- రైతు వెన్ను విరిచిన భారీ వర్షాలు, కరువు
- పన్నెండున్నర లక్షల ఎకరాలు ఖాళీ
- చేతికిరాని సాగైన పంటలు
- ఈ నెలాఖరుతో ముగుస్తున్న సీజన్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : సీజన్ ఆరంభంలో అనావృష్టి అనంతరం అతివృష్టి ఈ తడవ ఖరీఫ్ రైతును నిలువునా కుంగదీశాయి. ఒకే పంట కాలంలో రెండు రకాల విపత్తులను అన్నదాతలు తరచు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ ఈ నెలాఖరుతో ముగుస్తోంది. సెప్టెంబర్ 25 వరకు కావాల్సిన సాధారణ సాగులో పన్నెండున్నర లక్షల ఎకరాలు విత్తు పడక బీడు పడ్డాయి. నార్మల్ సాగు విస్తీర్ణంలో ఇది 12 శాతం. ఇదిలా ఉండగా జులై, ఆగస్టులో తీవ్ర వర్షాభావం, ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు, వరదలు వేసిన పంటలను నాశనం చేశాయి. వరదల వలన ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. వాస్తవ నష్టం ఇంకా ఎంతో ఉంటుందని బాధిత రైతులు వాపోతున్నారు. అటు వర్షాభావానికి ఇటు వర్షాలు, వరదలకు పోయింది పోగా మిగిలిన పంట చివరాఖరికి ఎంత చేతికొస్తుందో, అసలెంత దక్కుతుందో తెలీదు. భారీగా దిగుబడులు తగ్గుతాయని మాత్రం అంచనాలు కడుతున్నారు.
డ్రైస్పెల్స్..ఫ్లడ్స్
ఖరీఫ్‌లో సాంకేతికంగా ఇప్పటికి రాష్ట్రంలో సగటున సాధారణ వర్షం కంటే 21 శాతం అధికంగా పడింది. 18 జిల్లాల్లో నార్మల్ కంటే ఎక్కువ, 8 జిల్లాల్లో నార్మల్ స్థాయి వర్షం కురిసింది. కానీ జులైలో 113 మండలాల్లో డ్రైస్పెల్ నెలకొంది. ఆగస్టులో 234 మండలాల్లో సింగిల్ డ్రైస్పెల్, 10 మండలాల్లో డబుల్ డ్రైస్పెల్ తిష్ట వేసింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం నుంచి రాయలసీమ వరకు తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో సేద్యం స్తంభించగా అప్పటికే వేసిన పంటలు ఎండిపోయాయి. ఒక సమయంలో కృష్ణా డెల్టాకు నీటి కటకట ఏర్పడింది. ఎగువన ప్రాజెక్టుల్లో నీరు లేక కొన్ని రోజులు పట్టిసీమ నీటిపై ఆధారపడాల్సి వచ్చింది. ఇది కొనసాగుతుండగా కొన్ని ప్రాంతాల్లో జులైలో భారీ వర్షాలు పంటలను ముంచాయి. ఆగస్టు చివరన, సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన అసాధారణ వర్షాలకు, కృష్ణా, గోదావరి, బుడమేరు, ఒకటేమిటి అన్ని వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉప్పొంగి పంటలను కబళించాయి. వర్షాభావం, అధిక వర్షాలు, వరదల వలన ఖరీఫ్ సేద్యం సాగలేదు. కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలన్నా అంతగా సాగు కాలేదు.
నిరుటి కంటే తగ్గిన వేరుశనగ, పత్తి
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 81 లక్షల ఎకరాలు కాగా 68.60 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. లోటు 12.40 లక్షల ఎకరాలు. చిరుధాన్యాలలో మొక్కజొన్న, సజ్జ, పప్పుధాన్యాలలో కందులు, మినుములు, నూనెగింజల్లో ఆముదాలు మాత్రమే నార్మల్ సాగును కొంత వరకు దాటాయి. తతిమ్మా పంటలన్నీ తగ్గాయి. సాగు బాగుందనుకున్నవి కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులను, తెగుళ్లను అధిగమించి ఎంత వరకు నిలబడతాయో అనుమానమే. వరి 10 శాతం తగ్గింది. వేరుశనగ దారుణంగా ఉంది. నార్మల్‌లో సగమే వేశారు. పత్తిదీ అదే వరస. సహజంగా వాణిజ్య పంటల్లో పత్తి కొన్నేళ్లగా ఊపులో సాగవుతోంది. నిరుడు, ఈ ఏట ఆ ధోరణిలో మార్పొచ్చింది. నిరుటి కంటే సైతం ఈ సంవత్సరం తగ్గింది. సాధారణ సాగులో 67 శాతమే పడింది.