ఐకమత్యంగా..బిజెపికి బుద్ధి చెప్పిన హిందూ-ముస్లిం ఓటర్లు

Jun 9,2024 09:14 #2024 election, #BJP, #voters
kerala voters information
  • ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీకి ఝలక్‌

న్యూఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బిజెపికి గట్టి షాక్‌ను ఇచ్చాయి. చార్‌ సౌ పార్‌ నినాదంతో వెళ్లిన బిజెపికి కనీసం కూటమితో కలుపుకొని 300 సీట్లను కూడా సాధించకుండా చతికిలపడిపోయింది. బోటాబొటి మెజారిటీతో కూటమిలోని పార్టీల సహాయంతో మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, గత ఎన్నికలకు భిన్నంగా బిజెపికి హిందూ-ముస్లింలు షాకిచ్చారనీ, ఇక్కడ వారి ఐకమత్యం కాషాయపార్టీకి సీట్లు తగ్గటానికి బలమైన కారణంగా పని చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రధానిగా మోడీ తన అనేక టీవీ ఇంటర్వ్యూలలో ముస్లింలను కొంతవరకు అభ్యర్థించారు. ‘నేను మొదటిసారిగా ముస్లిం సమాజానికి, వారిలో బాగా చదువుకున్న ప్రజలకు చెబుతున్నాను. ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారు? కారణం ఏమిటి? కాంగ్రెస్‌ హయాంలో మీకు ఎందుకు ప్రయోజనాలు రాలేదు? ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మారుతున్నారు’ అంటూ మోడీ ముస్లింలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే, ముస్లింలు అతని మాట విన్నట్టు కనిపించడం లేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా, యూపీ, పశ్చిమ బెంగాల్‌ ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది. ఇక్కడ ఈ సారి ఎన్‌డిఎ కంటే ఎక్కువ ఓట్ల వాటాను ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొందాయి.
మోడీ కాలంలోని మూడు లోక్‌సభ ఎన్నికల్లో (2014, 2019, 2024), 2017, 2022 విధానసభ ఎన్నికలలో యూపీలో 80 లోక్‌సభ లేదా 403 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బిజెపి నిలబెట్టలేదు. అయినప్పటికీ, బిజెపి సర్వశక్తిమంతమైన మెజారిటీలను సాధించింది. అయితే, ముస్లిం వర్గం పట్ల బిజెపి తీరుతో పాటు బిజెపిలోని అగ్రనాయకత్వం మధ్య ఆధిపత్య పోరే యూపీలో కషాయపార్టీకి నష్టాన్ని చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే బిజెపికి పెద్ద ఆందోళన కలిగించే అంశమని వారు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం, పశ్చిమ బెంగాల్‌ జనాభాలో దాదాపు 33 శాతం మంది ముస్లిం జనాభా ఉన్నది. 2019లో బిజెపి పశ్చిమ బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకు గానూ 18 స్థానాలను గెలుచుకున్నది. ఇప్పుడు మాత్రం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. సీట్లు వచ్చే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి సింపుల్‌ ఫార్ములానే అనుసరిస్తున్నది. హిందువులను రెచ్చగొట్టి గంపగుత్తగా ఓట్లు పడేలా చేసుకోవటమే బిజెపి ప్లాన్‌. అయితే, ఇది యూపీ, పశ్చిమ బెంగాల్‌లోని ముస్లింలనే కాకుండా, హిందువులనూ ఆలోచింపజేసింది. బిజెపి కుయుక్తులను అర్థం చేసుకున్న వీరు.. ఊహించని షాకింగ్‌ ఫలితాలను కమలం పార్టీకి ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ”మహిళలపై అఘాయిత్యాల” అంశాన్ని బిజెపి లేవనెత్తినా.. అక్కడి ప్రజలు నమ్మలేదని చెప్తున్నారు. ఈ కారణాలతో హిందూ-ముస్లిం ఓటర్ల ఐకమత్య బలం కాషాయపార్టీకి అర్థమైందనీ, ఇది భవిష్యత్‌ రాజకీయాలకు మంచి సూచిక అని మేధావులు, సామాజికవేత్తలు అంటున్నారు.

➡️