కృష్ణా డెల్టా సాగుకు నీరేది?

Jun 8,2024 08:59

– గోదావరిలో 14 అడుగులకు చేరని ప్రవాహం
– ఖాళీ అయిన ‘పులిచింతల’
-ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి:ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటి విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది జూన్‌ ఏడో తేదీనే ఖరీఫ్‌ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించలేదు. మరోపక్క ఎగువ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కాల్వలు, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కనీస నిర్వహణ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో, సాగునీరు, పంటల సాగులో సమస్యలు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో కృష్ణా జిల్లాలో 4,27,294 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 4,10,825 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. నీటి లభ్యత ఆసరాగా కాలువల ఎగువ ప్రాంతాల్లో జూన్‌లోనూ, శివారు ప్రాంతాల్లో జులైలోనూ వరి నారు మళ్లు వేస్తారు. ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా నీరు విడుదల చేసిన తర్వాతే అత్యధిక విస్తీర్ణంలో వరి సాగుకు సన్నద్ధమవుతారు. నారుమళ్లు వేస్తారు. వరి మాగాణుల్లో రెండో పంటగా రబీలో అపరాలు సాగు చేస్తారు. మొదటి పంట సాగులో జాప్యం జరిగితే రెండో పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. నవంబర్‌ నెలాఖరులోపు అపరాల పంట సాగు మొదలైతేనే వాతావరణం సహకరించి దిగుబడులు వస్తాయి. ఈ నేపథ్యంలో జూన్‌, జులై, ఆగస్టుల్లో నాట్లు పూర్తి చేయడానికి రైతులు ప్రయత్నిస్తారు. ఈ ఏడాది నీటి విడుదలపై ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటి వరకు ప్రణాళిక విడుదల చేయలేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్‌ ఎడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
సాగు నీటి విడుదలలో తీవ్ర జాప్యం?
ప్రకాశం బ్యారేజీకి ఎగువ ఉన్న పులిచింతల ప్రాజెక్టు నీరులేక బోసిపోతోంది. గోదావరి నదిలో 14 అడుగులకుపైబడి ప్రవాహం ఉంటేనే పట్టిసీమ ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించాలి. గోదావరిలో ప్రవాహం ఆ స్థాయిలో లేదు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువన వర్షాలు కురిసి నీటి ప్రవాహం పెరిగిన తర్వాతే నదుల నుంచి నీటి విడుదల సాధ్యం అవుతుంది. దీంతో, ఈ ఏడాది డెల్టాకు నీటి విడుదలలో తీవ్ర జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
కాలువలు, డ్రెయిన్ల నిర్వహణకు నిధులు కరువు
డెల్టాలోని కాల్వలు, డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నాలుగు రోజులు ఎండలు కాస్తే దిగువ ప్రాంతాలకు నీరు అందడం గగనమవుతోంది. రెండు రోజులు వర్షం కురిస్తే డ్రెయిన్లలో నీరు కదలక ఎగదన్ని పంట పొలాలను ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకు ఈ ఏడాది రూ.53 కోట్లు అవసరం అవుతాయని కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (సిఎడిఎ)కు ఇరిగేషన్‌ అధికారులు నివేదికలు పంపారు. నీటి శిస్తు ద్వారా సమకూరిన నిధులను మాత్రమే వీటి నిర్వహణకు సిఎడిఎ కేటాయిస్తోంది. ఈ ఏడాది ఎన్నికల్లో మునిగిపోవడంతో చాలా గ్రామాల్లో నీటి శిస్తు చెల్లింపులకు సంబంధించి ఆన్‌లైన్‌ సైట్‌ను అప్‌డేట్‌ చేయలేదు. నామమాత్రంగానే వసూళ్లు జరిగాయి. దీంతో, కనీస నిర్వహణకు ఈ ఏడాది నిధులు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

➡️