పంటలకు అపార నష్టం

Dec 6,2023 10:49 #Crop Damage, #damage, #Heavy
  • నిండా మునిగిన రైతు
  • వీరవాసరంలో సుడిగాలి
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • పలు జిల్లాల్లో అంధకారం

ప్రజాశక్తి- యంత్రాంగం : మిచౌంగ్‌ తుపాన్‌ మంగళవారం మధ్యాహ్నం బాపట్ల-నిజాంపట్నం మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో బాపట్ల సూర్యలంక తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. 20 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులకు అపార నష్ట వాటిల్లింది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోవడం, పలు వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైరు, స్తంభాలపై పడడంతో విద్యుత్‌ సరఫరా నిల్చిపోయి అంధకారం అలుముకుంది. పలు జిల్లాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. అన్నమయ్య, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోనూ ప్రభావం చూపింది.

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో మత్స్యకారుల ఏర్పాటు చేసిన పునరావాస శిబిరం
గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో మత్స్యకారుల ఏర్పాటు చేసిన పునరావాస శిబిరం

బాపట్ల జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న 1.50 లక్షల ఎకరాల్లోని వరి పైరుకు నీట మునగడం, గాలికి ఒరిగిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో మిర్చి, పొగాకు, వేరుశనగ, మినుము మొక్కలు నీటమునిగాయి. మొక్కజొన్నకూ నష్టం వాటిల్లింది. రేపల్లెలో చెరువులకు గండ్లు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో కర్లపాలెం మండలంలో అత్యధికంగా 237.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా నదిలో నిలిపి ఉంచిన రాజుకాల్వ, లంకేవానిదిబ్బ గ్రామాలకు చెందిన 40 మత్స్యకారుల బోట్లు మునిగిపోయాయి.

ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పొగాకు, వరి, మిర్చి, శనగ, మినప తదితర పంటలు నీటిలో మునిగాయి. గాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నంబూరులో నీటమునిగిన వరి పొలం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నంబూరులో నీటమునిగిన వరి పొలం

నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో మంగళవారం ఒక్క రోజే 164.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మనుబోలులో 317 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెన్నా, కాళంగి, పంబలేరు, పిల్లాపేరు, నదుల్లో నీరు చేరింది. గాంధీబొమ్మ ప్రాంతంలో భారీ చెట్లు విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 4,500 విద్యుత్‌ స్తంభాలు, 1,081ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. గాలులకు వరి పైరు నేలకొరిగింది. వరి పంట కోసి పనలపై ఉండగా వర్షాలకు నీట మునిగింది. పత్తి, మిర్చి, శనగ, ఆపరాలు పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క బాపట్ల జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. గుంటూరు జిల్లాపైనా తుపాను తీవ్రత అధికరగా ఉంది.

కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో నీటిపాలైన వరి పంట
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో నీటిపాలైన వరి పంట

కృష్ణా జిల్లాలో 417 గ్రామాల్లోని 1,72,550 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా 1,68,464.35 ఎకరాల్లో వరి, 2,116.21 ఎకరాల్లో వేరుశనగ, 1,444.67 ఎకరాల్లో మినుము, 525 ఎకరాల్లో పత్తి, 62 ఎకరాల్లో అరటి, 700 ఎకరాల్లోని కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో 7,55 ఎకరాల్లో వరి పైరు నేలకొరిగినట్లు, వేలాది ఎకరాల్లో వరి పనలు నీట మునిగినట్లు అధికారుల ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. కళ్లాల్లోనే ఉన్న సుమారు 31 వేల టన్నుల ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిలో కొంత ధాన్యం వర్షానికి తడిచిపోయింది. వీరవాసరం మండలంలో సుడిగాలి భీభత్సం సృష్టించింది. కొబ్బరి చెట్లు సైతం విరిగిపడ్డాయి, ట్రాక్టర్‌, మినీ వ్యాన్‌లు బోల్తా పడ్డాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, రేకుల షెడ్లు విరిగి రోడ్డుకడ్డంగా పడ్డాయి. కెపి రైసు మిల్లుకు చెందిన ధాన్యం ఆరబెట్టు డ్రయర్‌ ధ్వంసమైంది. సుడిగాలిలో చిక్కుకొన్న ముగ్గురు గాయపడ్డారు.

ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 37.9 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదైంది. ముదినేపల్లిలో అత్యధికంగా 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోత కోసిన వరి పనలు నీటిలో తేలియాడాయి. రోడ్లపైనా, కళ్లాలోని ధాన్యపు రాశులు తడిసిముద్దయ్యాయి. వేరుశనగ పంటకూ తీవ్ర నష్టం వాటిల్లింది. నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలా ల్లో రబీ నారు మడుల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. మినుము, పత్తి, మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూలిపోయిన ఇల్లు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూలిపోయిన ఇల్లు

కాకినాడ జిల్లాలో మూడు వేల ఎకరాల్లో, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1,500 ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 4 వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 19 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది.

అన్నమయ్య జిల్లాలో 4,152 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, అరటి, మిరప, చెరుకు, టమోటా, బొప్పాయి నష్టం వాటిల్లింది. 1,954 మంది రైతులకు నష్టపోయారు. తిరుపతి జిల్లాలో 405 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గత రెరడు రోజుల్లో తిరుపతిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలలోని జలశయాల్లో పుష్కలంగా నీరు చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వరి పంటకు వాటిల్లింది.

➡️