- ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో పలు ఘటనలు
- తాజాగా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
- అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల అనధికార కేంద్రాలు
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : కారణమేదైనా, తయారీ ఏదైనా లోపభూయిష్టమైన పర్యవేక్షణతో అనకాపల్లి జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాల ఘటనలు మరవక ముందే అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2015లో ఎస్.రాయవరం మండలం గోకులపాడులో ఏడుగురు, 2022లో సబ్బవరం మండలం చిన్నయాతపాలెంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ప్రమాద నివారణ చర్యలు, నియంత్రణ పద్ధతులు పాటించడం లేదు. బాణసంచా వ్యాపారం లాభసాటిగా ఉండడంతో కొంతమంది తయారీ కేంద్రాలకు అనుమతులు తీసుకుంటున్నారు. అయితే. అనుమతుల జారీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం కొట్టిచ్చినట్లు కనబడుతోంది. రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, విద్యుత్ భద్రత వంటి పలు అంశాలను తరచూ పర్యవేక్షించాల్సి ఉంది. తమకున్న పలుకుబడితో అనుమతులు ఇవ్వడమే తప్ప, దాని నిర్వహణపై అధికారులు కనీస పర్యవేక్షణ చేయడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాణసంచా తయారీలో పొటాషియం, నైట్రేట్, సల్ఫర్ వంటి పేలుడు లక్షణాలు ఉన్న రసాయనాలను వినియోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వెంటిలేషన్ ఉండాలి. రసాయనాల మిశ్రమంలో సరైన శిక్షణ కార్మికులకు ఇవ్వకుండా పనిలో పెట్టుకోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తోంది. అనకాపల్లి జిల్లాలోని కశింకోట, కొత్తకోట, రాంబిల్లి, యలమంచిలి, నర్సీపట్నం, ఎస్.రాయవరం, సబ్బవరం ప్రాంతాల్లో అనధికారికంగా బాణసంచా కేంద్రాలు నడుస్తున్నాయి. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతో వాటి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఊరికి దూరంగా పొలాలు, కొబ్బరి తోటల్లో షెడ్లు ఏర్పాటు చేసుకొని ఈ తరహా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పేలుడు పదార్థాల చట్టం 1884 ప్రకారం రూపొందించిన నియమాలను నిర్వాహకులు పాటించడం లేదు. తయారీ లైసెన్సు, నిల్వ లైసెన్సు, విక్రయం, రవాణా వంటి లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నా ఆ నిబంధనలు పాటించకుండానే బాణసంచా వ్యాపారం సాగిస్తున్నారు.
ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆరుగురు మృతి
ఫార్మా పరిశ్రమల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. అచ్యుతాపురం సెజ్‌లోని వివిధ కంపెనీల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు కార్మికులు, విష్ణు కెమికల్‌లో ఒకరు, పరవాడలోని విశాఖ ఫార్మా సిటీలో శాంపిల్స్ సేకరిస్తుండగా ల్యాబ్ టెక్నీషియన్ మరణించారు. అనేక కంపెనీల్లో జరిగిన ప్రమాదాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు గాయపడ్డారు. యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకపోవడంతో ప్రమాదాల పాలయ్యారు.