‘ఇన్సూరెన్స్‌’ నిర్వీర్యమేనా?

Dec 9,2024 02:44 #Insurance
  • బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐ
  • 74 శాతం నుంచి పెంచాలంటూ ప్రతిపాదన
  • సంబంధిత బిల్లుపై కేంద్రం అత్యుత్సాహం
  • బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ-2 పాలనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ)ను అప్పటి ప్రతిపక్ష బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎఫ్‌డిఐకి మద్దతు ఇవ్వబోమని చెప్పింది. తుది శ్వాస వరకూ ఎఫ్‌డిఐను వ్యతిరేకిస్తామని ఆ సమయంలో తెలిపింది. న్యూఢిల్లీలో 2013లో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) సమావేశంలో అప్పటి బిజెపి నాయకులు ఇవే మాటలు చెప్పారు. అయితే, 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం మూడోసారి అధికారంలో కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం.. తన గత మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశ బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు దారులు తెరుస్తున్నది. దీనికి సంబంధించిన బిల్లులో ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే, దేశంలోని అత్యంత కీలక రంగాల్లో ఒకటైన ఇన్సూరెన్స్‌ సెక్టార్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.

దేశంలోని సాధారణ ప్రజలు, రైతులు, సంస్థలు ఇలా జీవిత, ఆరోగ్య వంటి పలు రకాల బీమా మీద ఆధారపడుతుంటాయి. మోడీ సర్కారు విధానాలతో బీమా రంగంలో ప్రయివేటు, కార్పొరేటు ఆధిపత్యం ఎక్కువైంది. బీమా రంగంలోకి ప్రవేశించి పెద్ద మొత్తంలో సంపదను పోగు చేసుకుంటున్నాయి. ఎల్‌ఐసీ వంటి సంస్థలకు ఇది ప్రతికూల వాతావరణాన్ని కల్పించింది. కొన్ని అధ్యయనాలు, సర్వేల ప్రకారం.. ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి బీమా రూపంలో వినియోగదారులకు అందే ప్రయోజనాల కంటే.. సదరు కంపెనీలే ప్రీమియం రూపంలో వచ్చే మొత్తంతో ఎక్కువగా లాభాన్ని పొందుతున్నాయి.
ఇలాంటి తరుణంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు దారులు తెరవటం ఈ రంగానికి చేటు చేస్తుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఫలితంగా, బీమా రంగంపై దేశ, విదేశీ సంస్థల ఆధిపత్యం మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంగా ఎఫ్‌డీఐను వ్యతిరేకించిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలో ఉండి దానిని సమర్ధించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

దీనికి సంబంధించిన బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తున్నది. వాస్తవానికి, ప్రస్తుత సెషన్‌లోనే ఈ బిల్లును ప్రవేశపెడతారని అంతా అనుకున్నారు. కానీ, బిల్లులో మరికొన్ని సర్దుబాట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించినట్టు సమాచారం. డ్రాఫ్టు బిల్లులో మార్పులు తీసుకొచ్చి రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ”ఇన్సూరెన్స్‌ చట్టం, 1938లోని పలు నిబంధనల సవరణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందులో బీమా రంగంలో ఎఫ్‌డీఐను వంద శాతానికి పెంచటం, పెయిడ్‌-అప్‌ క్యాపిటల్‌ తగ్గింపు, కాంపొజిట్‌ లైసెన్స్‌కు నిబంధన వంటివి ఉన్నాయి. ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌).. ప్రతిపాదిత సవరణలపై ఈనెల 10లోగా పబ్లిక్‌ కామెంట్స్‌ని కోరింది” అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, బీమారంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతంగా ఉన్నది. అయితే, ప్రస్తుత ప్రతిపాదనతో భారతీయ బీమా కంపెనీల్లో ఇది వంద శాతానికి పెరగనున్నది.

ఇన్సూరెన్స్‌ యాక్ట్‌ 1938, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1956, ది ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌, 1999లకు ప్రతిపాదిత సవరణలపై డీఎఫ్‌ఎస్‌ నుంచి ఇది రెండో పబ్లిక్‌ కన్సల్టేషన్‌. ప్రస్తుతం, భారత్‌లో 27 జీవిత బీమా కంపెనీలు, 34 నాన్‌-లైఫ్‌ లేదా సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి. ఇందులో భారత వ్యవసాయ బీమా కంపెనీ, ఈసీజీసీ లిమిటెడ్‌లు కూడా ఉన్నాయి.
గతనెల 25న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 20 వరకు కొనసాగనున్న విషయం విదితమే. అయితే, ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు అదానీ ముడుపుల వ్యవహారం, సంభాల్‌, మణిపూర్‌ హింస వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతుండగా.. కేంద్రం మాత్రం అందుకు విముఖతను వ్యక్తం చేస్తున్నది. దీంతో, కొన్ని రోజులుగా పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పర్వంతోనే ముగుస్తున్న విషయం విదితమే.

➡️