సమస్యల్లో గెస్ట్‌ లెక్చరర్లు

Nov 17,2024 06:47 #Guest lecturers, #problems
  • నేటికీ అరకొర జీతాలే శరణ్యం
  • ఉద్యోగ భద్రత లేక ఆందోళన
  • అర్థిక ఇబ్బందులతో సతమతం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పదేళ్లుగా పని చేస్తున్నా రూ.10 వేలు మించి వేతనం రావడం లేదని పలువురు అతిథి అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నా తమ వేతనాల్లో దశాబ్ద కాలంగా ఎటువంటి మార్పు లేదని ఆవేదన చెందుతున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కక అనేక అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, గెస్ట్‌ అధ్యాపకుల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు మాత్రమే తమ సమస్యలపై గళం విప్పుతున్నారన్నారు. దీనిపై అధికార పార్టీ ఎంఎల్‌ఎలూ స్పందించాలని వారు కోరుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 100 మంది, డిగ్రీ కాలేజీల్లో 230 మంది, ఎపి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో 170 మంది అతిథి అధ్యాపకులు (గెస్ట్‌ లెక్చరర్లు) పని చేస్తున్నారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరత కారణంగా 2014లో ప్రభుత్వం వీరిని నియమించింది. జూనియర్‌ కళాశాలల వారికి గంటకు రూ.150, డిగ్రీ వాళ్లకు రూ.200, గురుకుల పాఠశాలల్లో టిజిటిలకు రూ.141, పిజిటిలకు గంటకు రూ.161 వంతున రోజుకు ఎన్ని గంటలు బోధిస్తే అన్ని గంటల వంతున లెక్కించి గౌరవ వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్కొక్కరు నెలకు సగటున 120 నుంచి 130 గంటలు బోధిస్తున్నారు. అయితే నెల వేతనానికి పరిమితి విధించడంతో ఎన్ని ఎక్కువ గంటలు పని చేసినా పరిమిత వేతనం చెల్లించేలా నిబంధనలు విధించారు. ఆరు నెలల కితం ప్రభుత్వం డిగ్రీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచి అమలు చేసింది. కాని జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న వారిని మాత్రం గాలికొదిలేసింది.

రూ.10 వేలు వేతనంతో సరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ వ్యవస్థని 2012లో అప్పటి ప్రభుత్వం నిలిపేసింది. ఆ సమయంలో ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ గెస్ట్‌ ఫ్యాకల్టీ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. విభజన అనంతరం తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో పనిచేసే అతిథి అధ్యాపకులకు రూ.10 వేల నుంచి వేతనాన్ని రూ.21,600కి పెంచింది. ఆ తర్వాత కాలంలో మరోసారి దీన్ని రూ.28 వేలకు పెంచింది. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అతిథి అధ్యాపక వ్యవస్థ కొనసాగుతున్నా నాటి నుంచి నేటి వరకూ రూ.10 వేలు మాత్రమే వేతనంగా ఇస్తుంది. ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో పనిచేసే గెస్ట్‌ ఫ్యాకల్టీల విషయంలో జీతాల చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే అతిథి అధ్యాపకులకు రూ.10 వేలతో సరిపెడితే ఇదే వ్యవస్థలో ఉన్న బిసి వెల్ఫేర్‌లో టిజిటిలకు రూ.19 వేలు, పిజిటిలకు రూ.24 వేలు, సోషల్‌ వెల్ఫేర్‌ టిజిటిలకు రూ.19,350, పిజిటిలకు రూ.24,100, జెఎల్‌లకు రూ.26 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వారికి మాత్రం రూ.57,100, పార్ట్‌ టైం అధ్యాపకులకు రూ.37,100, ఎంటిఎస్‌లకు రూ.57,100తో బాటు డిఎను కూడా ఇస్తున్నారు. జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్లకు మాత్రం పదేళ్ల క్రితం నాటి పద్ధతినే అవలంబిస్తూ గంటల ప్రాతిపదికన రూ.10వేలు మించకుండా వేతనం ఇస్తున్నారు. ఒకే వ్యవస్థలో విద్యా అర్హతలు, పనిచేసే విధానంలో సమానంగా ఉన్నప్పటికీ వేతనంలో వ్యత్యాసాలు ఉండటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు చెప్పినా…

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ఇక్కడ ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు మాత్రం కనీస వేతనం ఇవ్వకపోవడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో పలువురికి వేతనాలు పెంచినా తమకు మాత్రం పెంచకుండా అన్యాయం చేసిందని విమర్శిస్తున్నారు. ఏ రోజుకైనా తమ జీవితాలను బాగు చేస్తుందని ఆశా భావంతో పని చేస్తున్నారు. ప్రస్తుత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు

ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్‌ అధ్యాపకుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుంది. అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పదేళ్లలో ధరలు పదిరెట్లకుపైగా పెరిగాయి. గ్యాస్‌, పెట్రోలు, కరెంటు ఛార్జీలు, ఆర్‌టిసి బస్సు ఛార్జీలు అదనం. ఈ నేపథ్యంలో గెస్ట్‌ లెక్చరర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి, పెరిగిన ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు ఇంటి అద్దెలు, కరెంటు, ఇతర బిల్లులకే సరిపోవడం లేదు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️