- పనితీరు మందగిస్తుంది
- ఉద్యోగుల ఆరోగ్యం పైనా ప్రభావం
- పని-జీవితం మధ్య సమతూకం అవసరం
- పరిశోధకుల మనోగతం
న్యూఢిల్లీ : దేశ పురోభివృద్ధి కోసం యువత వారంలో 70 గంటల పాటు పనిచేయాలని గత సంవత్సరం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సలహా ఇచ్చారు. అమెరికాలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఓ అడుగు ముందుకు వేసి విజయాన్ని అందుకోవాలంటే వారానికి వంద పని గంటలు ఉండాలని సూచించారు. అయితే దీర్ఘకాల పని గంటలు సత్ఫలితాలను ఇవ్వకపోగా ప్రతికూల పరిణామాలకు దారితీస్తాయి. ఉద్యోగుల సామర్ధ్యం దీర్ఘకాలం కొనసాగాలంటే ఆరోగ్యకరమైన పని-జీవితం సమతూకంగా ఉండాలని పరిశోధనలు చెబుతున్నాయి.
పని ప్రదేశంలో ఎక్కువ గంటలు గడపడం ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది కూడా. 26 సంవత్సరాల అన్నా సెబస్టియన్ పెరయిల్ అనే అకౌంటెంట్ మరణం ఉద్యోగుల పని ఒత్తిడికి, మానసిక ఆందోళనకు అద్దం పడుతోంది. ఆమె నాలుగు నెలల క్రితమే ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆ సంస్థ ఇండియా విభాగం చైర్మెన్‌కు పెరయిల్ తల్లి ఓ లేఖ రాస్తూ తన కుమార్తెకు పనిభారం అధికమైందని, తనకు విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిద్ర, ఆహారం కూడా మానేసిందని ఆరోపించారు.
మనుగడ కోసం…
పనిని, జీవితాన్ని సమతూకం చేసుకునే ఉద్యోగులు విధి నిర్వహణలో పెద్దగా ఇబ్బందులు పడరు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్ధతతో ముందుకు సాగుతారు. పని, జీవితం…వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అటు ఉద్యోగంలోనూ మంచి పనితీరు కనపడుతుంది. వాస్తవానికి మన దేశంలో చాలా మంది ఉద్యోగులు నారాయణ మూర్తి చెబుతున్న ‘వారానికి 70 గంటల’ కంటే ఎక్కువ సమయమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ మనుగడ కోసం పోరాటాన్ని కొన సాగించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఆశా వర్కర్లు రోజుకు 10-14 గంటలు పని చేస్తున్నారు. ఇంత కష్టపడినా వారికి నెలకు వచ్చే జీతం మూడు వేల రూపాయలు మాత్రమే. గిగ్ వర్కర్లు కూడా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. ఇదంతా తమ పోషణకోసమేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఫలితాలపై పనిగంటల ప్రభావం
2022లో అంతర్జాతీయ కార్మిక సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం దక్షిణాసియాలో గరిష్టంగా వారానికి సగటు పని గంటలు 49. 48.8 పని గంటలతో తూర్పు ఆసియా రెండో స్థానంలో ఉంది. దేశం ముందడుగు వేయాలంటే ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి పిలుపునివ్వడం దేశభక్తిని వక్రీకరించడం, అంకితభావాన్ని నెంబర్ గేమ్‌గా కుదించడమే అవుతుంది. కార్మికులు తక్కువ గంటలు పనిచేసినప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని బిజినెస్ స్కాలర్ జెఫ్రీ ఫెపర్ అభిప్రాయపడ్డారు. వారానికి సగటున 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఉత్పాదకత తగ్గిపోతుందని ఎమ్మా లక్స్‌టన్ అనే పరిశోధకురాలు తేల్చారు. పని గంటలు పెరిగితే పనితీరు మందగిస్తుందని గతంలో అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా తెలిపింది. చేసే పనిలో స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఆరోగ్యంతో పాటు ఉద్యోగి పనితీరు కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
ఐస్‌లాండ్ అనుభవాలతో…
పని గంటల విషయంలో ఉద్యోగులకు వెసులుబాటు ఉండాలని, అప్పుడే వారు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఎక్కువగా నెరవేరుస్తారని పరిశోధకుల అభిప్రాయం. దీనివల్ల పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయించుకుంటే వారితో నిరాసక్తత కలుగుతుంది. ఒత్తిడికి గురవుతారు. ఉత్పత్తి కూడా పడిపోతుంది. తక్కువ పని గంటలు సమర్ధతను పెంచుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఐస్‌లాండ్‌లో 2015-2019 మధ్యకాలంలో 2,500 మందికి వారానికి నాలుగు పనిదినాల పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కాలంలో వారి ఉత్పాదకత పెరిగిందని తేలింది. వారి ఆరోగ్యం కూడా మెరుగైంది. పని-జీవితం మధ్య సమతూకం ఏర్పడింది. ఐస్‌లాండ్ అనుభవాల నేపథ్యంలో బెల్జియం, జర్మనీ, పోర్చుగల్ కూడా అలాంటి ప్రయోగాలే చేశాయి. అవి కూడా మంచి ఫలితాలనే అందించాయి. పని గంటలు కుదించడం, విశ్రాంతి సమయాన్ని తప్పనిసరి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. పని గంటలను తగ్గించిన బెల్జియం, జర్మనీ దేశాలలో సత్ఫలితాలు కన్పిస్తున్నాయి.