- బేజారెత్తిస్తున్న మేత ధరలు
- పెంపకంపై తీవ్ర ప్రభావం
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : గుడ్లు ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతోంది. మేత ధర ఆకాశాన్నంటడం, గుడ్డు ధరలు ఎగుడు దిగుడులతో ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు. క్రమేణా లేయర్ కోళ్ల పెంపకానికి దూరమవుతున్నారు. దీంతో, కొన్ని ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన షెడ్లను సైతం తొలగిస్తున్నారు. గుడ్లు ఉత్పత్తి చేసే లేయర్ ఫౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు అందించే దాణాలో 55 శాతం మొక్కజొన్న, నూకలు వాడతారు. గత రెండేళ్లగా నూకలు, బియ్యం, మొక్కజొన్న తదితరాలు ఇథనాల్ పరిశ్రమలకు ఎక్కువగా తరలిపోతుండడంతో వాటి ధరలు పెరిగిపోతున్నాయి. రెండేళ్ల క్రితం మొక్కజొన్న ధర టన్ను రూ.19,500 ఉండేది. ప్రస్తుతం రూ.27 వేలకు చేరింది. నూకలు ధర రూ.18 వేల నుంచి రూ.28 వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గత ఆగస్టులో ఎన్నడూ లేనివిధంగా కోళ్ల మేత ధర టన్ను రూ.30 వేలకు చేరుకుంది. ప్రస్తుతం కొద్దిగా తగ్గినా గతేడాదితో పోలిస్తే టన్నుకు రూ.2 వేలు అధికంగా ఉంది. గతేడాది టన్ను మేత రూ.25 వేలకు విక్రయించగా, తాజాగా రూ. 27 వేలకు విక్రయిస్తున్నారు. కోళ్ల ఫారం నిర్వహణ, గుడ్ల ఉత్పత్తికి ముందు కోడి పెంపకం, రోజువారీ మేతలు, విద్యుత్, ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే ఒక గుడ్డు ఉత్పత్తికి సగటున రూ.4.95 వ్యయం అవుతోందని ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 వరకు రైతులకు గుడ్ల ధర సగటున రూ.4.90 మాత్రమే వచ్చింది. ఒక్కో గుడ్డుకు సగటున ఐదు పైసల వరకు నష్టపోయారు. కృష్ణా జిల్లా చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, మొవ్వ, బాపులపాడు, గన్నవరం మండలాల్లో, ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరు, మైలవరం, విస్సన్నపేట తదితర మండలాల్లో కోటీ 25 లక్షల సామర్థ్యం కలిగిన గుడ్ల ఉత్పత్తి (లేయర్) చేసే కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 80 లక్షల కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. రాష్ట్రంలో ఆరు కోట్ల లేయర్ కోళ్ల పెంపకానికి సామర్థ్యం ఉన్నా, నాలుగు కోట్ల కోళ్లు మాత్రమే పెంపకం జరుగుతోంది. గిట్టుబాటు కాకపోవడంతో ఏలూరు జిల్లా నూజివీడులో 1.40 లక్షలు, కంకిపాడు, ప్రొద్దుటూరులలో 30 వేల సామర్థ్యం ఉన్న లేయర్ కోళ్ల షెడ్లను తొలగించారు.