ఊరటనివ్వని ప్రభుత్వ భరోసా

  • రొయ్య ధరలు బేజారు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం, ఏలూరు ప్రతినిధులు : మన దేశ ఆక్వా ఎగుమతులపై అమెరికా 26 శాతం సుంకం విధించడంతో రొయ్యల సాగు రైతులు బేజారవుతున్నారు. ఈ పన్ను బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసా ధర రైతులకు ఊరటనివ్వడం లేదు. వంద కౌంట్‌ను రూ.220కు కొనుగోలు చేయాలని ఎగుమతి వ్యాపారులకు చంద్రబాబు సూచించారు. అయితే, ఈ ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. మిర్చి రైతుల పరిస్థితి మాదిరిగానే తమ పరిస్థితీ మారనుందని, భవిష్యత్తులో ఈ ధర పెరగకపోగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, విద్యుత్‌ కోతలను అధిగమించి రైతులు ఈ ఏడాది రొయ్యలను సాగు చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యలకు మంచి ధర లభించింది. 30 కౌంట్‌కు రూ.610 చొప్పన అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడింది. అదే సమయంలో 100 కౌంట్‌ ధర రూ.260 నుంచి రూ.270 వరకూ పలికింది. దీంతో, వేసవిలో కూడా లాభాల పంట పండిస్తుందనే ఆశతో మార్చిలో రైతులు ఉత్సాహంగా సాగు ప్రారంభించారు. అయితే, అమెరికా ప్రతీకార సుంకం ప్రభావం ఆక్వా రంగంపై తీవ్రంగా పడింది. రొయ్యల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. 100 కౌంట్‌ రూ.200కు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. కౌంట్‌ ఒక్కంటికీ రూ.20 నష్టం ప్రస్తుతం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద రైతుల వద్ద రూ.10 వ్యత్యాసంలో ఆ ధరకు కొనుగోలు చేస్తున్నారు, చిన్న రైతులను దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు రూ.20 నుంచి రూ.30 వరకూ కోత విధిస్తున్నారు. చెరువు నుంచి పట్టిన తర్వాత నిల్వ చేసుకునే అవకాశాలు లేకపోవడంతో తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఐ పోలవరానికి చెందిన జి. రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా వైఖరిలో మార్పులేకపోతే భవిష్యత్తులో ధర మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 50 కౌంట్‌ రూ.320కు మించడంలేదు. 80 కౌంట్‌ రూ.240 మాత్రమే ఉంది. అత్యధిక మంది రైతుల వద్ద 100 కౌంట్‌ పంట ఉంది. ఎకరా విస్తీర్ణంలో రొయ్యల సాగుకు రూ.90 వేల నుంచి రూ.1.25 లక్షలకు వరకూ పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుంది. పంట బాగా ఉంటే ఒక్కోసారి 5 టన్నుల వరకూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీకి రూ.240 నుంచి రూ.250 వరకూ ధర పలికితేనే నష్టాల నుంచి గట్టెక్కి కనీసం పెట్టబడి అయినా దక్కుతుందని రైతులు అంటున్నారు. .ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.10 లక్షలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 80 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది.

క్రాప్‌ హాలిడే దిశగా ఆక్వా రైతులు

సవాలక్ష సమస్యతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు అమెరికా విధించిన 26 శాతం సుంకం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఆక్వా రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి, రెండు రోజుల్లో స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే మూకుమ్మడిగా క్రాప్‌హాలిడే ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.

➡️