Bangladesh : తాత్కాలిక ప్రభుత్వం చెల్లుబాటు కానుందా..

ఢాకా :    ఉవ్వెత్తున ఎగసిన విద్యార్ధుల ఆందోళనలు, హింస, నిర్బంధాల నడుమ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేశాక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పార్లమెంటును రద్దు చేశారు. రక్షణ రంగానికి చెందిన అధిపతులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులతో చర్చించిన మీదట పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్‌ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ను నియమించారు.

అయితే బంగ్లాదేశ్‌ రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నిబంధనలు లేవు. కేవలం ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఆ నిబంధనలు వర్తిస్తాయి. ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా తాత్కాలిక ప్రభుత్వానికి ఈ నిబంధనలు వినియోగిస్తే… అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  అనంతరం 2009-14 మధ్య హసీనా పదవీకాలంలో 2011లో రాజ్యాంగంలోని 15వ సవరణను (తాత్కాలిక ప్రభుత్వ నిబంధన) రద్దు చేసింది. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుందనేది ప్రధాన ప్రశ్న.

నిపుణులు న్యాయమూర్తి షహబుద్దీన్‌ అహ్మద్‌ (లేటు) తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడం యొక్క పూర్వాపరాలను ఎత్తి చూపారు. రాష్ట్ర సంక్షోభ సమయాల్లో అలాంటి నిబంధనను సృష్టించవచ్చని, అయితే భవిష్యత్తులో దీనికి రాజ్యాంగ ధ్రువీకరణ అవసరమని వాదించారు.

తాత్కాలిక ప్రభుత్వం ఎందుకు ?

షేక్‌ హసీనా రాజీనామాతో కేబినెట్‌ రద్దయింది. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు పార్లమెంటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశ  పరిపాలనకు అవసరమైన  రాజ్యాంగ  ప్రేమ్‌ వర్క్‌ ప్రస్తుతం అమలులో లేదు. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి.

రాజ్యాంగంలో నిబంధనలు
తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే సంరక్షక ప్రభుత్వానికి సంబంధించి ఓ నిబంధన ఉంది. ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడేంతవరకు దేశంలో అవసరమైన ప్రభుత్వ విధులను, కార్యకలాపాలను ఈ సంరక్షక ప్రభుత్వం నిర్వహిస్తుంది.

బంగ్లాదేశ్‌ రాజ్యాంగంలోని 13వ సవరణ… సంరక్షక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించవచ్చని, నిష్పక్షపాతంగా అధికారాన్ని బదిలీ చేయవచ్చని చెబుతోంది. ఈ సవరణ 1996లో ఆమోదం పొందింది. ఈ సవరణ రాజ్యాంగంలోని పార్ట్‌ IV లో చాప్టర్‌ 11ఎ : నాన్‌ పార్టీ కేర్‌ టేకర్‌ గవర్నమెంట్‌ అనే కొత్త అధ్యాయాన్ని జోడించింది.

ఇది కొత్త ఆర్టికల్స్‌ 58ఎ, 58బి, 58సి, 58డి మరియు 58ఇ లను కలిగి ఉంది. ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం ముఖ్య సలహాదారు, ఇతర సలహాదారుల నియామకం గురించి వివరిస్తుంది.

దేశంలో మూడు ఎన్నికల నిర్వహణ సమయంలో ఈ విధానాన్ని వినియోగించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2011, జూన్‌ 30 అవామీ లీగ్‌ ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేసింది.

తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అప్పిలేట్‌ డివిజన్‌ తీర్పులో న్యాయవ్యవస్థ ప్రమేయం లేకుండా తదుపరి రెండు పర్యాయాలు ఈ విధానంలో ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే, ఈ సలహాను పాటించకుండా, అవామీ లీగ్‌ ప్రభుత్వం కేవలం నెలన్నర తర్వాత జూన్‌ 30, 2011న రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది.

సాధారణంగా ఇటువంటి నిర్ణయాలపై పూర్తి తీర్పు వెలువరించేందుకు కొంత సమయం తీసుకుంటారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ పూర్తి తీర్పును 2012, సెప్టెంబర్‌ 12న ప్రచురితమైంది.

ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం.. అధికారంలో ఉన్న షేక్‌ హసీనా ప్రభుత్వం పదవీకాలం ముగిసిన తర్వాత జాతీయ ఎన్నికలు నిర్వహించాలి. ఈ ప్రభుత్వం గెలిచిన రాజకీయ పార్టీ లేదా కూటమికి అధికారాన్ని బదిలీ చేయాల్సి వుంది. అయితే షేక్‌ హసీనా ప్రభుత్వం అకస్మాత్తుగా కూలిపోవడంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అయితే రాజ్యాంగంలో నిబంధన లేనందున న్యాయపరమైన సంక్లిష్టతను ఎదుర్కొవచ్చు.

ప్రత్యేక సమయాల్లో దేశం, ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవలసి ఉంటుందని ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆసిఫ్‌ నజ్రుల్‌ మీడియాతో పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనను రాజ్యాంగంలో ప్రత్యేకంగా సృష్టించవచ్చు కానీ భవిష్యత్తులో దీనికి రాజ్యాంగ చెల్లుబాటు అవసరం అని ఆయన అన్నారు.

➡️