కదిరి కో-ఆపరేటివ్‌ సొసైటీలో అక్రమాలు

సెంట్రల్‌ స్టోర్‌ నిధులు రూ.24 లక్షల స్వాహా .!
ఎన్‌పి.కుంట మండలంలో రూ.28 లక్షలు
నల్లచెరువు ఎస్‌.మొలకలపల్లి సొసైటీలో రూ.32 లక్షలు గోల్‌మాల్‌
ఉద్యోగుల అరియర్స్‌లోనూ చేతివాటం
ప్రజాశక్తి-కదిరి టౌన్‌ : కదిరి డివిజన్‌లోని కదిరి రూరల్‌ మల్లయ్య గారి పల్లి 10, గొల్లొళ్లచెరువు, నల్లచెరువు ఎస్‌.మొలకల పల్లి 36, తలుపుల, నబులపులకుంట మండలంలో 28, గాండ్లపెంట మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట పెట్టుబడి కోసం రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి సకాలంలో సహకార సంఘాల్లో సిబ్బందికి అసలు, వడ్డీ చెల్లించారు. ఇక్కడే సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రైతుల నుంచి తీసుకున్న సొమ్ముకు సంబంధించి రసీదు ఇచ్చి భూమికి సంబంధించిన కంప్యూటర్‌ పోర్టల్‌లో కేవలం కంటితుడుపుగా చూపించి ఆ మొత్తం బ్యాంక్‌కు చెల్లించకుండా వారే స్వాహా చేసేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది రైతులు బ్యాంక్‌లో రుణం మంజూరుకు వెళ్తే సహకార సంఘాల్లో రుణం బకాయి ఉన్నట్లు చూపించడంతో అన్నదాతలు ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా వారు విచారణకు ఆదేశించారు.
అయితే ఈ విచారణ నామమాత్రంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పంట రుణాల రెన్యూవల్‌ కాకపోవడంతో ప్రభుత్వం ద్వారా రైతులకు అందించాల్సిన రాయితీలు అందకుండా పోతున్నాయి.

ఉన్నతాధికారులకూ చేయి తడపాల్సిందే..!
కదిరి కో-ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగస్తులకు అరియర్స్‌ ఇతరత్రా వ్యవహారాల్లో జిల్లా స్థాయి అధికారులకు చేయితడపందే చెల్లింపులు కాని పరిస్థితి ఉన్నట్లు సమాచారం. చేయితడపకపోతే ఉద్యోగులకు అరియెర్స్‌, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ చెల్లించని పరిస్థితులు ఉన్నాయి.

బైలాలో లేని చట్టం అమలు.!
డిస్ట్రిక్‌ కో-ఆపరేటివ్‌ ఆఫీసర్‌కు చేయి తడిపితే బైలాలో లేని చట్టాన్ని కూడా యథేచ్ఛగా అమలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని మండలాల సీఈవోలు ఉద్యోగ విరమణ వయస్సు దాటినా వారి నుంచి ముడుపులు పుచ్చుకుని మరో రెండేళ్లు పొడిగించేలా నిర్ణయాలు చేసేశారు. కొత్తగా ఉద్యోగ నియామకాలు లేకపోయినా, కొన్ని మండలాల్లో అనధికారికంగా నియమించినట్లు తెలుస్తోంది. సొసైటీ అభివృద్ధి కోసం నిజాయితీగా కష్టపడి పని చేసే వారికి మాత్రం ఉద్యోగోన్నతులు నేటికీ దక్కని పరిస్థితి ఉంది.

ఎస్‌ఆర్‌లోనూ అవకతవకలు
సొసైటీలో సిబ్బంది విధుల హాజరుకు సంబంధించిన ఎస్‌ఆర్‌లోనూ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ స్టోర్‌కు సంబంధించి సొంత ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది 24 లక్షల రూపాయల రికవరీ చేయకుండా రూ.18 లక్షలు మాత్రమే చూపించి రైతులకు సంబంధించిన డబ్బులు సొసైటీ సిబ్బంది అడ్డగోలుగా బొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిన్నింటిపై సంబంధిత ఉన్నతాధికా రులు సమగ్ర విచారణ జరిపిస్తే అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున బయటకు వస్తాయని రైతులు చెబుతున్నారు.

➡️