నత్తనడకన జల్‌జీవన్‌

Feb 10,2025 07:26 #National Jal Jeevan Mission

 రాష్ట్రం అడిగింది రూ.70వేల కోట్లు
 కేంద్రం ఇచ్చింది 2,407 కోట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను సాధించడం అసాధ్యంగా మారుతోంది. ప్రజలందరికి నిరంతరాయంగా రక్షిత తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్నిఉద్దేశించిన సంగతి తెలిసిందే. ఈ పథకం గురించి సాగుతున్న అట్టహాసపు ప్రచారం ఎలా ఉన్నప్పటికీ, ఆచరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా పనులు నత్తనడకన సాగనున్నాయన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రం 70 వేల కోట్ల రూపాయలుకావాలని కేంద్రాన్ని కోరితే, కేవలం 2,407 కోట్ల రూపాయలే తాజా బడ్జెట్‌లో కేటాయించడం దీనికి కారణం. ఈ విధంగా నిధులు కేటాయింపులు చేస్తే పథకం లక్ష్యాలను చేరుకోవడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు!
స్వయంగా విజ్ఞప్తి చేసిన పవన్‌
ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నవంబర్‌ నెలలో జరిపిన ఢిల్లీ పర్యటనలో ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వయంగా వినతిపత్రం అందచేశారు. ఈ పథకం కింద అవసరమైన నిధులు విడుదలచేయడానికి ప్రధాని సానుకూలంగా ఉన్నారని కూడా ఈ భేటీ అనంతరం ఆయన ప్రకటించారు. ప్రధానితో తాను జరిపిన చర్చలకు అనుకూలంగా ఆయనే ప్రతిపాదనలను తయారు చేయించి కేంద్రానికి అందచేశారు. స్వయంగా పవన్‌ విజ్ఞప్తి చేయడం, ప్రధాని సానుకూలత వ్యక్తం చేయడంతో నిధుల రాకపై అధికారయంత్రాంగం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే, కేంద్ర బడ్జెట్‌లో (2025-26)లో కేటాయించిన జల్‌జీవన్‌ మిషన్‌ (జెజెఎం)/నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌డిడబ్ల్యూఎం)కు రూ.67 వేలకోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో కేవలం రూ.2,407.32 కోట్లు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు కేంద్రం నుండి రాష్ట్రానికి అందాయి. భారీ ఎత్తున పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్న అధికారులు ఈ పరిణామంతో అయోమయంలో పడ్డారు.

2028తో ముగియనున్న జెజెఎం
కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం ప్రారంభించింది. తొలుత ప్రకటించిన వివరాల ప్రకారం 2026 నాటికి ఈ పథకం పూర్తవ్వాల్సి ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కుళాయి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో 2028 వరకూ ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం రూ.70 వేలకోట్లు నిధులు కేటాయించాలంటే ఏడాదికి సుమారు రూ.23 వేల కోట్లు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా ఈ పథకానికి రూ.70,163 కోట్లను కేటాయిస్తూ భారీగా నిధులు చూపించినా చివరికి సవరించి రూ.22,694 కోట్లకే పరిమితం చేశారు.

జెజెఎంలో
రాష్ట్రానికి కేటాయింపుల వివరాలు
సంవత్సరం    నిధులు (రూ.కోట్లలో)
2019-20    రూ.372.64
2020-21    రూ.790.48
2021-22    రూ.3.182.28
2022-23    రూ.3,458.20
2023-24    రూ.6,530.49
2024-25    రూ.2,520.97
2025-26    రూ.2,407.32
(అంచనా)

➡️