– స్వయం సేవకులలో పెరుగుతున్న వ్యతిరేకత
న్యూఢిల్లీ : ‘ ఒకప్పటి బిజెపికి, ఇప్పటి బిజెపికి చాలా తేడా ఉంది. అప్పట్లో మా సామర్ధ్యం తక్కువగా ఉండేది. చాలా చిన్నగా ఉండేవాళ్లం. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ అవసరం ఉండేది. మాకు ఉపయోగపడింది. ఇప్పుడు మేము కూడా పెరిగాము. సమర్ధులుగా నిలిచాం. ఆర్‌ఎస్‌ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ. మాది రాజకీయ సంస్థ. ఎవరి పనులు వారికుంటాయి కదా! బిజెపి ఇక స్వయంగా నడుస్తుంది.’
ఐదవ దశ పోలింగ్ ఒక రోజు ముందు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అన్న మాటలు ఇవి,
నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పునకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. తనను తాను సర్వశక్తిమంతుడిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ, ఆయన ఇద్దరు అనుంగు మిత్రులు (అమిత్‌షా, నడ్డా) సంఘ్ పరివార్ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారన్న అభిప్రాయం సంఘ్ పరివారంలో కొంత కాలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నడ్డా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైనాయి. ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం తీరిపోయిందని, బిజెపిని ఇక నుండి తాము స్వయంగా నడుపుకుంటామన్నట్లుగా ఆయన చెప్పిన మాటలపై ‘ సంఘ్ పరివారం’లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఐదవ విడత పోలింగ్ ప్రక్రియపై కూడా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి పట్టున్న అనేక నియోజకవర్గాల్లో నత్తనడకన పోలింగ్ జరగడం, అతి తక్కువగా పోలింగ్‌శాతం నమోదు కావడం దీనికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన రెండు విడతల పోలింగ్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘ది వైర్’ తాజాగా ప్రచురించిన కథనంలో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిల మధ్య పెరిగిన దూరాన్ని, దానికి దారి తీసిన పరిణామాలను సోదాహరణంగా వివరించింది.
సంఘ్ పరివార్ ఞ మోడీ పరివార్
సంఘ్ పరివార్‌కు, మోడీ పరివార్ (మోడీ, అమిత్‌షా, నడ్డా తదితరులు)కు మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్లు సమాచారం. గతంలో మాదిరే తమ కన్నుసన్నల్లో బిజెపి నడవాలన్న సంఘ్ పరివార్ ఆదేశాలను మోడీ పరివార్ బేఖాతరు చేస్తోందని చెబుతున్నారు. హిందుత్వ అజెండాగా, ప్రజలను చీల్చి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ఆర్‌ఎస్‌ఎస్ కొన్ని దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రెండు సార్లు వరుసగా బిజెపి అధికారంలోకి రావడానికి మోడీ మానియానే కారణమని ఆయన పరివారం ప్రచారం చేసుకుంటోంది. దీనిపైనే సంఘ్ పరివారంలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, తాజా ఎన్నికల్లో ఏకంగా మోడీ గ్యారంటీ పేరుతో ప్రచార బరిలోకి దిగడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. సంఫ్‌ుపరివార్ నుండి దీనిపై వ్యక్తమైన అభ్యంతరాలను సైతం మోడీ పరివారం పట్టించుకోలేదని, ఎన్నికల ప్రచార తీరుకు సంబంధించి సంఘ్ పరివార్ చేసిన సూచనలను సైతం ఖాతరు చేయలేదని సమాచారం.
అద్వానితో మొదలు పెట్టి…!
మోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పక్కన బెట్టిన విషయం తెలిసిందే. అద్వానితో ప్రారంభమైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల వేళ అద్వానికి భారతరత్నను ప్రకటించినప్పటికీ, ఆయనను బహిరంగంగానే అగౌరవపరిచిన తీరు సంఫ్‌ుపరివారంలో చర్చనీయాంశంగా మారింది. ఉమాభారతి వంటి నేతలను దూరంగా ఉంచిన తీరు కూడా వారి ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో సైతం బిజెపి అంటే మోడీ, మోడీ అంటే బిజెపిగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. మోడీ లేని చోట్ల అమిత్‌షా, నడ్డాలు కనిపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌తో పాటు, బిజెపికి చెందిన ఇతర రాష్ట్రాల సిఎంలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది.
రామాలయమూ వివాదాంశమే…
ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించిన ఆయోధ్య రామమందిర ప్రారంభం కూడా సంఫ్‌ు పరివార్‌కు, మోడీ పరివార్‌కు మధ్య వివాదాలను మరింత రాజేసిందని చెబుతున్నారు. రథయాత్ర నిర్వహించిన అద్వాని లాంటి వారిని ఆ కార్యక్రమానికి దూరంగా పెట్టిన మోడీ పరివారం సంఘ్ నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ కార్యక్రమం అంతా మోడీ మయంగా మారిన విషయం తెలిసిందే.
