ప్రతీ మహిళకు నెలకు రూ. 1000

Mar 5,2024 10:11 #Arvind Kejriwal, #Delhi Budget
  • ఢిల్లీ బడ్జెట్‌లో ప్రత్యేక పథకం
  • రూ. 76 వేల కోట్లతో బడ్జెట్‌ సమర్పణ
  • అత్యధికంగా విద్యకు రూ.16,396 కోట్లు

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందచేసే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ను రాష్ట్ర ఆర్థిక మంత్రి అతిషి సోమవారం ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం 2024-25కి రూ. 76 వేల కోట్లతో అసెంబ్లీలో సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పై పథకాన్ని మంత్రి ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 లభిస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళ ఢిల్లీ ఓటరు అయి ఉండాలని, ఇతర ప్రభుత్వ పథకం కింద ప్రయోజనాలను పొందకూడదని, అలాగే ఆదాయపు పనుు చెల్లింపుదారుగా ఉండకూడదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఢిల్లీలో 67,30,371 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే, ప్రస్తుతం పాఠశాలల స్థాయిలో అమలు చేస్తున్న బిజినెస్‌ బ్లాస్టర్స్‌ పథకాన్ని విశ్వ విద్యాలయాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐ)ల్లో కూడా అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. గత ఏడాది ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిషీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అతిషి తన ప్రసంగంలో ఢిల్లీలో విజయవంతమైన విద్య, ఆరోగ్య నమూనాలను ప్రవేశపెట్టడంలో మాజీ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఇడి అరెస్టు చేయడంతో ఈ ఇద్దరూ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అతిషి తన ప్రసంగంలో ‘కేజ్రీవాల్‌ ప్రభుత్వం వరుసగా తన పదో బడ్జెట్‌ను ప్రవేశపెడుతునుందుకు ఇది గర్వించదగ్గ క్షణం. నేను సమర్పిస్తునుది కేవలం పదో బడ్జెట్‌ మాత్రమే కాదు. ఢిల్లీని మార్చే చిత్రాన్ని సమర్పిస్తున్నాను. దేశ రాజధాని ప్రజలందరకూ కేజ్రీవాల్‌ ఒక ఆశా కిరణం’ అని కూడా తెలిపారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో అత్యధికంగా విద్యా రంగానికి రూ.16,396 కోట్లను మంత్రి కేటాయించారు. విద్యారంగంలో ఆప్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యా కేటయింపుల్లో రూ. 100 కోట్లను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సిఇఆర్‌టి) కేటాయించగా, నూతన పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణానికి రూ. 150 కోట్లను కేటాయించారు. తరగతుల గదుల నిర్వహణకు రూ. 45 కోట్లు కేటాయించారు. అలాగే సోమవారం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ. 8,685 కోట్లు కేటాయించారు. ఆసుపత్రుల్లో ఉత్తమ సౌకర్యాల కోసం రూ. 6,215 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, ఎస్‌సి-ఎస్‌టి-ఒబిసి సంక్షేమ శాఖల కింద వివిధ పథకాల కోసం రూ. 6,216 కోట్లును కేటాయించారు. కాగా, ఢిల్లీలో గత ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ 78,800 కోట్లుతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో జి20 సమావేశాల సన్నాహల కోసం తొమ్మిది పథకాలను కూడా ఉన్నాయి.

➡️