అదనపు పని… ఆపై ‘షోకాజ్‌’

May 26,2024 07:55 #Sachivalayam, #Show cause notice
  • సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి
  • నోటీసులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
  • ఉద్యోగ సంఘం నాయకుల ఆగ్రహం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్‌చార్ట్‌ ప్రకారం కాకుండా అదనపు పనిచేయించుకుంటున్న ప్రభుత్వం బయోమెట్రిక్‌ వేయడం లేదనే పేరుతో గ్రామ వార్డు సెక్రటేరియట్‌ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. అటెండెన్స్‌ పేరుతో షోకాజు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం నోటీసులను మండలస్థాయిలో ఎంపిడిఓలు, పట్టణాల్లో కమిషనర్లు సిద్ధం చేశారు. సోమవారం నుండి వాటిని జారీచేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది ఉద్యోగులుండగా, వారిలో చాలామంది పని ఒత్తిడి కారణంగా ఏదో ఒక సందర్భంలో బయోమెట్రిక్‌ వేయని పరిస్థితులు ఉన్నాయి. బయోమెట్రిక్‌ వేయని ఉద్యోగులను గుర్తించి, వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. శుక్రవారం నాడు విజయవాడ గ్రామ వార్డు సచివాలయం రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్‌ శివప్రసాద్‌ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మండలస్థాయి అధికారులు షోకాజ్‌ నోటీసులు తయారు చేసే పనిలో నిమగమయ్యారు. గత వారం రోజులుగా అటెండెన్స్‌ వేయని ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఎంపిడిఓలను డైరెక్టర్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రానికి అధికారులు నివేదికను సిద్ధం చేశారు. దీని అధారంగా సోమవారం నోటీసులు ఇవ్వనున్నారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై నియమించారు. వీటితోపాటు ఆరోగ్య సురక్ష, వై ఎపి నీడ్స్‌ జగన్‌, ఆడుదాం ఆంధ్ర కింద క్రీడాకారుల ఎన్‌రోల్‌, కులగణన సర్వే, ప్రభుత్వ సంక్షేమం (హెచ్‌సిఎమ్‌ లెటర్స్‌ ఇంటింటికీ పంపిణీ, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, ఎన్నికల్లో బిఎల్‌ఓ డ్యూటీలు, ఇంటింటికీ ఓటర్ల స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌కు కేంద్రాల సంసిద్ధత లాంటి పనులను ప్రభుత్వం చేయించింది. పని ఒత్తిడి అధికంగా ఉండటం, కార్యాలయం బయటకు వెళ్లాల్సి రావడంతో ఒక్కో రోజు బయోమెట్రిక్‌ సకాలంలో వేయలేకపోయారు. దీన్ని సాకుగా తీసుకుని నోటీసులిచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని సచివాలయ ఉద్యోగులు తప్పుపడుతున్నారు.

ప్రతిరోజూ మూడుసార్లు బయోమెట్రిక్‌
సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజూ మూడుసార్లు బయోమెట్రిక్‌ హాజరువేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఎన్నికల సమయంలో ఇలా మూడుసార్లు బయోమెట్రిక్‌ వేయని ఉద్యోగులను గుర్తించి వారిపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసు అనంతరం ఉద్యోగులు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శుక్రవారం సమీక్ష నిర్వహించిన సమయంలో ప్రతిరోజూ ఎన్ని నోటీసులు ఇచ్చారు. ఎన్నిటికి వివరణ వచ్చింది. సంతృప్తికరంగా ఉందా? లేదా? అనే అంశాలనూ చేర్చి సాయంత్రానికల్లా కలెక్టర్లకు నివేదిక పంపాలని డైరెక్టర్‌ సూచించారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఇన్‌టైమ్‌ అటెండెన్స్‌ కొన్ని మండలాల్లో 44 శాతం, మరికొన్ని మండలాల్లో 30 శాతం లోపు ఉందని అధికారులు గుర్తించి, మిగిలిన వారు విధుల్లో ఉన్నారా లేరా తేల్చాలని ఉన్నతాధికారులు వాయిస్‌ మెసేజ్‌ పంపించారు.
వేళాపాళా లేకుండా పనులు చేయించుకుంటూ, బయోమెట్రిక్‌ హాజరు ఒక్కదానినే పరిగణలోకి తీసుకుని తమకు షోకాజ్‌ నోటీసులిస్తుండటాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. తమ జాబ్‌ చార్ట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో తాము భాగస్వామ్యమయ్యామని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు.

➡️