- వ్యవసాయ రంగంలో ఏటా తగ్గుతున్న విస్తీర్ణం
- రైతులకు కొరవడుతున్న ప్రోత్సాహకాలు
- పెరుగుతున్నపెట్టుబడులు
- తగ్గుతున్న ఆదాయం
- విజన్-2047 డాక్యుమెంట్‌పై అధికారుల మల్లగుల్లాలు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అన్ని రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో నూతనంగా నిర్దేశించుకున్న విజన్-2047 ప్రణాళికల అమలుకు అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని వనరులు, వివిధ రంగాల్లో వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల ద్వారా ఏటా 15 శాతం వృద్ధి సాధించాలని, ఐదేళ్లలో వృద్ధి ప్రస్తుతం ఉన్న దాని కన్నా రెట్టింపు కావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించింది. వివిధ జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం… వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఏటా క్షీణిస్తోంది. కాగితాల్లో గణాంకాలు చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు తగ్గడం, ఉత్పత్తులు చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోవడం, ఉత్పత్తులన్నీ రైతుల నుంచి దళారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ధరలు పెరగడం పరిపాటిగా మారింది. కౌలు రైతులే ఎక్కువగా పంటలను సాగు చేస్తున్నారు. వారికి కనీస ఆదరణ, గుర్తింపు లేకుండా ఉంది. దీంతో, సాగు సంక్షోభంలో చిక్కుకుంటోంది. సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి మరింత పెరిగింది. 15 నుంచి 20 శాతం విస్తీర్ణం తగ్గడం, లక్షలాది ఎకరాలు ఎలాంటి పంటలూ వేయకుండా ఉండడం గత పదేళ్లగా వ్యవసాయ క్షీణతను తెలియజేస్తోంది. ప్రధానంగా ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడంతో వృద్ది రేటు పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతోందని అధికారులు అంగీకరిస్తున్నారు. 2014 ఖరీఫ్‌లో రాష్ట్రంలో సాగు భూమి 1,05,90,000 ఎకరాలు కాగా, 2024 నాటికి 85,50,250 ఎకరాలకు తగ్గిపోయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014 ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 99 లక్షల ఎకరాలు కాగా, 2024లో 69,97,400 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వ్యవసాయ శాఖ నుంచి కొంత భూమి ఉద్యాన పంటలకు బదలాయింపు జరిగినా ఎక్కువ భూమి వ్యవసాయేతర అవసరాలకు మారుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగానికి, ఆక్వా కల్చర్‌కు ఎక్కువగా భూ మార్పిడి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 66 వేల ఎకరాలు జగనన్న కాలనీలకు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం రైతుల నుంచి సాగు భూమిని కొనుగోలు చేసింది. రాజధాని ప్రాంతంలో 34 వేల ఎకరాల రైతుల పట్టా భూమి, మరో 16 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సిఆర్‌డిఎ తీసుకుంది. వివిధ జిల్లాల్లో రియల్టర్ల కొనుగోళ్లుకూడా పెద్ద సంఖ్యలో జరిగాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల ప్రభావం, మరోవైపు పెట్టుబడులు భారీగా పెరగడం, ప్రభుత్వ సంస్థలు ఆంక్షల పేరుతో సకాలంలో ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు అవుతుందనే నమ్మకం రైతులకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం నిర్దేశించిన వృద్ధి (విజన్ డాక్యుమెంట్-2047)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాగు నీరు, రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధరల కల్పన, కనీస మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడితే తక్షణ సాయం, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు అందించగలిగితే వృద్ధి రేటు కొంతవరకు మెరుగుపడుతుందని వ్యవసాయ అధికారులు, రైతు ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న వృద్ధి సాధించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.