విద్యార్థి దశ నుండే పోరాటాల్లోకి

  • వి శ్రీనివాసరావు ఉద్యమ జీవితం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన వి.శ్రీనివాసరావు విద్యార్థిదశ నుండే ఉద్యమాల్లోకి వచ్చారు. విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు. భూపోరాటంలో అరెస్టయి జైలు జీవితం అనుభవించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లి వి.శ్రీనివాసరావు స్వగ్రామం. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు. 1974-76లో నెల్లూరు జిల్లా కావలి జవహర్‌ భారతి కళాశాలలో ఇంటర్‌ చదివారు. అప్పటికే అక్కడ ప్రస్తుత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిగ్రీ చదువుతూ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా పోటీ చేయగా, ఆయన తరుపున శ్రీనివాసరావు ప్రచారం చేశారు. 1978-79లో ఎస్‌ఎఫ్‌ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగాను, 1979-82 వరకూ కార్యదర్శిగానూ పని చేశారు. కావలి భూపోరాటంలో పాల్గొని, 11 రోజులపాటు జైల్లో ఉన్నారు. 1984లో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి విజయవాడ వచ్చారు. 1985లో గుంటూరులో జరిగిన మహాసభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభునిగా ఎన్నికయ్యారు. 1992లో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1997లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులయ్యారు. 2000-2005 వరకూ ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. 2005లో కేంద్ర కమిటీ సభ్యులుగానూ, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. దళిత శోషణ్‌ ముక్తిమంచ్‌ (డిఎస్‌ఎంఎం) వ్యవస్థాపక కన్వీనర్‌గా ఉన్నారు. కేంద్రస్థాయిలో రైతుల సమస్యలపైనా, పేదల భూ సమస్యలపైనా పోరాటాలు నిర్వహించారు. ఎపి భవన్‌ ముందు ధర్నా సమయంలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 2018లో తిరిగి రాష్ట్ర కమిటీ బాధ్యతల్లోకి వచ్చి కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. 2021లో తాడేపల్లిలో జరిగిన సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఎన్నికయ్యారు.

➡️