- ఇప్పటికే 9 వేల ఎకరాల భూసేకరణ
- మరో 10 వేల ఎకరాల సేకరణకు సిఎం ఆదేశాలు
- రూ.95 వేల కోట్లతో బిపిసిఎల్ ప్రాజెక్టు
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారీగా భూ సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే 9 వేల ఎకరాలు భూసేకరణ పూర్తి చేశారు. ఇటీవల సుమారు రూ.95 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల ఎకరాల్లో బిపిసిఎల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. సోలార్ ఫ్యానల్ ఫ్యాక్టరీకి ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు వినియోగించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 10 వేల ఎకరాలు భూ సేకరణ చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే భూమి సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఎం తాజా ఆదేశాలతో రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణపట్నం పోర్టు, థర్మల్ ప్రాజెక్టులు, సెజ్‌ల పేరుతో నెల్లూరు జిల్లాలో భారీగా భూమిని సేకరించిన ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. ఇంకా అనేక చోట్ల భూమి బీడుగానే ఉంది. కృష్ణపట్నంలో ఎలాంటి అభివృద్ధీ కార్యక్రమాలు చేపట్టలేదు. ఎప్పటి నుంచో కావలి- ఒంగోలు మధ్య రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దీనికి శంకుస్థాపన చేశారు. 2020లో ఇక్కడ ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటు కోసం 1800 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 5 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాకున్నారనే విమర్శలు ఉన్నాయి. రామాయపట్నం పోర్టుకు 850 ఎకరాలు, ఇంటో సోలార్‌కు 5 వేల ఎకరాలు, బిపిసిఎల్‌కు 6 వేలు కావాల్సి ఉంది. ఇవి కాకుండా మరో 10 వేల ఎకరాలు స్వీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇటీవల 6 వేల ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రామాయపట్నానికి అందుబాటులో రైల్వే లైన్, దగదర్తి విమానాశ్రయం, 16వ నెంబర్ జాతీయ రహదారి ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని చేవూరు, రావూరు, సాలిపేట, చెన్నాయపాళెం, రుద్రకోట, ఆవుల వారిపాళెం, మొండివారి పాళెం, కర్లపాళెం గ్రామాల్లో భూసేకరణ చేస్తున్నారు. మరో 10 వేల ఎకరాలు భూసేకరణ చేసి, సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రామాయపట్నం, చాకచర్ల, తెట్టు గ్రామాల్లోనూ సేకరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల ఎకరాలు ఈ ప్రాంతంలో భూమి సేకరిస్తారని తెలుస్తోంది.
బిపిసిఎల్‌కు 6 వేల ఎకరాలు..!
రామాయపట్నం పోర్టు వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. పోర్టు సమీపంలో సుమారు 6 వేల ఎకరాల్లో రూ.95 వేల కోట్లతో దీనిని నిర్మాణం చేయనున్నారు. భూసేకరణ, ఇతర ఖర్చుల కోసం రూ.6100 కోట్లు ఇప్పటికే ఆ కంపెనీ కేటాయించినట్లు సమాచారం. దుబాయి, ఖత్తర్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి రామాయపట్నం పోర్టుకు ఓడల ద్వారా క్రూడాయిల్ ఇక్కడకు తీసుకొస్తారు. దానిని శుద్ధి చేసే కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. పెట్రోకెమికల్ ప్లాంట్, లూబ్రికెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఫ్యూయల్ అడిటివ్స్, వ్యాక్స్ ప్రొడక్షన్, ఆఫాల్ట్ ప్రొడక్షన్, సర్ఫర్ రికవరీ ప్లాంట్, కెటలిస్ట్ మానుఫ్యాక్చరింగ్, రిఫైనరీ మెయింటెనెన్స్ సర్వీస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎన్‌విరాన్‌మెంటల్ సర్వీస్, ట్యాంక్ మానుఫ్యాక్చరింగ్, పైప్ మానుఫ్యాక్చరింగ్, వాల్వ్ మానుఫ్యాక్చరింగ్, ఇన్‌సులేషన్ అండ్ రిఫ్రాక్టరీ సర్వీస్, లాజిస్టిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ వంటి 15 అనుబంధ పరిశ్రమలు ఏర్పడి లక్షలాది మందికి ఉపాధి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.