మామిడికి మంచు దెబ్బ

Feb 10,2025 08:17 #mango farmers

దట్టంగా కురుస్తున్న పొగ మంచు
రాలిపోతున్న పూత, పిందెలు
ఆందోళనలో రైతులు

ప్రజాశక్తి – చీపురుపల్లి (విజయనగరం జిల్లా) : మామిడి, జీడికి మంచు దెబ్బ తగులుతోంది. కొద్దిరోజులుగా దట్టంగా కురుస్తున్న మంచుతో పూత మాడిపోతోంది. సాధారణంగా మామిడి పంటకు డిసెంబరు, జనవరి నెలల్లో పూత వస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచీ తీవ్రమైన పొగ మంచు కురియడంతో పూత మసిబారి నాశనం అవుతోంది. దీంతో, ఈ ఏడాది పూర్తిగా పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మామిడి తోటలు ఉన్నాయి. వేల సంఖ్యలో రైతులు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో 22,467 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మెరకముడిదాం మండలంలో 10,357 ఎకరాలు, చీపురుపల్లి మండలంలో 3,014 ఎకరాలు, గరివిడి మండలంలో 4,965 ఎకరాలు, గుర్ల మండలంలో 4,311 ఎకరాల మామిడి తోటలు ఉన్నట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. సాధారణంగా నవంబరు నుంచి జనవరి వరకూ మామిడి పూత వస్తుంది. ప్రస్తుతం రసాలు, పనుకులు, సువర్ణరేఖ రకాలకు సంబంధించి పూత పూసింది. మరికొన్ని రకాలు పూతకు వచ్చే దశలో ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో వర్షాల కారణంగా కొంత పూత రాలిపోయింది. పూత రాని చెట్లు సైతం మరింత ఆలస్యం అవుతుండడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కురుస్తున్న మంచు ప్రభావంతో పూత మాడిపోయి నేలరాలి పోతోంది. దట్టమైన మంచు ప్రభావంతో కొన్నిచోట్ల చిన్నచిన్న మామిడి పిందెలు సైతం నేల రాలిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అధికంగా కురుస్తున్న మంచుతోపాటు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మామిడి పూత, పిందెల పైన తామర పురుగు ఆశిస్తోంది. దీంతోపాటు తెగులు సోకి మామిడి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యాన శాఖాధికారుల సూచనలు
మంచు ప్రభావంతో మామిడి తోటలను తెగుళ్ల బెడద వెంటాడుతోంది. వీటి నివారణకు దయామేదాక్షమ్‌ 0.5 గ్రాములు, హెక్సాకోనోజోల్‌ 2 మిల్లీమీటర్లు కలిపి తెగులు సోకిన మామిడి పూత పై పిచికారీ చేయాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. మామిడి పిందెలను నాశనం చేసే చల్లని పచ్చని పురుగు మామిడి తోటలపై అధికంగా సోకే ప్రమాదం ఉంది. వాటి నివారణకు దయా మేదాక్షమ్‌, హెక్సాకోనోజోల్‌తోపాటు ఇమామాక్సిన్‌, బెంజోయేట్‌ 0.5 మిల్లీమీటర్లు.. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మామిడి పిందెలు పూర్తిస్థాయిలో నిలబడటానికి ఫినోఫిక్స్‌ 44 గ్రాములు, బోరోన్‌ 88 గ్రాములు పౌడరు 200 లీటర్ల నీటిలో కలిపి మామిడి తోటలపై పిచికారీ చేయాలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మంచు ప్రభావం నుంచి మామిడి తోటలను రక్షించుకునేందుకు రైతులు సమీప ఉద్యాన శాఖ అధికారులు సంప్రదించాలని సూచిస్తున్నారు.

➡️