- రైతుల వద్ద నుంచి క్వింటాకు 10 శాతం దిగ్గోత
- తేమ శాతం సడలించినా తొలగని ఇబ్బందులు
- మొక్కుబడిగా సిసిఐ కొనుగోలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తేమ శాతం 12 నుంచి 15 శాతం వరకు అనుమతిస్తామని సిసిఐ అధికారులు ప్రకటించినా ఆచరణలో మాత్రం తేమ శాతాన్ని సాకుగా చూపి కొనుగోలులో రైతుల నుంచి క్వింటాలుకు గరిష్టంగా 10 కేజీల వరకు బయ్యర్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో కొనుగోలు కేంద్రం వరకు వచ్చిన రైతులు సిసిఐ అధికారుల ఆంక్షలకు తలొగ్గక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 65 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిసిఐ నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 49 కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. వీటిల్లో 41 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు ప్రారంభం అయింది. ఇంకా ఎనిమిది ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు. మొత్తంగా 65 కేంద్రాలకు గాను 41 మాత్రమే పనిచేస్తున్నాయి. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో మొత్తం ఎనిమిది కేంద్రాలకు గాను నాలుగు మాత్రమే ప్రారంభమయ్యాయి. అనంతపురంలో రెండు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉన్నా అనంతపురంలో ఒకటి, కడపలో ఒకటి మాత్రమే ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు కేవలం 7172 మంది రైతుల నుంచి 2,37,144 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్టు సిసిఐ అధికార వర్గాలు తెలిపాయి. పత్తి క్వింటాలుకు రూ.7521 మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించినా ఈ ధర రావాలంటే రైతులు క్వింటాకు ఎనిమిది నుంచి పది కిలోలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.6,000 వేల నుంచి రూ.6500కు కొనుగోలు చేస్తున్నారు. సిసిఐ ఆంక్షలను సాకుగా చూపి దళారులు పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా తేమ శాతం 12 శాతం మించకూడదని సిసిఐ నిబంధన విధించింది. అయితే ప్రస్తుతం 18 నుంచి 20 శాతం వరకు తేమ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈనేపధ్యంలో తేమ శాతం ఆంక్షలు సడలించాలని సిసిఐ ఉన్నతాధికారుల దృష్టికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకువెళ్లారు. దీంతో తేమ శాతం 15 శాతం వరకు ఉన్నా కొంటామని సిసిఐ ప్రకటించింది. అయినా 18 నుంచి 20 శాతం వరకు ఉందని సాకు చూపి క్వింటాకు 10 కిలోలు తగ్గించి బయ్యర్లు, సిసిఐ అధికారులు నమోదు చేస్తున్నారు. కనీస మద్ధతు ధర రూ.7521 రావాలంటే సిసిఐ అధికారుల ఆంక్షలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇ-క్రాప్ చేసిన వారే కొనుగోలు కేంద్రానికి రావాలనే నిబంధన వల్ల చాలా మంది కౌలు రైతులు నేరుగా సిసిఐ కేంద్రాలకు రాలేక ఇంటి వద్దకు అమ్ముకుంటున్నారు. తేమ శాతం తగ్గించి తీసుకువెళ్లేందుకు రైతులు పత్తిని ఆరబెట్టుకుని ఇళ్లలో నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆరబెట్టుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి స్థలం లేక పొలం నుంచి ఇంటికి తీసుకువచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.