- అనంత నగరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
- ఎమ్మెల్యే ఆదేశిస్తున్నా చర్యలు శూన్యం
- టౌన్ ప్లానింగ్ అధికారుల వింత ధోరణి
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరంలో అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను అమలు చేయడంలో టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు క్షేత్రస్థాయిలో కన్పిస్తోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా నగరంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు నిర్మితం అవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు ఉన్నవారికి బాధ్యతలు అప్పగించకుండా విభాగాధిపతి, మరో ఉన్నతాధికారి ద్వంద్వ వైఖరి అవలంభిస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం కష్టతరం అవుతోందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో విన్పిస్తోంది.
టౌన్‌ప్లానింగ్‌లో సిబ్బంది కొరత..!
కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో 16 మందికిపైగా సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఆ అధికారి డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 15వ తేదీతో డిప్యూటేషన్ కాల పరిమితి ముగిసింది. కొన్ని రోజులుగా ఆ ఉద్యోగిని సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శిరీష, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ మంజుల మాత్రమే విభాగం అంతటికీ ఫీల్డ్‌వర్క్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పాతూరు ప్రాంతాన్ని టిపిఎస్ మంజుల పర్యవేక్షిస్తుండగా, మిగతా ప్రాంతమంతా టిపిఎస్ దుర్గాంజలి పర్యవేక్షిస్తున్నారు. దుర్గాంజలి డిప్యూటేషన్ గడువు ముగియటం తోడు ఆమె వ్యక్తిగత కారణాలతో సెలవులపై వెళ్లనున్నారు. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ శిరీష ఎక్కువగా కార్యాలయానికే పరిమితమవుతున్నారు. అనారోగ్య సమస్యలతో ఫీల్డ్‌వర్క్‌కు వెళ్లలేకపోతున్నట్లు ఆమె కూడా ఉన్నతాధికారులకు చెబుతున్నారు.
నిర్మాణాల్లో నిబంధనలకు పాతర
నగరంలో జరుగుతున్న పలు భవన నిర్మాణాలను పరిశీలిస్తే నిబంధనలు ఏమాత్రం పాటించనట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాల ద్వారా లభించాల్సిన ఆదాయం భారీగా గండిపడుతున్నా అధికారులెవరూ దీనిపై దృష్టి సారించడం లేదు. సెలవులపై వెళ్లినవారు భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడానికి వక్రమార్గాల అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాటిని కట్టడి చేయకపోవడం చూస్తే అందులో ఉన్నతాధికారుల పాత్ర లేకుండా జరగదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నగరంలోని అనధికార నిర్మాణాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ బాలస్వామి, ఇన్‌ఛార్జి ఎసిపి టిపిఒ శిరీషకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై టిపిఒ శిరీష మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే కోరినట్లుగా అక్రమ కట్టడాల జాబితా తయారు చేసి అందజేస్తామని తెలిపారు.
నగరంలో సగభాగానికి పర్యవేక్షణాధికారులు లేకున్నా వాటిని భర్తీ చేసే దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. పాలనాపరమైన సమస్యలు పరిష్కరించి అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించాల్సిన అధికారులే వాటిని నీరు కార్చే విధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీనికి తోడు మారిన టౌన్ ప్లానింగ్ నిబంధనలతో భవన ప్లాన్లను వేసే ఎల్‌టిపిలు, బిల్డర్లు ప్లాన్ల అనుమతి పొందడంలో నిర్మాణ లోపాలు, డివియేషన్ తదితర అంశాలకు సంబంధించి తామే బాధ్యత వహిస్తామని, ప్రభుత్వం చేపట్టే క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతామని అఫిడవిట్ అందించాల్సి ఉంది. ఈ నిబంధనతో గడచిన రెండు నెలలుగా ఎల్‌టిపిలు, బిల్డర్లు ప్లాన్లను సమర్పించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని విధాలాలుగా భవన నిర్మాణాల్లో జరుగుతున్న లొసుగులు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చకపోగ, అక్రమాలకు తావిస్తోందనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్‌ను చక్కదిద్దిల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావన ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.