అమరావతి రైతుల్లో ఆశల చిగురు

Jun 9,2024 08:45 #amaravati, #Rajadhani, #rythu
  • టిడిపి విజయంతో రాజధాని పనులపై నమ్మకం

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రాజధాని రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లపాటు అమరావతిని నిర్వీర్యం చేసింది. దీంతో, అమరావతికి భూములిచ్చిన రైతులు పోరుబాట పట్టారు. తాజా ఎన్నికల్లో టిడిపి కూటమి సంపూర్ణ ఆధిక్యత రావడంతో రాజధాని గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి పనులు త్వరలో పున్ణప్రారంభం అవుతాయని రైతులు భావిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం గ్రామంలో 2015 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అయితే, రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1,500 కోట్లు కేటాయించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దాదాపు రూ.లక్ష కోట్ల అంచనాలతో అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణంపై అప్పట్లో ప్రణాళికలు రూపొందించింది. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. నవ నగరాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇచ్చి హామీ అమలుకు నోచుకోలేదు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇంతవరకూ దక్కలేదు. కాగితాల్లోనే ఈ ప్లాట్లు ఇచ్చారు తప్ప, అభివృద్ధి చేసి అప్పగించలేదు. సిఆర్‌డిఎ చట్టం ప్రకారం మొదటి మూడేళ్లలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాల్ని ఉన్నా టిడిపి హయాంలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చినా ఈ ప్రక్రియ కొనసాగుతుందని రైతులు భావించారు. అయితే, 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతూ రైతులు 1,630 రోజులపాటు సుదీర్ఘకాలం ఉద్యమించినా వైసిపి అధినేత జగన్‌ ఏ మాత్రమూ వెనక్కి తగ్గలేదు. తాను మళ్లీ అధికారంలోకొస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. దీంతో, రాజధాని రైతులు కొంత భయపడ్డారు. ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రంలో బిజెపికి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో 2014 మాదిరిగా టిడిపి మద్దతుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే సిఎం చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తారని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రధానంగా షరతులు లేకుండా భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్స్‌ త్వరగా రావాలంటే ఎకరాకు కనీసం రూ.కోటి చొప్పున రూ.34 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత మొత్తం నిధులు కేంద్రం ఇస్తే తప్ప, అమరావతి అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమరావతికి చంద్రబాబు నిధులు తెస్తారని రైతులు నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు దీన్ని నిలబెట్టుకుంటారో? లేదో? చూడాలి.

➡️