మాట్లాడే వారికి మోసపూరితంగా హిందీని నేర్పుతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుస్తకంలో విషయానికి అనుగుణంగా దాని టైటిల్‌ ఉండాలి. పూర్వి-సంతూర్‌ అనే పదాలకు, పుస్తకాలలోని విషయాలకు సంబంధమే లేదు. ఇది తప్పుదారి పట్టించడమే అవుతుంది’ అని జెఎన్‌యుకు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అన్వితా అబ్బీ విమర్శించారు.

ఆ పుస్తకాలు బతికిపోయాయి
ఆరో తరగతి ఆంగ్ల భాషా పుస్తకానికి ముందుమాట రాసిన ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ దినేష్‌ ప్రసాద్‌ సక్లానీ కానీ, పరిచయ వాక్యం రాసిన అకడమిక్‌ సమన్వయకర్త కీర్తి కపూర్‌ కానీ దానికి పూర్వి అనే హిందీ టైటిల్‌ ఎందుకు పెట్టారో చెప్పలేదు. ముందుమాటలో పూర్వి అనే పదం ప్రాశస్త్యాన్ని సక్లానీ ఏకరువు పెట్టారు. ఎన్‌సిఇఆర్‌టికి చెందిన కొన్ని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు హిందీ దాడి నుండి తప్పించుకున్నాయి. ఆరో తరగతి కోసం కొత్తగా రూపొందించిన సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ పుస్తకాల ఇంగ్లీష్‌ వర్షన్లకు ఆ భాషలోనే పేర్లు పెట్టారు.

➡️