అదాని గ్రూపు సంస్థలు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్తును దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అదాని గ్రూపు భారీగా ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో కేసు నమోదు కావడం పెను సంచలనం కలిగించింది. ముడుపుల మొత్తం రూ. 2,029 కోట్లు కాగా అందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దకు రూ.1,750 కోట్లు ముట్టజెప్పారన్నది ప్రధాన అభియోగం. దీంతో గౌతం అదాని ఒక అంతర్జాతీయ మోసగాడని మరోసారి రుజువయింది.
మోడీ సర్కారు వింత వాదన
ఈ కుంభకోణంతో కేంద్రానికి సంబంధం లేదనీ ఆ ఐదు రాష్ట్రాలదేననీ కేంద్ర ప్రభుత్వమూ, బిజెపి పెద్దలూ అంటున్నారు. కానీ ఈ పాపాల పుట్ట కేంద్రం నుండి పుట్టిందే కదా! దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు తాము వినియోగించే మొత్తం విద్యుత్తులో కనీసం 10 శాతాన్ని కేంద్రీకృత సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయాల్సిందేనని, (రెన్యువబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్‌పిపిఓ)) కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించిన మాట నిజం కాదా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పడిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇ సిఐ-సెకి)యే కదా ఈ ఒప్పందాలు చేసింది. కార్పొరేట్ల నుంచి విద్యుత్తును ఎక్కువ ఖరీదుకు కొనుగోలు చేసి బలవంతంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు అంటగట్టే బ్రోకర్ గా సెకి తయారైంది. ఇందుకోసం యూనిట్‌కు ఏడు పైసల కమిషన్ కూడా తీసుకుంటామని ఈ ఒప్పందాల్లో సైతం పేర్కొంది కూడా! ఆర్‌పిపిఓ ను కండిషన్‌గా చూపి, ఇతర ఆశలు పెట్టి సెకి రాష్ట్రాల డిస్కంలతో ఒప్పందాలు చేసుకుంటోంది. కనుక ఈ ఒప్పందాలకు మూల కారకులు కేంద్ర పాలకులేనన్నది నిర్వివాదాంశం. అదాని అవినీతికి ప్రధాన రక్షకులు వారే!
వైసిపి బుకాయింపులు
మేం కేంద్ర ప్రభుత్వ సంస్థయైన సెకితో ఒప్పందం చేసుకున్నాం తప్ప అదానితో కాదన్న వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట వాదనకు నిలబడేది కాదు, వాస్తవ విరుద్ధమైనది కూడా! రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని మూడు డిస్కంల సిఎండిలు చేసుకున్న ఒప్పందంలో విద్యుత్ సరఫరా అదాని గ్రీన్ నుండి జరుగుతుందనీ, కమిషన్‌గా సెకి కి యూనిట్‌కు ఏడు పైసలు చెల్లిస్తామనీ సంతకాలు చేశారు కదా! ఇక ఒప్పందం అదానితో కాదంటూ బుకాయిస్తే ఎలా? జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సౌర విద్యుత్ ఒప్పందమేగాక అదానికి అనేక రూపాల్లో ఈ రాష్ట్ర సంపదను హారతి పళ్లెంలో పెట్టి అప్పగించిన మాట వాస్తవం కాదా? విశాఖపట్నం మధురవాడలో డేటా సెంటర్ పేరిట రూ. వేల కోట్ల విలువ చేసే 270 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. గంగవరం పోర్టు యజమాని డివిఎస్ రాజు కుటుంబాన్ని ఇడి, సిబిఐ ద్వారా బెదిరించి అదాని గుంజుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికున్న 10.4 శాతం వాటాను జగన్ సర్కారు అదానికే కారుచౌకగా అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న మూలపాడు పోర్టు కూడా అదే అదాని గ్రూపునకు కట్టబెట్టారు. ఐదు జిల్లాల్లో 6,200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టులను ఎలాంటి టెండర్లూ లేకుండానే కట్టబెట్టారు. అంతకుమించి ఏజెన్సీ (ఐదవ షెడ్యూల్ ప్రాంతం)లో రాజ్యాంగాన్ని, పీసా చట్టాన్ని సైతం ఉల్లంఘించి అదానీకి ఇచ్చేశారు కదా! ఇన్ని చేసి మళ్లీ బుకాయింపులా?
చంద్రబాబు మౌనం వెనుక…!
ప్రతిపక్షంలో ఉండగా సెకి ఒప్పందంపై విమర్శలు చేసిన టిడిపి నాయకులు ఇప్పుడు నోరెత్తడం లేదు. ఒప్పందంలో రూ.2029 కోట్ల అవినీతి ఉందని, అందులో రూ.1757 కోట్లు జగన్‌కు అందినట్లు అమెరికా న్యాయ విభాగం తేల్చిన నేపథ్యంలో ఒప్పందంలో ఏముందో వివరించే పత్రాలను బయటపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రూ.1.99 పైసలకు వచ్చే విద్యుత్‌ను రూ.2.49 పైసలకు గత ప్రభుత్వం ఎందుకు కొన్నదో బయటపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేయకపోతే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని సమర్థించినట్లే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు, జగన్ విధానాలు ఒక్కటేననీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చారు తప్ప, రాష్ట్రంలో ఇంకేమీ మారలేదని ఎవరైనా అంటే కాదనలేము కదా! పాత విధానాలే అమలవుతున్నాయని, అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని జనం భావించక తప్పదు. అలాగే, మోడీ, జగన్ ఇద్దరూ మంచి స్నేహితులు కనుక కేంద్రంలోనూ దీనిపై చర్చ లేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణం గురించి కానీ అదాని పేరు కానీ ప్రస్తావించేందుకు కూడా సాహసించ లేదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మౌనం వీడి జగన్‌పై చర్య తీసుకోవాలన్నది జన వాక్యం.
సెకి తో డిస్కంలు ఒప్పందం చేసుకోవడాన్ని సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎదుట పబ్లిక్ హియరింగ్‌లలో ఆయా సందర్భాల్లో లేవనెత్తారు. అయితే, ఈఆర్‌సి యథావిధిగా బుల్డోజ్ చేసింది.
ప్రజలపై భారాలు
సోలార్ విద్యుత్ యూనిట్ రూ.1.99 కి టెండర్లు పడిన రోజుల్లో సెకితో రూ.2.49 కి కొంటామని ఒప్పందం చేసుకున్నారు. దానికి తోడు అంతర్రాష్ట్ర రవాణా (ఐఎస్‌టిఎస్) చార్జీల పేరిట యూనిట్‌కు రూ.1.70 అదనం. 25 ఏళ్లపాటు రాష్ట్ర ప్రజలు లక్ష కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇది మోయలేని భారమే! రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు కూడా అదాని కంపెనీవే! ఇప్పుడున్న మీటర్లు కచ్చితంగా పని చేస్తున్నాగాని మీటర్ మార్చాల్సిందే! దాని విలువ 13 నుండి 18 వేల రూపాయలు ఏడు నుండి తొమ్మిదేళ్లలో నెలనెలా వినియోగదారులే చెల్లించాలి. మోడీ సర్కారు తెచ్చిన ఆర్‌పిపిఓ పర్యవసానంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు కచ్చితంగా వినియోగించాలనే (మస్ట్ రన్) కేటగిరీ కింద సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వం జెన్‌కో ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నెలకొల్పిన థర్మల్ ప్లాంట్ల పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోకుండా, ప్రైవేటు కంపెనీల సోలార్ తప్పనిసరిగా వినియోగించుకోవలసిన కేటగిరీ కింద ఒప్పందం చేసుకోవడం ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడానికే! ఈ ఒప్పందాల పర్యవసానంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు పెరిగింది. ఇలాంటి నిర్ణయాలమూలంగా విధిస్తున్న ఎఫ్‌పిపిసిఎ చార్జీలను వ్యతిరేకించాల్సిందే. గతంలో కొన్న విద్యుత్‌కు ఇప్పుడు చార్జీలు విధించడం అంటే గత విద్యుత్ చార్జీల టారిఫ్‌ను ఇప్పుడు పెంచడమే అవుతుంది. ఇది వాయిదా వేసిన చార్జీల టారిఫ్ పెంపుదలగా భావించాలి. ఏ సరుకుకూ లేని విధంగా గతంలో వాడిన దానికి ఇప్పుడు రేట్లు పెంచి వసూలు చేయడం దారుణం. అందువల్ల ఈ ట్రూఅప్, సర్దుబాటు చార్జీల విధానాన్ని వ్యతిరేకించాలి.
అమెరికా కోర్టులో కేసు నమోదైన వెంటనే కెన్యా ప్రభుత్వం అదాని గ్రూపుతో చేసుకున్న ఎయిర్‌పోర్ట్ ఒప్పందాన్ని రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం అదాని గ్రూపుతో ఒప్పందాలపట్ల పునరాలోచన చేస్తున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశ్ సర్కారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. అదే విధంగా మన రాష్ట్రంలో అదాని గ్రూపుతో చేసుకున్న విద్యుత్, పోర్టులు, డేటా సెంటర్ తదితర ఒప్పందాలన్నిటినీ ప్రభుత్వం రద్దు చేయడం అవశ్యం. గౌతం అదాని, ఇతర నిందితులను అరెస్టు చేయాలి. ఈ దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కానీ వారంతట వారు చేస్తారని ఆశించలేం కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి పెంచాలి. కార్పొరేట్లకు, ప్రభుత్వాధినేతలకు మధ్యగల ‘బలమైన బంధాన్ని’ బద్దలుకొట్టాలి.
– బి తులసీదాస్