నిరుద్యోగంపై అవాస్తవాలు

  • ఇపిఎఫ్‌ఓపై కేంద్రం వాదనలో హేతుబద్ధత కరువు
  • తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు
  • మోడీ సర్కారు తీరుపై నిపుణులు, విశ్లేషకులు

న్యూఢిల్లీ : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఇపిఎఫ్‌ఓ)లో చేరే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా దేశంలో ఉద్యోగాల కల్పన పెరిగిందని, ఇది తమ ప్రభుత్వ ఘనతేనని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. ఇపిఎఫ్‌ఓ సమాచారాన్ని దేశంలో ఉద్యోగాల కల్పనకు ముడిపెట్టటంలో హేతుబద్ధత లేదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. మోడీ సర్కారు అంకెల గారడీతో దేశంలోని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని చెప్తున్నారు.
2017, సెప్టెంబర్‌ నుంచి 2024, మార్చి మధ్య ఇపిఎఫ్‌ఓలో 6.2 కోట్ల మంది నికర చందాదారులు చేరారని ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021-24 మధ్య 8 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పుకోవటానికి తాత్కాలికంగా ప్రభుత్వానికి ఇది కొంత వరకు ఉపశమనం కలిగించినా.. వాస్తవాలు సర్కారు వైఫల్యాన్ని బయటపడతాయని విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.
2017, సెప్టెంబర్‌ నుంచి కవర్‌ అయ్యే పేరోల్‌ డేటాను 2018, ఏప్రిల్‌ నుంచి ఇపిఎఫ్‌ఓ విడుదల చేస్తున్నది. పేరోల్‌ డేటా ద్వారా ఇపిఎఫ్‌ఓలో తొలిసారి చేరుతున్నవారు, వైదొలుగుతున్నవారు, మళ్లీ చేరుతున్నవారి సంఖ్య తెలుస్తుంది. ఇపిఎఫ్‌ఓ నమోదులో నికర పెరుగుదలను ఉపాధి కల్పనకు ఆపాదించలేమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇపిఎఫ్‌ కింద ఇప్పటికే ఉన్న లబ్దిదారుల సంఖ్యకు ఇప్పటికే ఉన్న కొందరు కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరటం ద్వారా ఇపిఎఫ్‌ఓ కింద నమోదయ్యేవారి సంఖ్య పెరుగుతుంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి కొత్త ఉపాధి కల్పన జరగదని వారు వివరిస్తున్నారు. నికర కొత్త ఇపిఎఫ్‌ఓ నమోదు ఎప్పుడూ ఉపాధి కల్పనగానూ చెప్పలేమన్న కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. కొందరు గతంలో పని చేసినా.. ఇపిఎఫ్‌ కవరేజ్‌ కిందకు రానివారు కూడా ఉంటారు. ఇలాంటి వారిని ఇపిఎఫ్‌ కవరేజ్‌ కిందకు తీసుకొచ్చి కొత్తగా ఉపాధి సంఖ్య పెరిగినట్టుగా చెప్పటం సరికాదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్స్‌, ఇతర నిబంధనల చట్టం, 1952 ప్రకారం.. ఏదైనా సంస్థ ముందు 12 నెలల్లో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంటే.. సదరు సంస్థకు చట్టం నిబంధనలు వర్తిస్తాయి. ఒక సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉండవచ్చు. రెగ్యులర్‌ (శాశ్వత) ఉద్యోగుల సంఖ్యను తక్కువగా ఉంచుతాయి. ఇతర కార్మికులు, ఉద్యోగులను కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులుగా ఉంటారు. ఈ సంస్థలు ఇపిఎఫ్‌ఓ పరిధిలోనే ఉన్నప్పటికీ.. నమోదు అవకాశం శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులు, కార్మికులు మినహాయించబడతారు.
ప్రస్తుతం ఇపిఎఫ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనం కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులకూ పొడగించే అవకాశం ఉన్నది. దీంతో ఇపిఎఫ్‌ఓ డేటాలో నూతన నమోదును చూడొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరంతా గతంలో ఉద్యోగులే. కాకపోతే ఆ సమయంలో ఇపిఎఫ్‌ఓలో చేరే అవకాశం లేదు. ఇప్పుడు ఆ అవకాశం ఉన్నది. ఇపిఎఫ్‌ఓలో వీరు వచ్చి చేరినంత మాత్రాన ఇక్కడ ఎలాంటి కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్టు కాదని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల సంఖ్య 20 లేదా అంతకంటే మించి ఉన్న సంస్థలు కూడా ఇపిఎఫ్‌ కవరేజ్‌ కిందకు వస్తుంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీని కారణంగా కూడా ఇపిఎఫ్‌ఓలో నమోదు సంఖ్య పెరుగుతుంది. దీని ఆధారంగా కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సంఖ్య పెరిగిందని చెప్పుకోవటం ఎంత మాత్రమూ సరికాదని నిపుణులు వాదిస్తున్నారు.

మోడీ పాలనలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం
మోడీ పాలనలో భారత్‌లో నిరుద్యోగం ఇప్పటికే ఒక ప్రధాన సమస్యగా ఉన్నది. ఉద్యోగ, ఉపాధి కల్పన తలకు మించిన భారంగా మారింది. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలూ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కోట్లాది సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని మోడీ సర్కారు చెప్పుకోవటం ఆశ్చర్యం కలిగించక మానదని విశ్లేషకులు చెప్తున్నారు. 2017-2022 మధ్య ఇపిఎఫ్‌ఓలో 6.2 కోట్ల నికర కొత్త నమోదు సంఖ్యను ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రయత్నాలుగా చూడలేమని అంటున్నారు.

కొత్త ఉద్యోగాల్లో భవితకు భరోసా ఏదీ?
క్లెమ్స్‌ (క్యాపిటల్‌, లేబర్‌, ఎనర్జీ, మెటీరియల్‌, సర్వీసెస్‌) డేటాబేస్‌ ఆధారంగా ఇపిఎఫ్‌ఓతోపాటు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) సమాచారాన్ని ఉటంకిస్తూ 2021-24 మధ్య భారత్‌లో 7.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని మోడీ సర్కారు వాదిస్తున్నది. పైన వివరించినట్టుగా అంకెల గారడీతో కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. దేశంలో సృష్టించబడుతున్న కొత్త ఉద్యోగాల్లో నాణ్యత కరువైందని అంటున్నారు. సకాలంలో వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం, సేఫ్టీ పరికరాల అందజేత, రిటైర్మెంట్‌ తరువాత వారి భవితకు భరోసా కల్పించడం తదితర అంశాలపై ఎటువంటి స్పష్టత ఉండటం లేదని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని నిపుణులు విమర్శిస్తున్నారు.

➡️