రెగ్యులరైజేషన్‌కు ఎదురుచూపులు

Jan 17,2024 11:28 #regularization
  • ఆదేశాలిచ్చినా..అమలులో అంతులేని జాప్యం
  • ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌ మళ్లీ ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసి నాలుగు నెలలవుతున్నా అనేక శాఖల్లో నేటికీ ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఆయా ఉద్యోగుల మాతృ శాఖల విభాగాధిపతుల (హెచ్‌ఓడి) వద్దే రెగ్యులరైజేషన్‌ ఫైళ్లు పేరుకుపోతున్నాయి. హెచ్‌ఓడిలను దాటి ఒక్క ఫైలూ ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ ప్రక్రియ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ చందంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,117 మందిని రెగ్యులర్‌ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. కానీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం..సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తుండటంతో రెగ్యులరైజేషన్‌ను మళ్లీ అటకెక్కించేస్తారేమోనన్న భయాందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. వెనువెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే తమ రెగ్యులర్‌ ప్రక్రియ పూర్తి అవుతుందో లేదోనని ఉద్యోగులు పరేషన్‌ చెందుతున్నారు.

టైమ్‌ స్కేల్‌ అమలయ్యేది ఎన్నడు ?

ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ వర్తింపజేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించినప్పటికీ ఆచరణలో రెవిన్యూ శాఖతో పాటు పలు శాఖల్లో అనేక మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నేటికీ టైమ్‌ స్కేల్‌ అమలుకు నోచుకోలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ ఫైళ్లను ఫ్రభుత్వానికి పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. టైమ్‌ స్కేల్‌ అమలు కాక పోవడంతో రెగ్యులరైజేషన్‌ ప్రకియ ఆలస్యమవుతుందని ఫలితంగా ఆర్థికంగా వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైమ్‌ స్కేల్‌ వర్తింపజేసి రెగ్యులర్‌ చేస్తే తమ బేసిక్‌ పెరుగుతుందని, అలా కాకుండా రెగ్యులర్‌ చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు 1995 నుంచి పనిచేస్తున్న లెక్చరర్స్‌ , పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌పై అనేక మంది పనిచేస్తున్నారు. తాము కాంట్రాక్టు ఉద్యోగులకంటే ముందునుంచే పనిచేస్తున్నామని తమను రెగ్యులర్‌ చేయాలంటూ వారంతా కోర్టును ఆశ్రయించారు.

ఆరు నుంచి పది దశలు

కాంట్రాక్టు కింద పని చేస్తున్న ఉద్యోగి రెగ్యులర్‌ కావాలంటే ఆరు దశల నుంచి పది దశలు దాటాల్సి ఉంటుంది. అందులో తొలుత ఆయా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని హెచ్‌ఓడి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఉద్యోగి మాతృశాఖకు ఆ ఫైలు వెళుతుంది. అక్కడ ఉద్యోగికి సంబందించి జాయినింగ్‌, వేకెన్సీ పొజీషన్‌, ఉద్యోగి సర్వీస్‌కు సంబందించిన పలు అంశాలను పరిశీలించి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ నుంచి ఆర్ధికశాఖకు ఆ ఫైలు క్లియరెన్స్‌ కోసం పంపుతారు. ఫైలు పరిశీలన అనంతరం ట్రెజరీలకు పంపాల్సి ఉంటుంది. అనంతరం ఫైలు అక్కడ నుంచి తిరిగి ఆర్ధిక శాఖకు చేరుతుంది. ప్రకియ ఇలా ఉండగా నేటికీ అనేక జిల్లాల్లో ఫైళ్లు మొటి దశలోనే ఉన్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రకాశం, నెల్లూరు రాయలసీమ జిల్లా ఫైళ్లు అనుకున్నంత వేగంగా ఫైళ్లు కదలడం లేదని తెలుస్తోంది.

కోడ్‌ వచ్చే లోగా రెగ్యులరైజ్‌ చేయాలి

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ వచ్చే లోగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి. హెల్త్‌ , ఎడ్యుకేషన్‌ శాఖల్లోని ఉద్యోగులు యుద్ద ప్రాతిపదికన అమలు చేసేందుకు కృషి చేయాలి. ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని భావించాల్సి వస్తుంది. వైద్య ఆరోగ్యశాఖలో డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంత మంది మినిస్టీరియల్‌ స్టాఫ్‌ జీఓలో పేర్కొన్న ఉద్యోగులను కాకుండా ఇతరులను రెగ్యులర్‌ చేయాలంటూ అక్రమాలకు తెరలేపారు. డిఅండ్‌హెచ్‌ఓ కార్యాలయాల్లో సిబ్బందిని బదిలీ చేయకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయడం కుదరదు. కొందమందిని బదిలీ చేసినా వారం తిరగకముందే తిరిగి డిఎంఅండ్‌ హెచ్‌ఓ కార్యాలయాల్లో డిప్యుటేషన్‌ పేరుతో తిష్టవేస్తున్నారు. ఉద్యోగుల రెగ్యులర్‌ పేరుతో కొందరు అక్రమాలకు తెరలేపడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రెండు సార్లు పత్రికా ప్రకటనలిచ్చినప్పటికీ క్షేత్రస్ధాయిలో అమలుకు నోచుకోలేదు.

– ఎవి నాగేశ్వరరావు, ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ టీచర్స్‌ జెఎసి

➡️