పత్తి రైతుకు ఇ-క్రాప్‌ చిక్కులు!

  • కొనుగోలుకు నిరాకరిస్తున్న అధికారులు
  • ప్రైవేట్‌ వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి
  • ఎకరాకు రూ.6 వేలు నష్టం

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు కొసిరెడ్డి సూర్యనారాయణ. దత్తిరాజేరు మండలం పాచలవలసకు చెందిన ఈయన మరడాం రెవెన్యూ పరిధిలో తనకున్న అర ఎకరం భూమిలో ఈ ఏడాది పత్తి సాగు చేశారు. అంతా వర్షాధార భూమే. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో ఇప్పటి వరకు సుమారు ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. వారం రోజుల క్రితం రామభద్రపురం మండలంలోని ముచ్చర్లవలస పత్తి జన్నింగ్‌ మిల్లు (కొనుగోలు కేంద్రం)కు తీసుకెళ్లారు. ‘మీరు పత్తి సాగు చేసినట్టు ఇ-క్రాప్‌ నమోదు కాలేదు. కొనుగోలు చేయడం కదరదు’ అంటూ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ), మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో, ఆయన తీసుకెళ్లిన వాహనంలోనే పత్తిని తిరిగి వెనక్కి తీసుకెళ్లారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు గవిరెడ్డి సత్యనారాయణ. బాడంగి మండలం పిన్నవలసకు చెందిన ఈయన ఈ ఏడాది 1.50 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇప్పటి వరకు సుమారు 4.30 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. దీన్ని తీసుకుని ముచ్చర్లవలసలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ఇ-క్రాప్‌ పోర్టర్‌లో పరిశీలించిన అక్కడి ప్రభుత్వ అధికారులు ‘మీరు పత్తి సాగు చేసినట్టు ఇ-క్రాప్‌ నమోదు అయినప్పటికీ ప్రస్తుతం 2.30 క్వింటాళ్లు విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. మిగిలిన పత్తి డిసెంబర్‌లో విక్రయించుకోవాలి’ అని చెప్పారు. దీంతో, ఎలిజిబిలిటీ ప్రకారం 2.30 క్వింటాళ్లు రూ.7 వేల చొప్పున, మిగిలిన రెండు క్వింటాళ్ల పత్తిని అదే మిల్లు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేటు ఏజెంటుకు రూ.6,300 లెక్కన తెగనమ్ముకోవాల్సి వచ్చింది.

వీరితోపాటు పాచలవలసలోని సుంకరి మధుసూధనరావు, పిన్నవలసలోని కర్రి ఆంజనేయులు సహా జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వేలాది మంది పత్తి రైతులు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇ-క్రాప్‌లో నమోదు చేయకపోవడం, ని’బంధనాలు, కొర్రీల వల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు తక్కువకు కొంటున్నారు. దీంతో, ఎకరా ఒక్కంటికీ ఆరు వేల రూపాయలకుపైగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

ఒకే ఒక్క కొనుగోలు కేంద్రం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇది కూడా రామభద్రపురంలోని ఓ ప్రైవేటు మిల్లులో. జిల్లాలోని శివారు ప్రాంతాల నుంచి ఇక్కడికి పత్తి తీసుకురావడానికి వ్యయప్రయాసకు గురికావాల్సి వస్తోంది. అటు భామిని, ఇటు వేపాడ నుంచి ఇక్కడికి పత్తిని తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతోంది. వేల రూపాయలు రవాణా ఛార్జీలు భరించాల్సి వస్తోంది. తీరా అక్కడికి వెళ్లాక కొనుగోలు చేస్తారనే గ్యారటీ ఉండకపోవడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పత్తి సాగు విస్తీర్ణం ఇ-క్రాప్‌లో నమోదు మొదలుకుని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని రైతులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు.

కొన్నది 1,140 క్వింటాళ్లే

అధికారిక లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో మొత్తం 4,685 మంది రైతులు 4,137 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు తక్కువలో తక్కువ ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చిందనుకున్నా సుమారు 23,425 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు లెక్క. ఇప్పటి వరకు 138 మంది రైతుల నుంచి 1,140 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్‌ శాఖ ఎడి లెక్కలు చూపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.

➡️