శివారుకు సాగునీరు కష్టమే!

  • కాలువల్లో కానరాని పూడికతీత
  • వర్షాలు వస్తే ముంపే?

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు శివారు భూములకు సాగునీరు అందుతుందా? వర్షాలు వస్తే ముంపు నుంచి పంటను కాపాడుకోగలుగుతామా? అనే సందేహాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులను వెంటాడుతున్నాయి. రుతుపవనాలు అనుకున్నట్టే కదులుతున్నాయి. వర్షాలు కూడా పడుతుండడంతో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దుక్కి పనుల్లో రైతులు నిమగమయ్యారు. మరో వారం పది రోజుల్లో నాట్లు కూడా వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి అవసరం చాలా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి కాలువలు, ఏలేరు, పుష్కర, పిబిసి కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఒక్క గోదావరి కాలువల పరిధిలోనే నాలుగు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. మెట్టలో ఏలేరు, పుష్కర, పిబిసి, సుద్ధగడ్డ కాలువల పరిధిలో మరో 1.20 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవురతుంటాయి. గోదావరి డెల్టా కాలువలకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నా నేటికీ శివారు ఆయకట్టు పరిధిలోని సుమారు 42 వేల ఎకరాలకు నీరు చేరలేదు. తూర్పు డెల్టా ప్రధాన కాలువ కడియం లాకుల దిగువన పూర్తిగా పూడికతో నిండిపోయింది. సామర్లకోట, పెద్దాపురం మండలాలకు తాగునీరు, సామర్లకోట, అనపర్తి, బిక్కవోలు మండలాలకు ఈ కాలువ నీరే అందించాల్సి ఉంది. ఈ కాలువ కింద 62,453 ఎకరాల ఆయకట్టు ఉంది. పూడికతీత పనులు చేపట్టకపోవడంతో శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందే పరిస్థితి కనిపించట్లేదు. సెంట్రల్‌ డెల్టాకు సంబంధించి కొత్తపేట నుంచి ముక్కామల వరకూ కాలువ పూడికతో కుచించుకుపోయింది. 2.10 లక్షల ఎకరాలకు ఈ కాలువ నీరే శరణ్యం. ఇక్కడి డ్రెయిన్లు గుర్రపుడెక్క, చెత్తతో నిండిపోయాయి. పిఠాపురంలో ఏలేరు కాలువ పూడికతీత పనులు జరగక సాగునీరు ప్రవహించే పరిస్థితే కనిపించట్లేదు.

కానరాని క్లోజర్‌ పనులు
రాష్ట్ర ప్రభుత్వం క్లోజర్‌ పనులకు మంగళం పలికింది. గోదావరి డెల్టా కింద ఉభయగోదావరి జిల్లాల్లో పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వల ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. తూర్పు డెల్టాలో 268.6 కిలోమీటర్లు, మధ్య డెల్టాలో 226.83 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలు ఉన్నాయి. కాలువల్లో పూడికతీత పనులకు ఎన్నికల కోడ్‌కు ముందుగానే జనవరిలో అధికారులు ప్రతిపాదనలు పంపారు. తూర్పు, మధ్య డెల్టాల్లో 430 పనులకు సంబంధించి రూ.31.54 కోట్లు అవసరమని, ఈ పనులకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ, ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో పనులు ఎక్కడా ప్రారంభం కాలేదు. పూడికతీత కోసం 2022-23లో రూ.63 కోట్లు, 2023-24లో రూ.12 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయినా, చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో, ఈ ఏడాది టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.

ఏటా ముంపే…
కాలువల్లో పూడిక తీయకపోవడంతో వర్షాలు పడితే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. కాలువలు మట్టి, గుర్రపు డెక్కతో పూడికపోవడంతో నీటి ప్రవాహం జరగట్లేదు. పొలాల్లోని వర్షపు నీరు పోయే మార్గం లేక పంటలు మునిగిపోతున్నాయి. పూడికతీత జరగకపోవడంతో గతేడాది ఖరీఫ్‌లో తుపానుకు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురం రూరల్‌ మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.

ఈ ఏడాది పూడికతీత పనులు లేవు :  వై.వెంకటేశ్వరరావు, రైతు, జేగురుపాడు
గతంలో కొంతమేర అయినా పూడికతీత పనులు జరిగేవి. ఈ ఏడాది పనులు మొదలు పెట్టలేదు. కాలువలకు నీటిని విడుదల చేసినా పూడికతీత పనులు జరగకపోవడంతో శివారు ప్రాంతాలకు నీరు అందడం కష్టమే.

ప్రతిపాదనలు పంపించాం : కాశీ విశ్వేశ్వరరావు, ఇఇ, ఇరిగేషన్‌ శాఖ
పూడికతీత, క్లోజర్‌ పనులకు రూ.31.54 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది జనవరిలోనే ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.

➡️