అమానుష శ్రమదోపిడీ

Jan 17,2025 00:46 #CITU, #increase, #proposal, #working hours
  •  పనిగంటల పెంపు ప్రతిపాదనపై సిఐటియు
  • కార్మికుల రక్తాన్ని, స్వేదాన్ని పీల్చేస్తున్నారని మండిపాటు
  • తగ్గుతున్న వేతనాలు… పెరుగుతున్న కార్పొరేట్‌ లాభాలు
  • వారానికి ఐదు రోజులు, 35 గంటలే పని ఉండాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : వారానికి 90 పనిగంటలు ఉండాలంటూ ఎల్‌ అండ్‌ టి అధిపతి ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పలు కార్మిక సంఘాలు ఆ వ్యాఖ్యలను ఖండించాయి. వారానికి 70 పనిగంటలు ఉండాలంటూ 2023లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన చేసిన ప్రతిపాదనకు కూడా ఇలాగే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎల్‌ అండ్‌ టి అధిపతి చేసిన తాజా వ్యాఖ్యపై సిఐటియు మండిపడింది. కార్పొరేట్‌ శక్తులు పోటీ పడుతూ కార్మికుల రక్తాన్ని, స్వేదా న్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల పనిగంటలను పెంచేందుకు మోడీ నేతృత్వంలోని మతతత్వ-కార్పొరేట్‌ ప్రభుత్వంతో బడా కార్పొరేట్‌ సంస్థల అధిపతులు చేయి కలిపారని సిఐటియు విమర్శించింది. వారానికి ఐదు రోజుల పనిదినాలు, 35 పనిగంటలు మాత్రమే ఉండాలని డిమాండ్‌ చేసింది. ఇప్పటికే పెంచిన పనిగంటలు కార్మికుల ఆరోగ్యం, సామాజిక జీవనంపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంత జరుగుతున్నా అమానుషమైన పని పరిస్థితులతో ఉద్యోగాలలో కోత పెట్టేందుకు, కార్మిక ఖర్చులను తగ్గించుకునేందుకు కార్పొరేట్‌ వర్గం పైశాచిక కసరత్తు జరుపుతోంది. తమ లాభాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటోంది. సమర్ధత-ఉత్పాదకత ముసుగులో కార్మికుల శ్రమను మరింతగా దోచుకోవాలని చూస్తోంది. వీరి ప్రయత్నాల కారణంగా 2022లో 11,486 ఆత్మహత్యలు జరిగాయని క్రైమ్‌ బ్యూరో రికార్డులే చెబుతున్నాయి’ అని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో తెలిపారు.
‘చైనా, యూరప్‌, అమెరికా వంటి ఉత్పాదక దేశాలతో పోలిస్తే అధికారిక రంగంలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు సైతం ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. కార్మికుల నుండి ఆమానవీయంగా శ్రమను దోచుకుంటున్నారు. జోడించిన నికర విలువలో (వస్తువు లేదా సేవ విలువ నుంచి దాని ఉత్పత్తి ఖర్చును తీసివేయగా వచ్చింది) వేతనాల వాటా పడిపోవడం శ్రమ దోపిడీని సూచిస్తోంది. 1990-91లో వేతనాల వాటా 27.64 శాతం ఉంటే 2022-23 నాటికి 15.94 శాతానికి తగ్గింది. అదే సమయంలో నికర లాభాల వాటా 19.06 శాతం నుండి 51.92 శాతానికి పెరిగింది’ అని తపన్‌సేన్‌ వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి విధేయత చూపుతున్న కార్పొరేట్‌ సంస్థలు ఒక దాని వెంట ఒకటిగా పనిగంటలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. లేబర్‌ కోడ్లను ఇంకా నోటిఫై చేయకపోయినా బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు కొన్ని బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు కూడా పనిగంటలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించాలని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.

➡️