- ఆగస్టులో మైనస్ 1.8 శాతం
- మూడున్నరేళ్లలో తొలిసారి ప్రతికూల వృద్ధి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన మౌలిక వసతుల రంగాలు ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. మూడున్నరేళ్ల తర్వాత తొలిసారి మైనస్ స్థాయికి పడిపోయాయి. కేంద్ర పరిశ్రమల, వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2024 ఆగస్టులో ఎనిమిది కీలక రంగాల్లో 1.8 శాతం ప్రతికూల వృద్ధి నమోదయింది. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి భారీగా క్షీణించింది. ఇంతకు క్రితం జులైలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ లాంటి ఎనిమిది కీలక రంగాలు 6.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఆగస్ట్ నెలలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్ రంగాలు వరుసగా 8.1 శాతం, 3.4 శాతం, 3.6 శాతం, 1 శాతం, 3 శాతం, 5 శాతం చొప్పున ప్రతికూల వృద్ధి చోటుచేసుకున్నాయి. . సహజ వాయువు ఉత్పత్తి వరుసగా రెండో మాసంలోనూ మందగించింది. గత తొమ్మిది నెలల్లో ఎన్నడూ లేని విధంగా సిమెంట్ రంగం క్షీణించగా.. రిఫైనరీ ఉత్పత్తులు మూడు నెలల్లో రెండో సారి పతనమయ్యాయి.
మరోవైపు ఎరువులు 3.2 శాతం వృద్ధితో కొంచెం నయమనిపించాయి.. స్టీల్ ఉత్పత్తి 4.5 శాతానికి మందగించింది. 2024లో ఇదే నెలలో ఉక్కు రంగం 16.4 శాతం వృద్థి సాధించింది. దేశంలోని మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)లో కీలక రంగాల వాటా 40.27 శాతంగా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎనిమిది రంగాలు మైనస్‌లోకి జారుకోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని భావించవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో కీలక రంగాల పరిశ్రమల ఉత్పత్తి భయంకరంగా పడిపోయిందని ఇక్రా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గడచిన 42 నెలల్లో ఇదే అతి పెద్ద పతనం అని తెలిపింది.