- తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై యాత్రికులు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పెద్దలను వదిలేసి చిన్నవాళ్లను శిక్షించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. టిటిడి ఇఒ, చైర్మన్ మధ్య సమన్వయ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అంగీకరించారు. అయినా వారిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతిలో ఎనిమిది కౌంటర్ల ఏర్పాట్ల ఏర్పాటుకు సంబంధించి 15సార్లు సమీక్షా సమావేశాలు జరిగితే చైర్మన్ బిఆర్‌నాయుడు, ఇఒ శ్యామలరావు కలిసి ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 14సార్లూ వారిద్దరిలో ఎవరో ఒకరే పాల్గొన్నారు. యాత్రికులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ద్వారా గంటలోపే దర్శనం కల్పిస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రతిపాదించారు. అయితే, రెండో సమావేశానికి నాటికి ఇఒ శ్యామలరావు, అడిషనల్ ఇఒ వెంకయ్యచౌదరి ఇది సాధ్యం కాదని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచీ టిటిడి చైర్మన్, ఇఒ మధ్య సమన్వయ లోపం ఉంటోందని ప్రచారం జరుగుతోంది. ఇదే భక్తుల ప్రాణాలమీదకు తెచ్చిందని అంటున్నారు. సంఘటన జరిగిన బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. టోకెన్ల జారీకి తిరుమలలో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు. టోకెన్ లేనిదే వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు భక్తులు రావద్ద’ంటూ ఇఒ, చైర్మన్ ఇద్దరూ ఉమ్మడిగా ప్రకటించారు. ఆధార్ కార్డు చూపించి తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్ తీసుకుని రావాలని కోరారు. వైకుంఠ ఏకాదశి రెండు రోజులు ఉందనగా టిటిడి ఛైర్మన్ విలేకర్ల సమావేశం పెట్టి తిరుమలకు భక్తులను రావద్దని తాము చెప్పడం లేదని, ఎప్పుడైనా రావచ్చని ప్రత్యేకంగా చెప్పారు. టిటిడి ఇఒ మాత్రం టోకెన్ ఉంటేనే తిరుపతికి రావాలని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఉన్నత స్థాయిలోసమన్వయ లోపం కారణంగా జరిగిన దుర్ఘటనకు అధికారులు బలైపోయారని భక్తుల్లో చర్చ నడుస్తోంది. న్యాయ విచారణ జరిపిస్తే టిటిడి చైర్మన్, ఇఒల మధ్య సమన్వయలోపం విషయం బయటకు వస్తుందని అంటున్నారు.