పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు.. పగడపు దీవులపై ప్రభావం

May 16,2024 16:22 #coral reefs

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవి ముఖ్యంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇండియా చుట్టూ ఉన్న పగడపు దీవులపై ప్రభావం పడనుంది. ఈ ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల రాబోయే రోజుల్లో పగడపు దీవులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటుందని జాతీయ సముద్ర, వాతావరణ అడ్మినిస్ట్రేషన్‌ విశ్లేషించిన డేటా తెలియజేస్తోంది. పగడపు దీవుల వల్ల వేలాదిమంది మత్స్యకారులు జీవనాధారం పొందుతున్నారు. ఉష్ణోగ్రతల మార్పుల వల్ల వీటికి ప్రమాదం వాటిల్లితే.. మత్స్యకారుల జీవనాధారానికి ప్రమాదం పొంచి ఉందని ఈ విశ్లేషణ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం చుట్టూ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుండడంతో దానిలోని పగడాల బ్లీచింగ్‌ కూడా విస్తృతంగానే ఉంది. అలాగే గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ అనేది భారతదేశంలోని ప్రధాన పగడపు దీవుల ప్రాంతాలలో ఒకటిగా ఉంది. దానిచుట్టూ 21 జనావాసాలు లేని దీవులు ఉన్నాయి. సుగంటి దేవదాసన్‌ సముద్ర పరిశోధనా సంస్థ ఇటీవల గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ పగడపు దీవుల స్థితి, నిర్వహణలో దశాబ్దాల మార్పులపై ఒక నివేదికను అందించింది. మన్నార్‌లో 2005 నాటికి పగడపు దీవులు 37 శాతానికి చేరాయి. అంటే 63 శాతం పగడపు దీవులు తగ్గాయి. ఆ తర్వాత పది సంవత్సరాలు పగడపు దీవులలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ.. మళ్లీ 2016 నుంచి 2021 వరకు పగడపు దీవులు తగ్గిపోతున్నాయని ఈ సంస్థ నివేదిక తెలిపింది. ఇక మనన్నార్‌లో 2009లో 42.1 శాతం, 2016లో 22.7 శాతం, 2011లో 27.3 శాతం పగడపు దీవులు ఉన్నాయి. అక్టోబర్‌ 2023 నుండి సముద్రపు వేడిగాలుల వల్ల 75 శాతానికి పగడపు దీవులు దెబ్బతిన్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలు, జీవనోపాధులు, జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లనుందని హిందూస్తాన్‌ టైమ్స్‌ నివేదిక మే 7న తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేడెక్కుతున్న బేసిన్‌గా హిందూ మహాసముద్రం బేసిన్‌ ఉందని ట్రియోపికల్‌ వాతావారణ శాస్త్రం యొక్క కొత్త పరిశోధన అంచనా వేసింది. దీంతో భవిష్యత్తులో తీవ్రమైన వాతావరణ మార్పుల పెరుగుదలకు దారితీస్తుంది అని ఈ పరిశోధన పేర్కొంది.
ఒక దశాబ్దంపాటు ప్రతి సెకను, ప్రతిరోజూ, ఒక హిరోషిమా అణుబాంబు పేలుడుకు సమానమైన శక్తితో కూడిన వేడి పెరుగుదల ఉంటుంది. భవిష్యత్తులో సంవత్సరానికి అత్యంత వేడిగా ఉన్న రోజులు 20 రోజుల నుండి 220-250 రోజులకు పెరుగుతుంది. ఇది హిందూ మహాసముద్రాన్ని శాశ్వత హీట్‌వేవ్‌ స్థితికి నెట్టివేస్తుందని మా అధ్యయనం కనుగొందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూకోల్‌ తెలిపారు.

➡️