యువతకు ప్యాకేజీ హుళక్కేనా ?

Feb 12,2024 11:53 #details
  • కటాఫ్‌ డేట్‌ విషయంలో బాధితుల ఆవేదన
  • మూడేళ్లు దాటితే రీనోటిఫికేషన్‌ నిబంధనకు తూట్లు
  • నిరాశ, నిస్పృహలలో పోలవరం నిర్వాసిత యువత

ప్రజాశక్తి- విఅర్‌.పురం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నిర్వాసిత కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ అమలు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు తాము ఆస్తులు, భూములు, సర్వం ధారపోసి నిలువనీడలేని నిర్వాసితులుగా మారితే, తమ పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని వీరంతా ఆవేదన చెందుతున్నారు.ఎప్పుడో 2017లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఇప్పుడు పరిహారం ఇస్తున్నారు. దానినే కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించి సర్వే చేసి పరిహారం ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తున్నారు. దీంతో, అప్పటికి 18 ఏళ్లు నిండని వారికి, ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఆ వయస్సు దాటినా ప్యాకేజీ అందని పరిస్థితి ఉండడం దారుణం నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. 2017 నాటికి 18 ఏళ్లు నిండకపోయినా, ఇప్పుడు 2024 నాటికి ఎంతోమంది యువతీ, యువకులు వయోపరిమితి దాటి ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేదు. భవిష్యత్‌లో ఇల్లు నిర్మించుకుందామంటే స్థలం ఉండదు. పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోవడంతో వారికి ఆర్థిక భరోసా కూడా లేదు. ఇలా అన్నింటికీ చెడి, రోడ్డున పడే దుస్థితి నెలకొందని వారంతా మనోవేదనకు గురవుతున్నారు. భూసేకరణ, పునరావాసం, ప్యాకేజీల చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ వచ్చి మూడేళ్లు గడిచిన తర్వాత దాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటే, రీ నోటిఫికేషన్‌ జారీ చేసి, కొత్తగా గ్రామాల్లో సర్వే చేసి, గ్రామ సభలను నిర్వహించాలి. అప్పటికి అర్హులైన వారిని లబ్ధిదారుల గుర్తించి, పరిహారం, ప్యాకేజీ ఇవ్వాల్సి. ఇదే విషయమై గతేడాది వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంతి జగన్‌మోహనరెడ్డి చింతూరు మండలం కల్లేరు గ్రామంలో ప్రకటించారు. అయితే, ఈ మాట అమలు అడుగు కూడా ముందుకు పడలేదు. పోలవరం నిర్వాసితుల సమస్యలు, పునరావాసం, ప్యాకేజీలపై 2006 నుంచి నేటి వరకు బాధితుల పక్షాల సిపిఎం పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో రకాల ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం వంటి ఎన్నో రూపాల్లో ఉద్యమించింది. పోలవరం ముంపు ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర, దేశ నాయకులు పర్యటించారు. భద్రాచలంలో అప్పటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య నాయకత్వంలో జరిగిన నిరసనలో ఆందోళనకారులపై పోలీసు కాల్పులు వంటి ఘటనలు మరువలేనివి. బాధితులకు నేటికీ న్యాయం జరగడం లేదు. నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

➡️