భారత్‌లో కుదేలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు : నివేదిక

న్యూఢిల్లీ :   భారత్‌లోని మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లతో కుదేలవుతున్నాయి. ఆ సవాళ్లు వారి వినియోగంపై తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయి. మధ్యతరగతి క్షీణతకు ప్రాథమికంగా మూడు అంశాలు కీలకంగా ఉన్నాయని మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నివేదక పేర్కొంది. సాంకేతిక అంతరాయాలు, పునరావృతమవుతున్న ఆర్థిక మాంద్యం, గృహ ఆదాయ వ్యయ పట్టీలో తగ్గుదల కారణంగా మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లకు గురవుతున్నారని తెలిపింది. రాబోయే త్రైమాసికాలలో తిరోగమనం స్థిరీకరించవచ్చని, సాంకేతిక అంతరాయాలు, క్షీణిస్తున్న గృహ పొదుపులు మరింత ప్రభావం చూపవచ్చని మార్సెల్లస్‌ నివేదిక పునరుద్ఘాటించింది.

పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో క్లరికల్‌, సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు ఎంతగా క్షీణించాయో ఈ నివేదిక హైలెట్‌ చేసింది. యాంత్రికీకరణం, అవుట్‌సోర్సింగ్‌ల కారణంగా సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు అదృశ్యమయ్యాయని పి.సి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ మాజీ యాక్టింగ్‌ చైర్మన్‌ మోహనన్‌ పేర్కొన్నారు. కృత్రిమ మేథస్సు (ఎఐ) విఘాతం కలిగిస్తుందని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ గతంలో పేర్కొన్న అంశాన్ని ఆయన ఉద్ఘాటించారు. కొన్ని ఉద్యోగాలు ముఖ్యంగా వైట్‌ కాలర్‌ జాబ్స్‌ అదృశ్యం కాబోతున్నాయి అని అన్నారు.

భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి అనంతరం వృద్ధి మందగించింది. ఆర్థిక వ్యవస్థను పునరావృత తిరోగమనంలోకి నెడుతోంది. 2008లో ఆర్థిక పతనం వంటి సంక్షోభాలు కాకుండా, ఆర్థిక సంవత్సరం 24-25లో రెండవ త్రైమాసికంలో కార్పోరేట్‌ ఆదాయాలు రెండు దశాబ్దాల కన్నా అత్యంత క్షీణతను నమోదు చేశాయి. స్వేచ్ఛా -మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలలో ఇటువంటి తిరోగమనాలు సాధారణమైనప్పటికీ .. మధ్యతరగతి కుటుంబాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉందని, వారి వినియోగాన్ని మరింత అడ్డుకుంటోందని నివేదిక పేర్కొంది.

పెరుగుతున్న గృహ రుణాలతో పరిస్థితి మరింత దిగజారింది. ఆర్‌బిఐ డేటా ప్రకారం.. జిడిపిలో నికర గృహ పొదుపులు దాదాపు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. స్థూల పొదుపులు స్థిరంగా ఉన్నప్పటికీ.. విద్యార్థుల రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డ్స్‌ వంటి అసురక్షిత రుణాలతో నికర పొదుపులు తగ్గాయి. దీంతో ఖర్చులు పోను ఇంటి ఖర్చులకు మిగిలే అతి తక్కువ ఆదాయాలతో మధ్యతరగతి కుటుంబాల వినియోగం కుంటుపడింది.

పట్టణ వినియోగానికి ఎంఎంసిజి కంపెనీలు ప్రాతినిథ్యం వహిస్తుంటాయి. మధ్యతరగతి వ్యయంలో కనిపించే మందగమనాన్ని ఇవి హైలెట్‌ చేశాయి. అమ్మకాలు క్షీణించడానికి ‘కుంచించుకుపోతున్న మధ్యతరగతి’ ప్రధాన కారణమని నెస్లె ఇండియా ఎండి సురేష్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. ఆహార పానీయాల రంగంలో రెండంకెల వృద్ధి రేటు ఇప్పుడు 1.5 శాతం నుండి 2శాతానికి పడిపోయిందని అన్నారు.

పట్టణ మార్కెట్లలో వినియోగం తక్కువగా ఉందని హిందుస్థాన్‌ యూనీలివర్‌ పేర్కొంది. ముఖ్యంగా పెద్దనగరాల్లో పట్టణ వృద్ధి క్షీణించిందని ఆ కంపెనీ సిఇఒ రోహిత్‌ జావా పేర్కొన్నారు. ఎంఎంసిజి అమ్మకాలలో మూడింట రెండింతల వాటా కలిగిన పట్టణ మధ్యతరగతి అసమానంగా ప్రభావితమైంది. పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, తగిన ఆదాయం లేకపోవంతో గతంలో కొనుగోళ్లను కొనసాగించడం కష్టతరం చేసిందని అన్నారు.

➡️