బల్క్‌ డ్రగ్‌ పార్కు భయం

  • రేపు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన
  • నల్ల రిబ్బన్లతో నిరసనకు సిపిఎం పిలుపు
  • భారీగా పోలీసులను మోహరించే పనిలో ప్రభుత్వం

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ప్రజలు వ్యతిరేకిస్తున్నా బల్క్‌ డ్రగ్‌ పార్కు (బిడిపి) పనులకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలోని 2001 ఎకరాల్లో పార్కు పనులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నం నుంచి వర్చువల్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ప్రజల అభ్యంతరాల మధ్య యంత్రాలతో కొద్దిరోజుల క్రితం పోలీసుల సమక్షంలో చెట్లు నరికించారు. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గ పరిధిలో ఈ పార్కుకు శంకుస్థాపన జరగనుండడంతో పోలీసులను మోహరించి భూమిని చదును చేయించారు. రాజయ్యపేట వద్ద వర్చువల్‌ శంకుస్థాపనకు సమీప గ్రామాల జనాలను దగ్గరుండి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు వాహనాల్లో తీసుకెళ్లే బాధ్యతను విఒఎలకు అప్పగించారు. మత్స్యకారులు, ప్రజల బతుకులను నాశనం చేసే బల్క్‌ డ్రగ్‌ పార్కును రద్దు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. పరిశ్రమలొస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఎరచూపి మోసగించే పనిలో ప్రభుత్వం ఉంది. హెటిరో డ్రగ్‌ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు చెప్పిన మాటలే బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు సందర్భంగానూ ప్రభుత్వం చెబుతోంది. హెటిరోలో నిర్వాసిత కుటుంబాలకు, స్థానిక యువతకు ఉద్యోగాలు లభించకపోవడంతో మోసపోయామని, మళ్లీ మోసగించి తమ బతుకులు పాడు చేయొద్దని మత్స్యకారులు, నిర్వాసిత ప్రజలు వాపోతున్నారు. హెటిరో కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని, 2001 ఎకరాల్లో రసాయన పరిశ్రమలొస్తే తామిక్కడ జీవించలేమని, ఊరొదిలి వెళ్లిపోవాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, డిఎల్‌.పురం, వేంపాడులోని 2001 ఎకరాల్లో రసాయన పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) మౌలిక సదుపాయాలు కల్పించనుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కెపి.పురం-కోదాడ మధ్య ఏర్పాటు చేయబోయిన ఈ పార్కును ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించడంతో వైసిపి ప్రభుత్వం నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి 2023 సెప్టెంబరు 20న ఆమోదించింది. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్న కనీస సమాచారాన్ని ప్రభుత్వం స్థానికులకు చెప్పలేదు. ప్రజల జీవితాలపై ప్రభావం చూపే బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటును రద్దు చేసే వరకు పోరాడాలని సిపిఎం పిలుపునిచ్చింది. ప్రధాని శంకుస్థాపన చేసిన రోజు నల్ల రిబ్బన్లు తలకు కట్టుకొని నిరసన తెలపాలని ఇచ్చిన పిలుపుతో ప్రజల నుంచి నిరసనలు రాకుండా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించే పనిలో ప్రభుత్వం ఉంది.

➡️