‘కొల్లేరు’ మళ్లీ కల్లోలం

Apr 11,2025 04:16 #destruction, #fish ponds, #Kolleru
  • చేపల చెరువుల ధ్వంసంతో గగ్గోలు
  • 3వ కాంటూరుకు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానించినా అమలుకు నోచని వైనం
  • జిరాయితీ, సొసైటీ భూములను వెనక్కి ఇవ్వాలని కోరుతున్న జనం

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ‘ఆపరేషన్‌ కొల్లేరు’ పేరుతో 2006లో చేపల చెరువులను ధ్వంసం చేసి అక్కడి ప్రజలను రోడ్డున పడేసిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడూ అదే తీరున ముందుకు సాగుతుండటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర అందోళన నెలకొంది. కొల్లేరును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పాలకులు అమలు చేయకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాయితీ, సొసైటీ భూములను తమకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఏలూరు, ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి మొత్తం తొమ్మిది మండలాల పరిధిలో 77,138 ఎకరాల్లో కొల్లేరు ఉంది. కొల్లేరులోని బెడ్‌, బెల్ట్‌ గ్రామాలు 122 ఉండగా, దాదాపు ఐదు లక్షల జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు కొల్లేరే జీవనాధారం. 1981లో జలగం వెంగళరావు ప్రభుత్వం కొల్లేరులో చేపల చెరువులను తవ్వించింది. ప్రభుత్వమే 156 సొసైటీలను ఏర్పాటు చేసి ఎస్‌సి, బిసి, ఇబిసి ప్రజలకు 5,500 ఎకరాలను పంపిణీ చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో 2006లో ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో మొత్తం 43,724 ఎకరాల పరిధిలోని 1,756 చేపల చెరువులను అప్పటి ప్రభుత్వం బాంబులు పెట్టి మరీ ధ్వంసం చేసింది. దీంతో, కొల్లేరు ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలంటూ 2008, 2014ల్లో అసెంబ్లీలో తీర్మానించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. జిరాయితీ భూములు 14,218 ఎకరాలు, సొసైటీ భూములు 5,500 ఎకరాలు మొత్తం 20,218 ఎకరాలను తిరిగి ప్రజలకు అప్పగించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఆ భూములను అప్పగిస్తామంటూ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి మాట తప్పింది.

సిపిఎం ప్రజాచైతన్య యాత్రలో నాయకుల వద్ద కొల్లేరు వాసుల మొర

కొల్లేరు కాంటూరు లెక్కలు అశాస్త్రీయంగా ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో అప్పట్లో 14,218 ఎకరాల జిరాయితీ భూముల్లోని చేపల చెరువులను ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీనిపై ప్రజలు తిరగబడడంతో నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. కొంతమంది రైతులు జిరాయితీ భూముల్లో చెరువును కొంతమేర పునరుద్దరించుకుని చేపల సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ కోర్టు ఆదేశాలంటూ చెరువులన్నింటికీ గండ్లు కొడుతున్నారు. దీంతో, తమను ఆదుకోవాలంటూ కొల్లేరు ప్రజలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా సిపిఎం నాయకులు కొల్లేరులో పర్యటించగా అక్కడి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిఒ 120ని తక్షణమే రద్దు చేయాలని, మూడో కాంటూరుకు కుదించాలని, సొసైటీలను పునరుద్దరించాలని, కొల్లేరు చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వస్తున్న మురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని, అటవీ శాఖాధికారుల వేధింపులు అరికట్టాలని, ఉపాధి హామీ చట్టం ద్వారా కొల్లేరు ప్రజలకు ఉపాధి పనులు కల్పించాలని, కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం అందించాలని, కొల్లేరు గ్రామాలకు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌, తాగునీరు సదుపాయాలు కల్పించాలనే 16 డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు.

➡️