- విశాఖ నడిబొడ్డున 2.20 ఎకరాలపై కార్పొరేట్ కన్ను
- 20 అంతస్తుల భవన నిర్మాణానికి రంగం సిద్ధం
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న టిడిపి కూటమి ప్రభుత్వం
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : అదాని స్మార్ట్ మీటర్ల వ్యాపారానికి విశాఖను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డాగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. నగరం నడిబొడ్డునగల గ్రీన్‌పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కనగల సుమారు 2.20 ఎకరాల స్థలంలోని ఎపి ఇపిడిసిఎల్ సూపరింటెండెంట్ సర్కిల్ ఆఫీసర్ కార్యాలయ భవన సముదాయం (విద్యుత్‌శాఖ భవన్)ను అదానికి కట్టబెట్టేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగల్ ఇచ్చింది. నగరం నడిబొడ్డునగల ఈ స్థలం విలువ సుమారు రూ.100 కోట్లకుపైగా ఉంటుంది. ప్రస్తుతమున్న ఇక్కడ ఉన్న రెండు అంతస్తుల భవనంలో విద్యుత్ శాఖ కార్యకలాపాలు చేపడుతున్నారు, ఈ భవనాన్ని నేలమట్టం చేసి సుమారు 20 అంతస్తుల (20 స్టోరీడ్) భవన సముదాయాన్ని అదాని నిర్మించనున్నారు అందులో ఒకటో, రెండో ఫ్లోర్‌లు ఎపిఇపిడిసిఎల్‌కు ఇచ్చి, మిగిలిన అన్ని ఫ్లోర్లనూ స్వాధీనం చేసుకోనున్నారు. అదాని స్మార్ట్ మీటర్లు, ఇతర కార్యకలాలకు ఈ భవనాలను వినియోగించుకోనున్నారు. ఈ ఒప్పందం పట్ల విద్యుత్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదానికి డెవలప్‌మెంట్‌కు ఈ భవన సముదాయాలన్నింటినీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వీరు బాహాటంగా చెబుతున్నారు. కొత్తగా కట్టనున్న భవనంలో ఇపిడిసిఎల్ ఒకటో, రెండో ఫ్లోర్లు ఇచ్చే అవకాశముందని, లేకపోతే బీచ్‌రోడ్డు సమీపాన సాగర్ నగర్‌లో నిర్మాణం జరుగుతోన్న విద్యుత్ భవన్‌లోకి తమను మార్చే అవకాశముందని అంటున్నారు. అదానితో రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల రద్దు కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడేందుకు పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్… 2024లో అధికారంలోకి వచ్చాక అదానికి సాగిలపడుతున్నారు.
చకాచకా ఫైళ్ల కదలిక
రాష్ట్రంలో కీలక నగరంగా విశాఖ ఉంది. తూర్పు తీరంలో రెండు పోర్టులు, నౌకా నిర్మాణ కేంద్రం, స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు నిలయంగా ఉన్నందున విశాఖను అదాని వ్యాపార విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంగా భావిస్తున్నాయి.
అదానికి రాష్ట్రాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వంతోనూ చకాచకా ఫైళ్లు కదులుతున్నాయి.
స్మార్ట్ మీటర్ల వివరాలు
రాష్ట్ర ప్రభుత్వంతో కాంట్రాక్టు నేపథ్యంలో అదాని స్మార్ట్ మీటర్లు ఎపిఇపిడిసిఎల్ పరిధిలో 72 లక్షలు, ఎపిఎస్‌పిడిసిఎల్‌లో 73 లక్షలు, ఎపిసిపిడిసిఎల్ పరిధిలో 52 లక్షలు రానున్నాయి. వీటి ఏర్పాటును రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకున్నా, మన రాష్ట్రం మాత్రం కొనసాగిస్తోంది.