- వివాదాలతో కాకినాడ ప్రతిష్టకు దెబ్బ
- కార్మికుల్లో మొదలైన ఆందోళన
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ యాంకరేజీ పోర్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బియ్యం మాఫియా వివాదంతో పోర్టు ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇక్కడికి రావాల్సిన నౌకలు వేరే పోర్టులకు తరలిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పోర్టు కార్యకలాపాలు మందగించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ పోర్టు స్మగ్లర్లకు అడ్డాగా మారిపోయిందని, ఇక్కడి నుంచి రేషన్ బియ్యం ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అవుతోందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తరచూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇటువంటి ఆరోపణలే చేశారు. గత నెల 27న నిర్వహించిన తనిఖీల్లో భాగంగా కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం అక్రమ రవాణాలో ఎవరున్నా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కానీ, అలాంటి చర్యలేవీ కనిపించలేదు. మంగళవారం రాష్ట్ర కేబినేట్ సమావేశం అనంతరం కాకినాడలో కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి విలేకర్ల సమావేశం నిర్వహించారు. స్టెల్లా ఎల్ నౌకలో లోడ్ చేసిన మొత్తం బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. రేషన్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా దీనిని అడ్డుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ వ్యాఖ్యలు దీనిని పరోక్షంగా అంగీకరించనట్లు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని పోర్టుపైకి నెట్టి కాకినాడ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతర పోర్టులకు తరలిపోతున్న నౌకలు
కాకినాడ పోర్టుకు రావాల్సిన నౌకలు బియ్యం అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఇతర పోర్టులకు తరలిపోతున్నాయని పోర్టు వర్గాలు తెలిపాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.30 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీగల మూడు షిప్‌లు కాకినాడ పోర్టు నుంచి విశాఖ పోర్టుకు కార్యకలాపాలను మార్చుకున్నాయని చెప్పాయి. ఈ నౌకల్లో ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు అవు తున్నాయి. కొందరు ఎగుమతిదారులు ప్రైవేట్ పోర్టు వైపు కూడా మళ్లుతున్నట్ల్లు సమాచారం..
కార్మికుల ఉపాధికి ఎసరు
కాకినాడ యాంకరేజి పోర్టుపై వస్తున్న వివాదాలు కార్మికుల ఉపాధికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఈ పోర్టును నమ్ముకుని సుమారు 20 వేలకు మందికిపైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎగుమతి, దిగుమతి కార్మికుల తోపాటు సర్వేయర్ అండ్ టాలీ, బాలబంధు (బస్తాలు కుట్టేవారు), స్వీపర్లు, బార్జీలకు పెయింటింగ్, ఫిట్టింగ్ పనులు చేసే ఫ్యాబ్రికేటర్లు ఇలా వివిధ రూపాల్లో పోర్టులో పని చేస్తున్నారు. నౌకలు ఇక్కడి నుంచి తరలిపోతే పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయి వారంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.